ఓట్లేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారు:షర్మిల

ఓట్లేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారు : షర్మిల - Sakshi


ఏలూరు: కాంగ్రెస్, టిడిపి నేతలు ఓట్లు వేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. సమైక్య శంఖారావం బస్సుయాత్రలో భాగంగా ఈరోజు ఆమె ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగిచారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులకు ఓట్లేసిన ప్రజలకంటే పదవులే ముఖ్యం అని మండిపడ్డారు. తమ ఓట్లు దండుకుని తమ బతుకులు బుగ్గిపాలు చేస్తారా? అని ప్రశ్నిస్తూ  కోట్లాది మంది రోడ్డెక్కారన్నారు. కోట్లాది గుండెలు రగిలిపోతున్నాయన్నారు.



సమైక్యాంధ్ర విషయంలో మీరూ, మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజీనామాలు చేశారా? అని చంద్రబాబును ప్రశ్నించారు. జీతాలను త్యాగం చేసి ఎన్జీవోలు ఉద్యమం చేస్తుంటే ఈ సర్కార్‌కు కనికరం కూడాలేదని విమర్శించారు. చంద్రబాబు ఎన్జీవోల కృషిని కూడా తక్కువ చేసి చూస్తున్నారన్నారు.  రాష్ట్ర విభజన సంకేతాలు వచ్చిన వెంటనే వైఎస్ఆర్ సిపి నేతలందరూ రాజీనామా చేశారని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్ సీపీ నేతలు  రాజీనామా చేసిన రోజునే అందరూ చేసుంటే విభజన ప్రక్రియ ఆగిపోయి ఉండేదన్నారు. న్యాయం చేయలేరని తేలిపోయింది కనుక రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని షర్మిల డిమాండ్ చేశారు. తన కష్టాన్ని పక్కనపెట్టి జగనన్న ఏడ్రోజులపాటు ప్రజల కోసం దీక్ష చేశారని గుర్తు చేశారు. తెలంగాణపై చేసిన తప్పును ఇప్పటిదాకా టీడీపీ వెనక్కి తీసుకోలేదన్నారు. సీమాంధ్ర అట్టుడుకుతున్నా చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై ఒక్క మాటా మాట్లడకపోవడం దారుణం అన్నారు.



బాబు తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖ తప్పు అని తన ఎమ్మెల్యేలతో సహా రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వారు రాజీనామాలు చేసేవరకు సీమాంధ్రులు వారిని తరిమి తరిమి కొట్టాలని పిలుపు ఇచ్చారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ కాంగ్రెస్‌తో కుమ్మక్కయిందని ఆరోపించడం కొత్తకాదన్నారు.  చంద్రబాబును ఉద్దేశించి ఎఫ్‌డీఐ ఓటింగ్ విషయంలో కాంగ్రెస్‌తో కుమ్మకై ఎంపీలను గైర్హాజరుపరిచింది నీవుకాదా? కాంగ్రెస్‌తో కుమ్మక్కై జగన్‌పై అక్రమ కేసులు పెట్టించింది మీరు కాదా? సమైక్యాంధ్ర విషయంలో మీతోపాటు మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజీనామాలు చేశారా? అని ప్రశ్నించారు. చీకట్లో చిదంబరాన్ని కలిసి తనపై కేసులను మాఫీ చేయించుకున్న ఘనత చంద్రబాబుదన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top