కోవిడ్‌పై సర్వసన్నద్ధం

CM YS Jagan Review Meeting With Officials On Covid-19 Prevention - Sakshi

17 వేల మంది డాక్టర్లు, 12 వేల మంది నర్సులు  

మంచి జీతాలిచ్చి వారి సేవలను ఉపయోగించుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌

కోవిడ్‌ నివారణ చర్యలపై సీఎం జగన్‌ ఉన్నత స్థాయి సమీక్ష 

క్వారంటైన్‌ సెంటర్లు, ఆస్పత్రుల్లో మరింత మెరుగైన సేవలు అందాలి 

కోవిడ్‌ – 19 ఫిర్యాదుల స్వీకరణకు ఆయా కేంద్రాల వద్ద కాల్‌ సెంటర్‌ నంబర్‌తో హోర్డింగులు 

ఫీడ్‌బ్యాక్‌ కోసం ప్రతిరోజూ ప్రతి క్వారంటైన్‌ సెంటర్, ఆసుపత్రికీ ఫోన్‌ కాల్స్‌  

ఏడు రోజుల పాటు అధికారుల స్పెషల్‌ డ్రైవ్‌

కోవిడ్‌ మృతుల అంత్యక్రియలకు రూ.15,000

కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో ప్రత్యేక బస్సుల్లో పరీక్షలు 

ఏ ఆసుపత్రి అయినా కోవిడ్‌ కేసులను నిరాకరిస్తే కఠిన చర్యలు  

క్వారంటైన్‌ సెంటర్లు, ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందించాలి. కోవిడ్‌–19 కేంద్రాల్లో సేవల విషయంలో నాణ్యతలో రాజీపడితే ఉపేక్షించేది లేదు. నాణ్యతపై దృష్టి పెట్టని సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేయాలి.  కోవిడ్‌–19 పరీక్షలకు శాశ్వత కేంద్రాలను ఏర్పాటు చేయాలి. అవి ఎక్కడున్నాయో సులువుగా తెలుసుకుని, అక్కడికి వెళ్లి పరీక్షలు చేయించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలి. కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో ప్రత్యేక బస్సుల ద్వారా పరీక్షలు నిర్వహించాలి.  
కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, క్వారంటైన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్న వారి నుంచి ఫీడ్‌ బ్యాక్‌ కోసం ప్రతిరోజూ ప్రతి క్వారంటైన్‌ సెంటర్, ఆసుపత్రికీ ర్యాండమ్‌గా 3 కాల్స్‌ వెళ్లాలి. ఫిర్యాదుల స్వీకరణకు ఆయా కేంద్రాల వద్ద కాల్‌ సెంటర్‌ నంబర్‌తో హోర్డింగ్స్‌ ఏర్పాటు చేయాలి. పారిశుధ్యం, భోజనంపై దృష్టి సారించాలి. వచ్చే ఏడు రోజుల పాటు అధికారులు ఈ దిశగా స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించాలి.కోవిడ్‌ కేసు వస్తే ఏ ఆసుపత్రి కూడా వైద్యానికి నిరాకరించకూడదు. అలా నిరాకరిస్తే కఠినంగా వ్యవహరించి వాటి అనుమతి రద్దు చేసేందుకూ వెనుకాడొద్దు.    

సాక్షి, అమరావతి:  కోవిడ్‌–19ను ఎదుర్కొనేందుకు భవిష్యత్‌ అవసరాల కోసం 17 వేల మంది డాక్టర్లు, 12 వేల మంది నర్సులను సిద్ధం చేసేలా రూపొందించిన ప్రణాళిక అమలుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. విపత్తు సమయంలో సేవలందిస్తున్న వారికి మెరుగైన జీతాలు ఇవ్వాలని ఆదేశించారు. కోవిడ్‌–19 నివారణ చర్యలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అవసరాలకు అనుగుణంగా వైద్యుల నియామకానికి సన్నాహాలు చేస్తున్నామని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు. ఇప్పటికే వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది డేటా బేస్‌ సిద్ధం చేశామన్నారు. కనీసం 17 వేల మందికి పైగా డాక్టర్లు, 12 వేల మందికి పైగా నర్సుల సేవలు పొందేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. దీని అమలుకు వైఎస్‌ జగన్‌ అక్కడికక్కడే అంగీకారం తెలిపారు. ఈ సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి.  
మంగళవారం కోవిడ్‌–19 నివారణ చర్యలపై క్యాంపు కార్యాలయంలో సమీక్షిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

ప్రజల్లో అవగాహన కల్పించాలి 
► ఎవరికైనా కోవిడ్‌ సోకిందన్న అనుమానం ఉంటే వారు ఎక్కడకు వెళ్లాలి? ఎవరికి కాల్‌ చేయాలి? వారు ఏం చేయాలన్న దానిపై చైతన్యం ఉండాలి. ఈ మేరకు స్పష్టమైన ప్రొటోకాల్‌ ఉండాలి. ప్రజల్లో అవగాహన కల్పించే హోర్డింగ్స్‌ను విస్తృతంగా ఏర్పాటు చేయాలి. ఎస్‌ఓపీ (స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌) ప్రకారం పరీక్షలు చేయాలి. టెస్టులు చేయాల్సిన వారి కేటగిరీలను స్పష్టంగా పేర్కొనాలి.  
► కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేయడానికి ప్రత్యేక బస్సులను వినియోగించి పరీక్షలు చేస్తున్నామని అధికారులు వివరించారు. హైరిస్క్‌ ఉన్న క్లస్టర్లలో కూడా ఆ బస్సుల ద్వారా పరీక్షలు చేసి కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేస్తున్నామని చెప్పారు.  
► టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చినా సరే.. ఎక్స్‌రేలో విభిన్నంగా కనిపిస్తే పాజిటివ్‌గా పరిగణించి వైద్యం అందిస్తున్నామని వివరించారు. పాజిటివ్‌గా తేలిన వారు ఆలస్యంగా ఆసుపత్రికి వస్తుండడం వల్లే మరణాలు సంభవిస్తున్నాయని, అందుకే వాటిని తగ్గించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని సీఎంకు వివరించారు. 
► సమీక్షకు ముందు రాష్ట్రంలో కోవిడ్‌–19 పరీక్షలు, కేసుల తీరును అధికారులు వెల్లడించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్య) ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి ఆ శాఖకు చెందిన ముఖ్య అధికారులు పాల్గొన్నారు.   

క్వారంటైన్‌ సెంటర్లపై ఫోకస్‌ పెంచాలి 
► క్వారంటైన్‌ సెంటర్ల మీద ఫోకస్‌ పెంచాలి. ప్రధానంగా పారిశుధ్యంపై దృష్టి పెట్టాలి. భోజనం నాణ్యత మీద కూడా దృష్టి పెట్టాలి. వచ్చే 7 రోజులు అధికారులు వాటిపై డ్రైవ్‌ చేయాలి. 
► కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, క్వారంటైన్‌ కేంద్రాల్లో మంచి ప్రమాణాలు పాటించేలా చూడాల్సిన బాధ్యత అధికారులదే. అందుకు ఎలాంటి మార్పులు అవసరమైనా చేయాలి. క్రమం తప్పకుండా ఆసుపత్రులను, క్వారంటైన్‌ సెంటర్లను పర్యవేక్షించాలి. 
► మనం దీర్ఘకాలం కోవిడ్‌తో పోరాడాల్సిన అవసరం ఉంది. అందువల్ల సేవల్లో నాణ్యత అనేది చాలా ముఖ్యం. చేసే పనుల్లో నాణ్యత లేకపోతే మనం ఫలితాలు సాధించలేం. 
► కోవిడ్‌ ఆస్పత్రుల్లో కూడా వైద్య సేవలపై పూర్తిగా దృష్టి పెట్టాలి. చికిత్స పొందుతున్న వారికి జీఎంపీ (గుడ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రాక్టీస్‌) ప్రమాణాలున్న మందులు అందాలి. రానున్న కాలంలో అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సదుపాయాలు కల్పించాలి.  

నేడు కేబినెట్‌ భేటీ
సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఇసుక సరఫరాకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుపై చర్చించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చేపట్టిన నాడు–నేడు కార్యక్రమానికి కేబినెట్‌ ఆమోదం తెలుపనుంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top