సామాజిక ఖాతాలపై నిఘా | Corporate Offices Surveillance Social Media West Godavari | Sakshi
Sakshi News home page

సామాజిక ఖాతాలపై నిఘా

Jul 3 2018 9:14 AM | Updated on Oct 22 2018 6:10 PM

Corporate Offices Surveillance Social Media West Godavari - Sakshi

తణుకు : తెల్లారి లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు అరచేతిలో సెల్‌ఫోన్‌ ఉండాల్సిందే.. ఇంటర్నెట్‌ దాదాపు అందరికీ అందుబాటులోకి రావడంతో ఇటీవలి కాలంలో ఎక్కువగా ఫేస్‌బుక్‌ను యువత విరివిగా వాడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఏం చేశాం.. ఎక్కడకు వెళ్లాం.. అనే వివరాలు స్నేహితులతో పంచుకుంటున్నారు. వీటిలో కొన్ని వ్యక్తిగత అంశాలు ఉంటున్నాయి. ప్రేమ వ్యవహారాలు, మందు పార్టీలకు హాజరు తదితర అంశాలను యువత వెబ్‌సైట్లలో ఉంచుతోంది. అయితే మనకు తెలియకుండానే కొన్ని సంస్థలు రహస్యంగా మానసిక పరిపక్వతను అంచనా వేస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ వ్యక్తిత్వాన్ని పసిగడుతున్నాయి.

ఉద్యోగాలు ఇచ్చే కొన్ని ప్రైవేట్‌ సంస్థలు సైతం కొత్త కొత్త విధానాలతో అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. ప్రతిభ, బహుభాషా నైపుణ్యాలు ఉంటే చాలు.. ఉద్యోగం ఇట్టే పట్టేయవచ్చనే భావన అభ్యర్థుల్లో ఉండటం సహజం. దీనికితోడు మంచి వ్యక్తిత్వం కూడా ఉండాలని ఆయా సంస్థలు కోరుకుంటున్నాయి. సామాజిక అనుసంధాన వేదికల ద్వారా వారికి కావాల్సిన సమాచారాన్ని తీసుకుంటున్నాయి. కొలువు కోసం పోటీపడే అభ్యర్థులకు తెలియకుండానే అనేక అంశాలను యాజమాన్యాలు పరిశీలిస్తున్నాయి. నిత్యం సామాజిక వెబ్‌సైట్లు, సోషల్‌ నెట్‌వర్క్‌ల్లో వీరవిహారం చేసే యువత ఇక జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వ్యక్తిత్వానికే పెద్దపీట
ఇప్పటివరకు ఉద్యోగానికి వెళ్లే అభ్యర్థికి కావాల్సింది ముందుగా సంబంధిత రంగంలో ప్రతిభాపాటవాలు మెండుగా ఉండటం. మాతృభాషతో పాటు ఇంగ్లిష్‌పై పట్టు, సామాజిక అంశాలపై అవగాహన ఇవే ప్రధానం. ఇవన్నీ ఉన్నా.. కొందరు అభ్యర్థులు ఉద్యోగావకాశాలను కోల్పోతున్నారు. దీనికి కారణంగా ఆయా సంస్థలు అనుసరిస్తున్న సామాజిక నిఘా విధానమే. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్, మరికొన్ని రంగాల సంస్థలు అభ్యర్థి మనస్తత్వం, వ్యవహార శైలి, గుణగణాలు తెలుసుకునేందుకు సామాజిక వెబ్‌సైట్లపై నిఘా పెడుతున్నాయి. ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌ ఉద్యోగం విషయంలో సైతం ఈ విధానం అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగానికి దరఖాస్తు చేసే సమయంలో పొందుపర్చిన ఈ మెయిల్‌ ఐడీ ఆధారంగా అతని ఫేస్‌బుక్, ట్విట్టర్, ఆర్కుట్, ఇన్‌స్ట్రాగామ్‌ వంటి ప్రముఖ సైట్లలో అభ్యర్థికి ఉన్న ఖాతాలపై సంస్థలు నిఘా పెడుతున్నాయి. ఈ మెయిల్‌ ఐడీ లేదా అభ్యర్థి పూర్తిపేరు ఆధారంగా ఖాతాను కనుక్కోవడం ప్రస్తుతం సామాజిక సైట్లలో సులభంగానే మారింది. ఈ విధానం ఉత్తర భారతదేశంలో ఇప్పటికే బాగా విస్తరించింది. తాజాగా దాదాపు యాభై శాతం పైగా సంస్థలు అభ్యర్థుల సామాజిక సైట్ల ఖాతాలను పరిశీలించి, తదనంతరం మాత్రమే ఉద్యోగం విషయంలో నిర్ణయం తీసుకుంటున్నాయి. జిల్లా నుంచి హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, న్యూఢిల్లీ వంటి మెట్రో నగరాలకు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థుల్లో చాలమంది ఈ విధానంలో అర్హత కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఇంటర్నెట్‌ వినియోగం బాగా పెరిగింది. చవగ్గా ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడంతో పాటు స్మార్ట్‌ఫోన్‌ చేతిలో ఉండటంతో ఎప్పటికప్పుడు స్టేటస్‌ అప్‌లోడ్‌ చేయడం అలవాటుగా మారింది. జిల్లాలో సుమారు 10 లక్షల మంది నిత్యం ఇంటర్నెట్‌లో మునిగి తేలుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

సగం మందికి ‘ఫేస్‌’ ఖాతాలు
ఇటీవలి కాలంలో ఇంటర్నెట్‌ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఇంటర్నెట్‌ వినియోగిస్తున్న వారిలో దాదాపు సగం మందికిపైగా ఫేస్‌బుక్‌ వినియోగిస్తున్నారు. వీరిలోనూ అత్యధికంగా యువతే ఎక్కువగా సామాజిక సైట్లను వినియోగిస్తోంది. ఫేస్‌బుక్‌తో పాటు ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సప్‌ వంటి సామాజిక మాధ్యమాలను వాడుతున్నారు. అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లోనూ ప్రముఖ సంస్థలన్నీ ఈ మెయిల్‌ ఐడీతో పాటు, ఫేస్‌బుక్‌ పాస్‌వర్డ్‌లు కూడా అడుగుతుండటం గమనార్హం. మనం పెట్టే పోస్టింగ్‌లు, షేరింగ్‌లు, పంచుకునే అభిప్రాయాలనే సంస్థలు ప్రముఖంగా చూస్తున్నాయి. ఈ అంశాలను ఆధారంగా చేసుకుని అభ్యర్థి వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్నాయి. ప్రధానంగా మహిళలకు ఇబ్బంది కలిగించడం, వారి మనోభావాలను దెబ్బతీసేలా పోస్టింగులు చేయడం, కుల, మత, ప్రాంతీయ అంశాలపై ప్రభావం చూపే వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఎవరో పెట్టిన పోస్టును మనం కేవలం షేర్‌ చేస్తున్నాం కదా అని అనుకుంటే ప్రమాదమేనని మానసిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సైట్లలో కొన్ని అసందర్భ, అనుచిత అంశాలపై తయారవుతున్న పోస్టులను లక్షలాది మంది షేర్‌ చేస్తున్నారు. వీటిలో అనేక అనుచిత వ్యాఖ్యానాలు ఉంటున్నాయి. ఏ అంశాన్ని షేర్‌ చేస్తున్నామో ఆచితూచి చేయాలని అంటున్నారు.

సైట్లతో మానసిక పరిపక్వత
నిత్యం మనం వాడుతున్న సామాజిక సైట్ల ద్వారా మన మానసిక పరిపక్వత ఆధారపడి ఉంటుంది. మనకు తెలియని ఎంతోమంది వ్యక్తులు మనకు స్నేహితులుగా మారుతుంటారు. వారి అభిప్రాయాలను ఒక్కోసారి మనం షేర్‌ చేయడంపై మన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంటారు. ముఖ్యంగా వ్యక్తిగత పోస్టుల విషయంలో జాగ్రత్త వహించాలి.– అక్కింశెట్టి రాంబాబు, మానసిక నిపుణుడు, తణుకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement