కరోనా: ఉద్యోగులే గీత దాటితే ఎలా? 

Coronavirus Fears With Arrival Of Government Employees In Srikakulam - Sakshi

విశాఖ నుంచి రాకపోకలు సాగిస్తున్న కొంతమంది ప్రభుత్వ సిబ్బంది 

బయోమెట్రిక్‌ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా విధుల నిర్వహణ 

జిల్లా అధికారులకు పలువురి ఫిర్యాదులు: ఆరా తీస్తున్న కలెక్టర్‌ 

శ్రీకాకుళం: ప్రపంచాన్ని కరోనా వైరస్‌ వణికిస్తున్నా.. అధికారుల చర్యలు, ప్రజల క్రమశిక్షణతో ఇప్పటివరకు పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదు. అంతా బాగుందనుకుంటున్న దశలో కొన్ని సంఘటనలు కలకలం రేపుతున్నాయి. పిల్లల చదువులు తదితర కారణాలతో విశాఖ నుంచి రాకపోకలు సాగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కరోనా కల్లోలంలోనూ అదే ఒరవడి కొనసాగించడంతో స్థానిక ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నంలోని పలు ప్రాంతాలు రెడ్‌ జోన్‌లో ఉన్నాయి. ఇటువంటి తరుణంలో కూడా వీరు రాకపోకలు సాగిస్తుండడం పట్ల అభ్యంతరం వ్యక్తమవుతోంది.

కొందరు ఉద్యోగులు రెండు రోజులు సెలవులు వస్తే మరో రెండు మూడు రోజులు సెలవు పెట్టి మరీ విశాఖపట్నంలో ఉండిపోతున్నారు. ఇలా రెండు నుంచి ఐదు రోజులపాటు విశాఖపట్నంలో ఉంటున్న వీరు కూరగాయల కోసమో.. మరేదైనా పని మీదనో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి తరుణంలో వారికి తెలియకుండానే కరోనా బారిన పడితే వారి ద్వారా జిల్లాకు కూడా వ్యాధి సోకే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి విషయాలపై ఇప్పటికే జిల్లా అధికారులకు పలువురు అధికారులు మౌఖికంగా ఫిర్యాదు చేయగా జిల్లా అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి ఆరా తీస్తున్నట్లు భోగట్టా.  

కరోనా నిరోధక చర్యలకు విఘాతం 
ఓవైపు డిస్‌ఇన్ఫెక్షన్‌ టన్నెల్స్, మొబైల్‌ కియోస్కుల తో జిల్లా వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంటే మరోవైపు కొందరి చర్యలు విఘాతం కలిగించేలా ఉన్నాయి. సరిహద్దుల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినా కొందరు ఉద్యోగులు ఐడీ కార్డులను చూపించి విశాఖ వెళ్లి వస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇటువంటి వారిపై చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. 

హోమ్‌ క్వారంటైన్‌లో మున్సిపల్‌ టీపీఓ
పలాస: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో పట్టణ ప్రణాళిక విభాగంలో టీపీఓగా పనిచేస్తున్న ఉద్యోగిని హోం క్వారంటైన్‌కు పంపించారు. ఆ ఉద్యోగి అనధికారికంగా పలాస నుంచి విశాఖపట్నానికి తరచు రాకపోకలు సాగిస్తున్నారని ఫిర్యాదు రావడంతో మంగళవారం పలాస రెవెన్యూ సిబ్బంది అదుపులోకి తీసుకొని టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి పరీక్షలకు పంపించారు. పరీక్షల అనంతరం బుధవారం పలాసలోని ఒక అద్దె ఇంటిలో హోమ్‌ క్వారంటైన్‌లో పెట్టామని పలాస తహసీల్దార్‌ మధుసూదనరావు చెప్పారు. ఫలితాలు ఇంకా రావలసి ఉంది.

విశాఖపట్నం నుంచి టీపీఓపాటు మున్సిపల్‌ కమిషనరు నాగేంద్రకుమార్, ఏఈ రవి తదితరులు కూడా ప్రతిరోజు రాకపోకలు సాగిస్తున్నారని తెలిసిన స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో వారిని కూడా కరోనా పరీక్షలకు పంపించి క్వారంటైన్‌లో ఉంచాలని డిమాండు చేస్తూ వివిధ ప్రజా సంఘాలకు చెందిన నాయకులు ఎన్‌.గణపతి, తామరాపల్లి ఫ్రాన్సిస్, చాపర వేణు తదితరులు పలాస తహసీల్దారుకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ వినతిపత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్‌ బి.పాపారావు స్వీకరించారు. జిల్లా కలెక్టర్‌ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వెళ్లానని, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని తహసీల్దార్‌ చెప్పారు.  

రాకపోకలపై ఆరా తీస్తున్నాం 
కొందరు ఉద్యోగులు ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నట్లు ఫిర్యా దులు ఉన్నా యి. దీనిపై ఆరా తీస్తున్నాం. ఇటువంటి వారిపై చర్యలు తీసుకుంటాం. ఆయా శాఖాధికారులకు ఇటువంటి వివరాలను అందించాలని కోరాం.  – జె.నివాస్, జిల్లా కలెక్టర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top