
ఆ ముగ్గురి వేట
కాంగ్రెస్‌లో గెలుపు గుర్రాల వేట మొదలైంది. లోక్‌సభ స్థానాలతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమర్థులైన అభ్యర్థులను గుర్తించేందుకు ఆ పార్టీ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది.
కరీంనగర్ : కాంగ్రెస్‌లో గెలుపు గుర్రాల వేట మొదలైంది. లోక్‌సభ స్థానాలతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలకు సమర్థులైన అభ్యర్థులను గుర్తించేందుకు ఆ పార్టీ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. స్వయానా ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన బృందాన్ని రాష్ట్రానికి పంపించి ఈ బాధ్యతలను అప్పగించినట్లు పీసీసీ వెల్లడించింది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠమొదలైంది. లోక్‌సభ సెగ్మెంట్‌కో పరిశీలకుడిని నియమించడంతో జిల్లాకు ఇద్దరు పరిశీలకులు రానున్నారు. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిశీలకుడు అమిత్ దేశ్‌ముఖ్ రెండు మూడు రోజుల్లో ఆయన కరీంనగర్ వస్తారని సమాచారం అందడంతో పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు.
ఈ సెగ్మెంట్ పరిధిలోని కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, మానకొండూరు, చొప్పదండి, హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లోని పార్టీ నేతలు ఎవరికివారుగా రేసులో నిలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. పీసీసీ ఇచ్చిన సమాచారంతో కొందరు నేతలు ఏకంగా పరిశీలకుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఫోన్లలో రాయబారాలు మొదలెట్టారు. దీంతో ఈ రేసులో ఎవరెవరున్నారు... ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ పడుతున్నారనేది ఆసక్తి రేపుతోంది. అధికార పార్టీ కావడంతో అన్ని చోట్ల ఈ రేసు చాంతాడును తలపిస్తోంది.
జిల్లాకు రానున్న పరిశీలకులు పార్టీ కార్యకర్తలు మొదలు ముఖ్య నేతలు, వివిధ వర్గాల నుంచి మూడు గెలుపు గుర్రాలను గుర్తిస్తారని తెలుస్తోంది. దీంతో ఆ ముగ్గురిలో మేమంటే.. మేము.. అని పోటీ పడేందుకు, పరిశీలకుల ఎదుట బలప్రదర్శన చేసేందుకు కొందరు నేతలు ఇప్పట్నుంచే శక్తియుక్తులు ఒడ్డుతున్నారు. పెద్దపల్లి, నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల పరిశీలకులను త్వరలోనే ఖరారు చేసి పంపనున్నట్టు సమాచారం.
కరీంనగర్ పరిశీలకుడిగా అమిత్ దేశ్‌ముఖ్
కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిశీలకుడిగా అమిత్ దేశ్‌ముఖ్(38)ను నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడిం చాయి. ఈయన మహారాష్ట్రలోని లాతూర్ సిటీ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. అమిత్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారుడు.
అమిత్ దేశ్‌ముఖ్ లోక్‌సభ సీటుతో పాటు దాని పరిధిలోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచే సత్తా ఉన్న ముగ్గురు అభ్యర్థుల పేర్లను గుర్తించి రాహుల్‌గాంధీకి సిఫారసు చేస్తారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి.