అమ్మవారి సొమ్ము.. హారతి కర్పూరంలా..

Corruption in Durga Temple Funds - Sakshi

దుర్గగుడిపై ‘కోటి దీపోత్సవ’ భారం

7,500 లడ్డూ, పులిహోర ప్యాకెట్లకు టెండరు

వీటి ఖర్చు రూ.1.50 లక్షలకు పైమాటే

కృష్ణమ్మ హారతుల ఖర్చూ దేవస్థానం పైనే

సాక్షి, విజయవాడ: విజయవాడలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్, దేవాదాయశాఖల సంయుక్త  ఆధ్వర్యంలో గురువారం రాత్రి స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో కోటి దీపోత్సవం జరిగింది. దీని ఖర్చు భారం దుర్గగుడిపై మోపారన్న విమర్శలు వస్తుండటంతో సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.

లడ్డూ ప్రసాదాలకు టెండర్‌..
కోటి దీపోత్సవానికి 10వేల మంది భక్తులు వస్తారని అంచనా. అయితే 12 వేల మందికి ఏర్పాట్లు చేశారు. దీపోత్సవంలో కూర్చునే వారికే పూజాసామగ్రి, లడ్డూ, పులిహోర ప్రసాదాల వితరణ చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబే ఈ కార్యక్రమానికి స్వయంగా రావడంతో ఏర్పాట్లు ఘనంగా చేశారు. ఇందులో భాగంగా భక్తులకు ఉచిత ప్రసాదాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. దీని కోసం దుర్గగుడి నుంచి 7,500 లడ్డూలు, పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేయాలంటూ దేవాదాయశాఖాధికారులు ఆదేశించారు. దీంతో అప్పటికే భక్తులకు విక్రయించడానికి సిద్ధంగా ఉన్న 7,500 లడ్డూ,పులిహోర ప్యాకెట్లును ఇందిరాగాంధీ స్టేడియానికి తరలించారు.

రూ. 1.50లక్షల భారం..
ఒక్కొక్క లడ్డూ రూ.15, పులిహోర ప్యాకెట్‌ రూ.5 చొప్పున మొత్తం రూ.1.50 లక్షలు దుర్గమ్మ ఖాతాలో వేశారని ఇంద్రకీల్రాదిపై ప్రచారం జరుగుతోంది. ఇది కాకుండా దేవస్థానం నుంచి వేదపండితుల్ని పంపమంటూ ఆదేశాలు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పొల్గొనడం వల్ల ఏమాత్రం తేడా రాకూడదని దేవస్థానం వేదపండితుల్ని, ప్రసాదాలను వినియోగిస్తున్నారని తెలిసింది. దేవస్థానానికి ఏమాత్రం సంబంధం లేకుండా హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్టుకు పేరు వచ్చే ఈ కార్యక్రమానికి దుర్గగుడి ఖాతా నుంచి చెల్లించాలని నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నారు.

ప్రతి నెల రూ.5 లక్షలు భారం..
రాష్ట్ర ప్రభుత్వం ఫెర్రీలో ఆర్భాటంగా కృష్ణా, గోదావరి నీరు కలిసే చోట సంగమ ప్రదేశంగా ప్రకటించింది. ఇక్కడ ప్రతి రోజు కృష్ణమ్మకు హారతులు ఇస్తున్నారు. ఈ హారతులకు ప్రతి నెల రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చును దుర్గమ్మ ఖాతా నుంచి చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. కనీసం దుర్గాఘాట్‌లో జరగని కృష్ణమ్మ హారతులకు దుర్గగుడి ఖాతా నుంచి ఎందుకు నిధులు చెల్లింస్తున్నారనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. రాజధాని అమరావతిలో జరిగే పలు కార్యక్రమాలకు దేవాదాయశాఖ చేయాల్సిన ఖర్చును సైతం దుర్గగుడి నెత్తిన వేయడంపై భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top