లాక్‌ డౌన్‌ ఆంక్షలు మరింత కట్టుదిట్టం

Coronavirus: Lockdown Restrictions More Tightened - Sakshi

సాక్షి, అమరావతి: లాక్‌ డౌన్‌ అమలు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను మరింత కట్టుదిట్టం చేసింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరినీ రహదారులపై అనుమతించ వద్దని, ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అత్యవసర వైద్య చికిత్సలకు వెళ్లాల్సి వచ్చే వారిని మాత్రమే అనుమతించాలని, ఏ ఇతర అంశాలపై వెళ్లేవారిని అనుమతించరాదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచేందుకు అధికారులతో కమిటీని కూడా ఏర్పాటు చేశారు.

అమల్లోకి వచ్చిన ఆంక్షలివీ
- ద్విచక్ర వాహనాలపై ఒకరిని మాత్రమే అనుమతించాలి. నాలుగు చక్రాల వాహనాల్లో ఇద్దరిని మాత్రమే అనుమతించాలి. ఇది కూడా అత్యవసరాలకు మాత్రమే తప్ప సాధారణ అంశాలకు ఎవరినీ అనుమతించరాదు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరినీ అనుమతించరాదు. అత్యవసర చికిత్సలకు మాత్రమే మినహాయింపు ఉంటుంది.
- నిత్యావసర వస్తువుల దుకాణాలతో సహా రాత్రి 8 గంటల తరువాత ఎటువంటి దుకాణాలైనా తెరిచి ఉంచకూడదు.  కేవలం ఆస్పత్రులు, మందుల దుకాణాలను మాత్రమే రాత్రి 8 గంటల తరువాత కూడా అనుమతిస్తారు.
- నిత్యావసర సరుకుల కోసం ఆ ఇంటి నుంచి రెండు కిలోమీటర్ల పరిధి వరకు మాత్రమే ఆ ఇంటిలోని ఒక వ్యక్తిని అనుమతిస్తారు.
- లాక్‌ డౌన్‌ సమయంలో ఇన్సూరెన్స్‌ సర్వీసు ప్రొవైడర్లను మాత్రం అనుమతిస్తారు.
- బహిరంగ ప్రదేశాల్లో నలుగురు కన్నా ఎక్కువ వ్యక్తులను అనుమతించరాదు. ఈ ఆంక్షలు కోవిడ్‌–19 నివారణ చర్యల్లో పాల్గొంటున్న ఉద్యోగులు, వ్యక్తులకు వర్తించవు.
- లాక్‌ డౌన్‌ ఆంక్షలను కచ్చితంగా అమలు చేసేందుకు తాత్కాలిక చెక్‌ పోస్టులను ఏర్పాటు చేయాలి.
- లాక్‌ డౌన్‌ సమయంలో ప్రజలకు నిత్యావసర సరుకుల కొరత లేకుండా అందుబాటులో ఉంచేందుకు తగిన ఏర్పాట్లకై  మార్కెటింగ్‌ శాఖ కార్యదర్శి నేతృత్వంలో అధికారుల కమిటీ ఏర్పాటు. 

జిల్లా కలెక్టర్లకు సర్వాధికారాలు 
కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి జిల్లా కలెక్టర్లకు సర్వాధికారాలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ, పట్టణ, వార్డు, కాలనీ వంటి చోట్ల అనుమానిత కేసులు నమోదైనప్పుడు అక్కడి మున్సిపల్‌ కమిషనర్‌ కూడా చర్యలు తీసుకోవచ్చని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో స్థానికంగా ఏ చర్యలు తీసుకునేందుకైనా కలెక్టర్‌కు సర్వాధికారాలు ఉన్నాయని, ఆయన ఆదేశాలకు లోబడే అక్కడి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top