ఏపీలో మరో పాజిటివ్‌ 

Coronavirus: Number of positive cases has reached six in AP - Sakshi

ఆరుకు చేరుకున్న కరోనా కేసులు

142 మందికి నెగెటివ్‌

ఇప్పటివరకూ ల్యాబ్‌లకు పంపిన నమూనాలు 164

ఇంకా రావాల్సిన రిపోర్టు ఫలితాలు 16

కోలుకున్న నెల్లూరు యువకుడు

సాక్షి, అమరావతి/విశాఖపట్నం: ఏపీలో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. ఆదివారం రాత్రికి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. మక్కా యాత్రకు వెళ్లి వచ్చిన 65 ఏళ్ల విశాఖ వృద్ధుడికి ఇప్పటికే కరోనా సోకగా.. తాజాగా అతడి భార్య కూడా కరోనా బారినపడినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఆ వృద్ధుడు ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతూ కోలుకుంటుండగా.. అతడి భార్యను ఐసోలేషన్‌ వార్డులో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

వారి కుమార్తెకు కూడా పరీక్షలు చేయించగా నెగెటివ్‌ రావడంతో మరోసారి పరీక్ష కోసం నమూనాలను పంపించారు. జిల్లాలో రెండు కరోనా కేసులు నమోదవడంతో జిల్లా అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. బాధితులకు సన్నిహితంగా మెలిగిన వారి వివరాలను ఆరా తీస్తున్నారు. ఇప్పటికే బాధితుడు కలిసిన వారిని క్వారెంటైన్‌లో చేర్చించారు. అలాగే బాధితుల నివాస ప్రాంతాన్ని ఇప్పటికే అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ మూడు కిలోమీటర్ల పరిధిలో రసాయనాలు చల్లారు. ఆ చుట్టు పక్కల వారి ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. 

142 మందికి నెగెటివ్‌
రాష్ట్రంలో ఇప్పటివరకూ 164 అనుమానితుల నుంచి నమూనాలను సేకరించి ల్యాబొరేటరీలకు పంపించగా.. 142 కేసులకు సంబంధించి కరోనా వైరస్‌ లేదని తేలింది. ఇప్పటివరకూ 6 కేసులు మాత్రమే పాజిటివ్‌గా తేలగా, మరో 16  రిపోర్టులకు సంబంధించి ఫలితాలు రావాల్సి ఉందని ఆదివారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివ్‌ వచ్చిన వారిలో నలుగురు 25 ఏళ్లలోపు వారు కాగా, విశాఖ వ్యక్తికి 65 ఏళ్లు, ఆయన భార్య వయçసు 49 ఏళ్లుగా బులెటిన్‌లో స్పష్టం చేశారు. పాజిటివ్‌ వాళ్లందరూ ఆరోగ్యంగానే ఉన్నట్లు పేర్కొన్నారు.

కోలుకున్న నెల్లూరు యువకుడు
ఇటలీ రాజధాని మిలాన్‌ నుంచి కరోనా పాజిటివ్‌తో వచ్చి చికిత్స పొందుతున్న నెల్లూరు జిల్లా యువకుడు పూర్తిగా కోలుకున్నాడు. ఇప్పటికే ఒకసారి వైద్యపరీక్షలు నిర్వహించగా, నెగిటివ్‌ వచ్చింది. మరోసారి నమూనాలు ల్యాబొరేటరీకి పంపించారు. ఈ పరీక్షల్లోనూ నెగిటివ్‌ వస్తే, అతడిని డిశ్చార్జి చేస్తామని ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top