కరోనా టెస్టుల్లో మరో రికార్డు సాధించిన ఏపీ

Corona: Andhra Pradesh Conducted 4 Lakh Tests Till Wednesday - Sakshi

సాక్షి, విజయవాడ : కరోనా వైద్య పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ మరో మైలురాయిని చేరుకుంది. బుధవారం నాటికి  4 లక్షల టెస్టులు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించింది. గడిచిన 24 గంటల్లో 8,066 మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా బుధవారం నాటికి రాష్ట్రంలో 4,03,747 మందికి టెస్టులు చేశారు. ఇప్పటివరకూ 4 లక్షల టెస్టులు చేసిన రాష్ట్రాల్లో రాజస్తాన్, తమిళనాడు, మహారాష్ట్రలు మాత్రమే ఏపీ కంటే ముందున్నాయి. అయితే ఆయా రాష్ట్రాల జనాభాతో పోల్చుకుంటే ఏపీలో జనాభా చాలా తక్కువ. దీంతో కరోనా టెస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచింది. పది లక్షల జనాభాకు రాష్ట్రంలో సగటున 7,419 మందికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. (ఏపీలో కొత్తగా 79 పాజిటివ్‌ కేసులు)

మరోవైపు రికవరీ రేటులోనూ ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతంతో పోల్చితే రాష్ట్రంలో ఆ సంఖ్య చాలా ఎక్కువ. రాష్ట్రంలో రికవరీ శాతం 64 శాతం ఉండగా.. దేశ వ్యాప్తంగా చూస్తే ఆ శాతం 48.51గా నమోదైంది. ఇదిలావుండగా ఆంధ్రప్రదేశ్‌లాగా ట్రూనాట్ మెషీన్లు ఉపయోగించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఏపీ తరహాలో టెలి మెడిసిన్‌ను విస్తృతంగా అందుబాటులోకి తేవాలని ఇతర రాష్ట్రాలను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ఫెక్షన్‌ రేటు కూడా అత్యల్పంగా ఉంది. రాష్ట్రంలో సగటున 0.96 శాతం ఉండగా, దేశీయ సగటు 4.96 శాతంగా ఉంది. (ఈ నెల 11న ఏపీ కేబినెట్‌ సమావేశం)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top