రామాయపట్నంలో పోర్టు రావడం ఖాయమని, అయితే ఎప్పుడు వస్తుందో మాత్రం చెప్పలేమని ఆ పోర్టు ఏర్పాటుపై
ఎప్పుడొస్తుందో చెప్పలేం..
పోర్టు సర్వే సంస్థ రైట్స్ జాయింట్ జనరల్ మేనేజర్
ఎమ్మెల్యే పోతులతో రెండు గంటల పాటు సమావేశం
కందుకూరు : రామాయపట్నంలో పోర్టు రావడం ఖాయమని, అయితే ఎప్పుడు వస్తుందో మాత్రం చెప్పలేమని ఆ పోర్టు ఏర్పాటుపై ప్రాథమిక సమాచారం సేకరించేందుకు వచ్చిన రైట్స్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ జాయింట్ జనరల్ మేనేజర్, సర్వే బృందానికి నాయకత్వం వహిస్తున్న బీఎస్‌ఆర్ శేషగిరిరావు అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్టుహౌస్‌లో స్థానిక ఎమ్మెల్యే పోతుల రామారావుతో సర్వే బృందం దాదాపు రెండు గంటలపాటు సమావేశమైంది. ఎమ్మెల్యేతో సమావేశం అనంతరం శేషగిరిరావు మాట్లాడారు. రామాయపట్నంలో పోర్టు ఏర్పాటుకు ఉన్న అవకాశాలు పరిశీలిస్తామని చెప్పారు.
ఈ ప్రాంతం నుంచి ఎంత సరుకు రవాణా చేస్తున్నారు.. ఏయే రంగాల నుంచి సరుకు అధికంగా ఇతర పోర్టులకు తరలిపోతోంది.. రోజూ రోడ్డు మార్గం ద్వారా ఎన్ని కంటైనర్లు ప్రయాణిస్తున్నాయి.. ఏయో ప్రాంతాలకు ఈ పోర్టు అనుకూలంగా ఉంటుందనే పూర్తి సమాచారం సేకరిస్తామని తెలిపారు. దీని కోసం వివిధ శాఖల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నామన్నారు. అందులో భాగంగా ఎమ్మెల్యే పోతుల రామారావును కలిశామని, ఆయన ఎంతో విలువైన సమాచారం ఇచ్చారని శేషగిరిరావు వివరించారు. మరో వారంలో సంస్థ నుంచి టెక్నికల్ టీం వచ్చి రామాయపట్నంలో పర్యటిస్తుందని వివరించారు. శేషగిరిరావుతో పాటు సంస్థ మేనేజర్ బీఎం ఆరోర, టెక్నికల్ ఆఫీసర్ ఆర్‌కే పాండే ఉన్నారు.
పోర్టుతో ఉపయోగాలు వివరించా : ఎమ్మెల్యే పోతుల
రామాయపట్నంలో పోర్టు ఏర్పాటు వల్ల ఉపయోగాల గురించి శేషగిరిరావు బృందానికి వివరించానని ఎమ్మెల్యే పోతుల రామారావు తెలిపారు. రైట్స్ సంస్థ మూడు దశల్లో సర్వే చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం ట్రాఫిక్‌కు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారని, టెక్నికల్ టీం, పర్యావరణానికి సంబంధించిన టీం పరిశీలన చేయాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మె ల్యే కసుకుర్తి ఆదెన్న, వైఎస్సార్ సీపీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త వీరాస్వామి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాసరావు, మాల్యాద్రి, రఫీ, నాయు డు, రహంతుల్లా, రెహమాన్ పాల్గొన్నారు.