31వరకు ఏపీ లాక్‌డౌన్‌ 

CM YS Jaganmohan Reddy Announce AP Lock Down Till 31st March - Sakshi

మీడియా సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌

రాష్ట్ర సరిహద్దులు మూసివేత

రవాణా వాహనాల నిలిపివేత.. అందుబాటులో అత్యవసర సేవలు, నిత్యావసరాలు

ప్రభుత్వ కార్యాలయాలూ కనీస సిబ్బందితో రొటేషన్‌ పద్ధతిలో పనిచేస్తాయి

కలెక్టర్లు నిత్యావసరాల ధరలు ప్రకటిస్తారు

వాటికి మించి అమ్మితే కఠిన చర్యలు

ప్రతీ పేద కుటుంబానికి ఈనెల 29 నాటికి రేషన్‌ సరకులు రెడీ

వాటితోపాటు కేజీ పప్పు ఉచితంగా ఇస్తాం

ఏప్రిల్‌ 4న రూ.వెయ్యి ఆర్థిక సాయం కూడా అందజేస్తాం

జిల్లా కేంద్రంలో 200, నియోజకవర్గంలో 100 పడకలతో ఐసోలేషన్‌ సెంటర్లు

సాక్షి, అమరావతి: ‘దేశాన్ని భయపెడుతున్న కరోనా వైరస్‌ కట్టడికి ప్రజలందరం కలిసికట్టుగా పోరాడదాం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల రాకపోకలను కట్టడి చేయడం ద్వారానే కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని ఆయన చెప్పారు. అందుకోసం ఈనెల 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించారు. అత్యవసర, నిత్యావసర వస్తువులు, సేవలు మాత్రం యథావిధిగా ప్రజలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేయడంతోపాటు రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ప్రజా రవాణా వ్యవస్థను నిలిపివేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అదే సమయంలో పేదలకు ఇబ్బంది కలగకుండా ఆదుకునేందుకు ప్రతి ఇంటికి రూ.వెయ్యితోపాటు ఉచితంగా రేషన్, కిలో పప్పు సరఫరా చేస్తామని తెలిపారు. కరోనా కట్టడి చేయడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు పూర్తిగా సహకరించి ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఆ వివరాలు..

అందరికీ అభినందనలు
- గ్రామస్థాయి నుంచి దేశం మొత్తం ఒక భయానక వాతావరణంలో కదులుతోంది. కానీ, రాష్ట్రం మాత్రం అటువంటి పరిస్థితిలోకి వెళ్లకుండా సురక్షితమైన స్థానంలోనే ఉంచిన ప్రతి గ్రామ వలంటీరుకు, గ్రామ, వార్డు సచివాలయంలోని ప్రతి మెడికల్‌ అసిస్టెంట్, ఆశా వర్కర్లు, పీహెచ్‌సీలలోని డాక్టర్లు, నర్సులు, మొత్తంగా ఆరోగ్యశాఖ, కలెక్టర్లు, అధికారులకు మనస్ఫూర్తిగా అభినందనలు. 
- దేవుడి దయతో మిగిలిన రాష్ట్రాలు అన్నింటికంటే మన రాష్ట్రం మెరుగ్గా ఉంది. 
- దేశంలో దాదాపు 341 కేసులు నమోదై ఐదుగురు చనిపోయారు. కానీ, మన రాష్ట్రంలో కేవలం ఆరు కేసులు మాత్రమే నమోదయ్యాయి. అందులో నెల్లూరుకు చెందిన వ్యక్తి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయి ఇంటికి కూడా వెళ్లిపోయారు. 
- ఈ పరిస్థితులు ఇంత మెరుగ్గా ఉండటానికి కారణం.. 2.50 లక్షల పైచిలుకు ఉన్న గ్రామ వలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి విదేశాల నుంచి వచ్చిన వారిని సర్వే చేయడమే. ప్రతీ 50 ఇళ్లకు వెళ్లి విదేశాల నుంచి వచ్చినవారి డేటా యాప్‌ ద్వారా నమోదు చేశారు. ఎప్పటికప్పుడు వైద్య ఆరోగ్య శాఖకు సమాచారమిచ్చారు. తద్వారా గ్రామ సచివాలయంలోని హెల్త్‌ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లు పీహెచ్‌సీ డాక్టర్లు మొత్తం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారు.
- ఇలా గ్రామ వలంటీర్లు విదేశాల నుంచి వచ్చిన 11,670 మందిని ట్రాక్‌ చేశారు. వాళ్ల కదలికలపై పూర్తి నిఘా పెట్టారు. 
- ఆ 11,670 మందిలో 10,091 మందిని ఐసోలేషన్‌లో ఉంచాం.
- 24 మందిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నాం. 
- మరో 1,555 మందిని 28 రోజులపాటు హోం ఐసొలేషన్‌లో ఉంచాం.
వైద్యులు, అత్యవసర సేవల సిబ్బందికి చప్పట్లతో మద్దతు తెలుపుతున్న గవర్నర్‌ హరిచందన్,సీఎం వైఎస్‌ జగన్, మంత్రి ఆళ్ల నాని,సీఎస్‌ నీలం సాహ్ని తదితరులు 

మీ సేవలకు సెల్యూట్‌: సీఎం
కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా 24 గంటలూ అకుంఠిత దీక్షతో పనిచేస్తున్న మా ఆరోగ్య కార్యకర్తలు, ఆర్మీ సిబ్బంది, పోలీసులతో పాటు మిగిలిన వారందరికీ సెల్యూట్‌ చేస్తున్నా. మీ అందరి కృషి వల్లే మేమంతా ఇంటి వద్ద సురక్షితంగా ఉన్నాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్న మీ అందరికీ మేం రుణపడి ఉన్నాం.

ప్రజలకు విన్నపం
- ఈ నెల 31వరకు ప్రజలందరూ బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రం కూడా ప్రయాణికుల రైళ్లు రద్దు చేసింది. 
- అలా 14రోజులు చేస్తే పరిస్థితి చక్కబడుతుంది. 
- మరీ అవసరమైతే తప్ప బయటకు రావద్దు. అది కూడా కనీస అవసరాల కోసమే బయటకు రండి. వచ్చినప్పుడు కూడా రెండు మీటర్ల దూరం పాటించండి. 
- ప్రజలంతా సహకరించాలని కోరుతున్నాం. రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉంది. భయాందోళన వద్దు.

పేదలకు ప్రభుత్వ సాయం
- రాష్ట్రం లాక్‌డౌన్‌ అంటే మొదట పేదల గురించే ఆలోచించాను. వాళ్లు ఇబ్బంది పడతారు. కానీ చేయకతప్పదు. కరోనా కట్టడి కోసం అందరం కలిసి కట్టుగా పనిచేయాలి. మొత్తం మీద ఎక్కువ చేయలేకపోయినా కూడా కొద్దోగొప్పో వారి నష్టంలో భాగస్వామిని అవుతాను. అందులో భాగంగా..
- ఈనెల 29 నాటికి రేషన్‌ పూర్తిగా అందుబాటులో ఉంచుతాం.
- రేషన్‌ సరుకులు ఉచితంగా ఇస్తాం. దాంతో పాటు ఒక కేజీ పప్పు ఉచితంగా ఇస్తాం.
- అంతేకాక.. రూ.వెయ్యి చొప్పున ప్రతి పేద కుటుంబానికి ఏప్రిల్‌ 4న వలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తాం. 
- అందుకు రూ.1,500కోట్లు ఖర్చు అవుతోంది.

ఆసుపత్రులు సిద్ధం చేస్తున్నాం
- రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ చర్యలు తీసుకుంటాం. అత్యవసర సేవల కోసం అన్ని జిల్లాల్లో ఆస్పత్రులు సిద్ధం చేస్తున్నాం. 
- ప్రతి నియోజకవర్గంలో 100 పడకలతో ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పాం. 
- ప్రతి జిల్లా కేంద్రంలో కనీసం 200 పడకలతో ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించాం. 
- గొంతునొప్పి, జలుబు, జ్వరం వంటి లక్ష ణాలుంటే.. అలాంటి వారికి విదేశాల నుంచి వచ్చిన వారితో సంబంధం ఏమైనా ఉందా అని సరిచూసుకోవాలని చెబుతున్నాం. 
- విదేశాల నుంచి వచ్చిన వారితో సంబంధం ఉంటే 104కు ఫోన్‌చేస్తే వెంటనే డాక్టర్‌ హాజరవుతారని ప్రజలకు చెబుతున్నాం.

ఇవీ లాక్‌డౌన్‌..
- రాష్ట్ర సరిహద్దులు మూసివేతతో అంతర్రాష్ట్ర ప్రజా రవాణా వ్యవస్థ, రాష్ట్రంలో బస్సులు, ఆటోలు, ఇతర ప్రజా, ప్రైవేట్‌ రవాణా వాహనాలు, పాఠశాలలు, కళాశాలలు, అన్ని విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు, మాల్స్, స్విమ్మింగ్‌ పూల్స్, జిమ్‌ క్లబ్‌లు, సోషల్‌ ఈవెంట్‌ సెంటర్లు, పెద్ద పెద్ద ఆలయాల్లో దర్శనాలు, వస్త్రదుకాణాలు, జ్యూయలరీ షాపులు, అత్యవసరం కాని అన్ని ఇతర షాపులు, అత్యవసర సర్వీసులు అందించేవి మినహా ఇతర ఆఫీసులు, గోదాములు,మార్కెట్‌ యార్డులు. 
- 31వ తేదీ వరకు రాష్ట్రంలో ప్రతిఒక్కరూ స్వీయనిర్బంధంలో ఉండాలి. అత్యవసరమైతే తప్ప ఇల్లు విడిచి బయటకు రాకూడదు.

ఇవి ఓపెన్‌..
- పెట్రోల్‌ బంకులు, గ్యాస్‌ ఏజెన్సీలు, మందుల షాపులు, పాలు, కూరగాయలు, కిరాణా షాపులు.
- అత్యవసర సేవలకు మాత్రమే ఆటోలు, ట్యాక్సీలకు అనుమతి. అప్పుడు కూడా కేవలం ఇద్దరికి మాత్రమే అనుమతి. ప్రభుత్వ ఆఫీసులు స్కెలెటిన్‌ స్టాఫ్‌తో రొటేషన్‌ పద్ధతిలో పనిచేయాలి.

విద్యాసంస్థలు, మాల్స్‌ మూసివేత
కరోనా కట్టడికి ఇప్పటికే అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు అన్నింటినీ మార్చి 31వరకు మూసివేయించాం. ఆ తరువాత పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటాం. 
- టెన్త్‌ పరీక్షలు మాత్రం యథావిధిగా జరుగుతాయి. అక్కడ కూడా విద్యార్థుల మధ్య కనీసం రెండు మీటర్లు దూరం ఉండేలా చూడాలని ఆదేశించాం. ఎవరైనా జ్వరం, జలుబు, దగ్గు వంటి వాటితో బాధపడుతుంటే వారిని ప్రత్యేక గదిలో ఉంచి పరీక్షలు రాయించాలని అధికారులకు చెప్పాం. 
- రాష్ట్రంలో అన్ని సినిమా థియేటర్లు, మాల్స్, స్విమ్మింగ్‌ పూల్స్, జిమ్స్, సోషల్‌– కల్చరల్‌ సెంటర్లను ఈ నెల 31వరకు మూసివేయాలని ఇదివరకే ఆదేశించాం. 
- పెద్ద పెద్ద ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాల్లో భక్తులకు దర్శనాలు నిలిపివేశాం. ఆ ఆలయాల్లో నిత్య పూజలు మాత్రం యథావిధిగా జరుగుతాయి. 

ధరలు పెంచితే కఠిన చర్యలు
- నిత్యావసరాల ధరలు పెంచకుండా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకుంటారు. 
- ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని వ్యాపార దృక్పథంతో ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటాం. జైలుకు పంపించడానికి కూడా వెనుకాడం. 
- ఏ వస్తువు ఎంత ధర అని కలెక్టర్లు నోటిఫికేషన్‌ ఇస్తారు. కూరగాయలు, సరకులు అన్నింటికీ తగిన ధర నిర్ణయిస్తారు.  
- కలెక్టర్లు టోల్‌ ఫ్రీ నంబరు ఇస్తారు. ఎవరైనా ఎక్కువ ధరకు అమ్మితే ఆ నంబరుకు ఫోన్‌ చేస్తే పోలీసులు, అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటారు. 

విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా
- విదేశాల నుంచి వచ్చిన వారు 14రోజుల పాటు తప్పనిసరిగా హోం క్వారంటైన్‌లో ఉండాలని కోరుతున్నాం. ఇళ్ల నుంచి అస్సలు బయటకు రావద్దు. 
- ఇలాంటి వారిపై గట్టి నిఘా పెట్టాలని పోలీసులను ఆదేశించాం. 
- వీరికి పోలీసులను అటాచ్‌ చేయమని చెప్పాం. పోలీసులు, మహిళా కానిస్టేబుళ్లు, గ్రామ వలంటీర్లు అందరూ కూడా విదేశాల నుంచి వచ్చిన వారు ఇళ్లలో ఉండేటట్లు చూడాలి.
- తమ స్టేషన్‌ పరిధిలో ఏం జరుగుతోందీ పోలీసులు చెప్పాలి. 

సామాజిక దూరం.. చాలా ముఖ్యం
- ఇప్పుడు ఇంకో కీలకమైన దశకు వచ్చాం. దేశం మొత్తం మీద కరోనాను శాశ్వతంగా అరికట్టాలంటే ఐసోలేషన్, సామాజిక దూరం పాటించాలన్నది చాలా ముఖ్యం. 
- ప్రతి రాష్ట్రంలోనూ ప్రజల రాకపోకలు పూర్తిగా ఆగిపోవాలి. అప్పుడే కరోనాను కట్టడి చేయగలం. 
- కొన్ని రోజులపాటు అలా కట్టడి చేస్తేనే ఈ వ్యాధి వ్యాప్తి చెందదని వైద్య నిపుణులు చెబుతున్నారు. 
- అందుకే 12 రాష్ట్రాలు ఇప్పటికే అంతర్రాష్ట ప్రజా రవాణాను నిలిపివేస్తూ సరిహద్దులు మూసివేశాయి. 
- మనం కూడా ఆ దిశగా అడుగులు వేయకతప్పదు. త్వరలో ఉగాది వస్తోంది. సంతోషమే. కానీ, ప్రజలు మళ్లీ అటూ ఇటూ తిరిగితే కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడం కష్టమవుతుంది. కొంచెం కష్టమైనా కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. మన రాష్ట్ర సరిహద్దులను కూడా మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. 
- ఈ రోజు నుంచీ 31 వరకు అంతర్రాష్ట్ర ప్రజా రవాణాను కట్టడి చేస్తున్నాం. రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తున్నాం. ప్రజా రవాణాను పూర్తిగా ఆపేస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేటు రవాణా సర్వీసులు నిలిపివేస్తున్నాం. 
- ఆటోలు, ట్యాక్సీలు తప్పదు అనుకుంటే అత్యవసరాలకే తిరగాలి. అదీ కూడా ఒక దాంట్లో ఇద్దరి కంటే ఎక్కువమందిని ఎక్కించుకోవద్దు. 
- తప్పనిసరి కాని దుకాణాలు అంటే బంగారం, బట్టల దుకాణాల వంటి వాటిని మార్చి 31 వరకు మూసివేయాలని కోరుతున్నాం. 
- అత్యవసర, నిత్యావసరాలు.. పెట్రోల్, గ్యాస్, ఔషధాల షాపులు, పాలు, కూరగాయలు, కిరాణ షాపులు అందుబాటులో ఉంటాయి. 
- ఆఫీసులు, ఫ్యాక్టరీలు, గోడౌన్లు, మొదలైనవి కనీస సిబ్బందితో మాత్రమే నిర్వహించాలని కోరుతున్నాం.
- ప్రభుత్వ ఆఫీసులు కనీస సిబ్బందితో రొటేషన్‌ విధానంలో వాడుకుంటూ నిర్వహించాలని ఆదేశించాం. 

ఎవరూ ఆందోళన చెందవద్దు
- ఎవరూ భయపడాల్సిన అవసరంలేదు. ఈ వ్యాధితో చనిపోయిన వారు కేవలం 2 శాతం మించి లేరు. 
- అది కూడా వయస్సు ఎక్కువ ఉండడంతో పాటు, తీవ్ర అనారోగ్యం ఉన్న వారే చనిపోయారు. 
- ప్రపంచంలో 80.90 శాతం మంది ఇళ్లలో ఉండే నయం అయ్యారు. కేవలం 13.80 శాతమే ఆసుపత్రుల్లో చేరారు. వారిలో కూడా 4.70 శాతమే ఐసీయూలో చికిత్స పొందారు.
- అదే సమయంలో  జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ వ్యాధి ఏ స్థాయికి వెళ్తుందో అన్న భయం కూడా పొంచి ఉంది. 
- మన ఇళ్లల్లో పెద్దవాళ్లను కాపాడుకోవాలంటే జాగ్రత్తలు పాటించాలి. 
- అవ్వాతాతలు బయటకు వెళ్లొద్దు. 10 ఏళ్లలోపు పిల్లలను బయటకు పంపొద్దని తల్లిదండ్రులను కోరుతున్నాను.
- అందరూ కూడా 31 వరకు దయచేసి ఇళ్లలోనే ఉండండి. ఎక్కడికీ కదలొద్దని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
- మరీ ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నాం. వారు కచ్చితంగా 14రోజులపాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలి. వాళ్లు పొరపాట్లు చేస్తే తీవ్ర దుష్పరిణామాలు తలెత్తుతాయి. చైనా నుంచి దక్షిణ కొరియా వచ్చిన ఒకే ఒక్క వ్యక్తి బాధ్యతాయుతంగా లేకపోవడంతో వైరస్‌ ఆ దేశం అంతటా వ్యాపించింది. 
- ఎవరికైనా కూడా హోం ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం ఏదన్నా ఉన్నా కూడా 104కు ఫోన్‌ చేయండి. విదేశాల నుంచి వచ్చిన వారితో సంబంధం లేకపోయినాసరే ఇలాంటి లక్షణాలు వస్తే 104కు ఫోన్‌ చేయండి. పీహెచ్‌సీ డాక్టర్, ఆశా వర్కర్లు వచ్చి పరీక్షలు చేస్తారు. 

రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి
- రైతులు, రైతు కూలీలు కూడా తప్పదు అనుకుంటేనే పొలం పనులకు వెళ్లాలి.
వీలైతే వెళ్లకుండా ఉండండి. తప్పదు అనుకుంటే అక్కడ కూడా కనీసం 2 మీటర్లు దూరం పాటించండి. 

అసెంబ్లీ తక్కువ రోజులే
- పది మంది మించి గుమిగూడొద్దు. అందుకోసం నిషేధాజ్ఞలు కూడా జారీ చేస్తాం.
- కానీ, అసెంబ్లీ పెట్టక తప్పదు. బడ్జెట్‌ను ఆమోదించాలి కదా. 
- అందుకు అసెంబ్లీ సమావేశాలు తక్కువ రోజులే నిర్వహిస్తాం. 

అందరం కలిసి అడుగులు వేద్దాం.. కరోనాను కట్టడి చేద్దాం
- ప్రజలు పరిస్థితులను గమనిస్తున్నారు కాబట్టి అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
- అందరం ఒకటి కావాలి. దేశమంతా ఏకమవుతుంది. 
- ఇప్పటికే  కర్ణాటక, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు సరిహద్దులు మూసివేశాయి. రాకపోకలు ఆపేస్తేనే వైరస్‌ను అరికట్టవచ్చు. సంపూర్ణంగా చేయాలితప్ప సగం సగం చేయకూడదు. సరిహద్దుల మూసివేత కేవలం ఒక్క రాష్ట్రం మాత్రం చేయలేదు. దేశమంతా ప్రయాణికుల రైళ్లు ఆపేస్తున్నారు. అంతర్రాష్ట్ర బస్సుల రాకపోకలు ఆపాలంటే అందరూ ఒకేసారి చేయాలి. అందుకే ఈనెల 31వరకు రాష్ట్రమంతా లాక్‌డౌన్‌  అమలుచేద్దాం. తరువాత కేంద్రం సలహాలు సూచనలుచూసి పరిస్థితిని సమీక్షిద్దాం.
- అందరూ ఒకే రకమైన అడుగులు వేస్తున్నారు.
- అవే అడుగులు మనం కూడా వేయగలిగితేనే దీన్ని ఎక్కడికక్కడ కట్టడి చేయగలుగుతాం.
- ఇందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నా. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top