కాంట్రాక్టర్ దారుణ హత్య | Contractor grievous murder | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టర్ దారుణ హత్య

Aug 17 2013 3:37 AM | Updated on Jul 30 2018 8:27 PM

కాంట్రాక్టర్‌ను ప్రత్యర్థులు తాడు తో ఉరేసి చంపి మృతదేహంతో పాటు బొలేరో వాహనాన్ని ఔటర్ సర్వీస్ రోడ్డు నుంచి కిందకు తోసేసిన సంఘటన శుక్రవారం మండల పరిధిలో చోటు చేసుకుంది.

 జిన్నారం, న్యూస్‌లైన్ : కాంట్రాక్టర్‌ను ప్రత్యర్థులు తాడు తో ఉరేసి చంపి మృతదేహంతో పాటు బొలేరో వాహనాన్ని ఔటర్ సర్వీస్ రోడ్డు నుంచి కిందకు తోసేసిన సంఘటన శుక్రవారం మండల పరిధిలో చోటు చేసుకుంది.  రామచంద్రాపురం డీఎస్పీ మధుసూదన్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్‌ల కథనం మేరకు.. వరంగల్ జిల్లా కొడకండ్ల మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన గోగుల హన్మంతు(40) భార్య, ముగ్గురి పిల్లలతో బతుకుదెరువు నిమిత్తం పదేళ్ల క్రితం మండలంలోని బొల్లారానికి వలస వచ్చారు. స్థానికంగా ఐడీఏ కాలనీలో నివాసం ఉంటూ సివిల్ కాంట్రాక్టర్‌గా పనిచేసేవాడు. అయితే ఏడాది క్రితం బంధువులతో వచ్చిన గొడవల కారణంగా ఇటీవల హైదరాబాద్‌లోని ఉప్పల్ టెలిఫోన్ కాలనీకి మకాం మార్చాడు. హన్మంతు సివిల్ కాంట్రాక్ట్‌తో పాటు మట్టి వ్యాపారంతో పాటు జేసీబీ అద్దెకు ఇచ్చేవాడు. ఐడీఏ బొల్లారం, ఉప్పల్, సిద్దిపేట, వరంగల్ ప్రాంతాల్లో కాంట్రాక్ట్ పనులు చేపడుతున్నాడు. 
 
 అయితే సిద్దిపేటలోని సైట్‌లో వాటర్ పైప్‌లైన్ పగలడంతో మరమ్మతులకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసేందుకు గురువారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఇంటి నుంచి తన బొలేరో(ఏపీ 23 ఎస్ 3232) వాహనంలో బయలుదేరాడు. రాత్రి 8 గంటలకు భార్య ఇద్దమ్మకు ఫోన్ చేసి సామగ్రితో సిద్దిపేటకు వెళుతున్నానని, రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పాడు. ఇదిలా ఉండగా.. స్థానికులు శుక్రవారం ఉదయం 6 గంటలకు బొలే రో వాహనంలో వ్యక్తి మరణించి ఉన్నాడని పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ చేసి చెప్పారు. సంఘటనా స్థలాన్ని డీఎస్‌పీ మధుసూదన్‌రెడ్డి, క్లూస్ టీమ్‌లు పరిశీలించారు. పాత కక్షల కారణంగానే తమ బంధువులే నా భర్తను హత్య చేసి ఉంటారని మృతుడి భార్య ఇద్దమ్మ ఆరోపించారు. మా నాన్న చనిపోలేదని, బతి కే ఉంటాడు అంటూ కూతుళ్లు నాగలక్ష్మి, నాగజ్యోతి, కుమారుడు నాగరాజు విలపించడం కలిచివేసింది. హన్మంతు భార్య ఇద్దమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement