ఏపీలో మరింత తగ్గిన ఇన్ఫెక్షన్‌ రేటు | Coronavirus: Reduced infection rate in AP | Sakshi
Sakshi News home page

ఏపీలో మరింత తగ్గిన ఇన్ఫెక్షన్‌ రేటు

Apr 28 2020 2:39 AM | Updated on Apr 28 2020 11:18 AM

Coronavirus: Reduced infection rate in AP - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తూ మొదటి స్థానంలో ఉన్న ఏపీ ఇన్ఫెక్షన్‌ రేటు నియంత్రణ, పాజిటివ్‌ కేసుల తగ్గుదల శాతంలోనూ ముందడుగు వేసింది. తాజాగా రాష్ట్రంలో టెస్టుల సంఖ్య చూస్తే రోజురోజుకు ఇన్ఫెక్షన్‌ రేటు తగ్గుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సోమవారం నాటి గణాంకాల ప్రకారం ఏపీలో 74,551 టెస్టులు చేయగా.. 1,177 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కల ప్రకారం ఇన్ఫెక్షన్‌ రేటు కేవలం 1.58 శాతం మాత్రమే ఉన్నట్టు నమోదైంది. దేశంలో సగటు ఇన్ఫెక్షన్‌ రేటు 4.20 శాతంగా నమోదైంది. దేశంలో ఇప్పటి వరకూ 6,65,819 టెస్టులు చేయగా 27,964 పాజిటివ్‌ కేసులు తేలాయి. అత్యధిక ఇన్ఫెక్షన్‌ రేటు మధ్యప్రదేశ్‌లో నమోదైంది. 

ఒక్కరోజులో 6,517 టెస్టులు
సోమవారం ఒక్క రోజే రాష్ట్రంలో 6517 టెస్టులు చేశారు. మొత్తం 80 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో పాజిటివ్‌ కేసుల శాతం 1.22 శాతంగా నమోదైంది. 86 శాతం కేసులు మూడు జిల్లాల్లోనే సోమవారం నమోదైన కేసులు కూడా రెడ్‌జోన్‌లలోనే నమోదయ్యాయి. మొత్తం 80 కేసుల్లో గుంటూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల్లోనే 69 కేసులున్నాయి. దీంతో ఈ మూడు జిల్లాల్లోనే 86.25 శాతం కేసులు నమోదయినట్లయింది.

ఏపీలో లెక్కలు ఇలా
► తాజా పాజిటివ్‌ కేసుల ప్రకారం రాష్ట్రంలో 20 శాతం రికవరీ రేటు నమోదైంది
► మృతుల రేటు 3.8 నుంచి 2.83కు తగ్గింది
► సగటున పది లక్షల జనాభాకు 1396 మందికి టెస్టులు నిర్వహిస్తున్నారు
► దేశంలో పది లక్షల జనాభాకు 480 టెస్టులు జరుగుతున్నాయి
► కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కంటెయిన్మెంట్‌ నియంత్రణకు మరింత పకడ్బందీ చర్యలు. 

Advertisement
 
Advertisement
Advertisement