వైఎస్‌ జగన్‌: త్వరలోనే రచ్చబండ కార్యక్రమం | YS Jagan Review Meeting with Officials, Decided to Start Racha Banda Program Soon - Sakshi
Sakshi News home page

నాలుగు వారాల్లోగా పనులు ప్రారంభం కావాలి: సీఎం జగన్‌ 

Nov 22 2019 1:56 PM | Updated on Nov 22 2019 5:32 PM

CM YS Jagan Comments On Meeting With Govt Officials - Sakshi

జనవరి- ఫిబ్రవరి నుంచి రచ్చబండ కార్యక్రమం ఉంటుంది. ఈ సందర్బంగా ప్రజల నుంచి వచ్చే వినతులపైన హామీలు ఇస్తాం. ఆ హామీలకు సంబంధించి కచ్చితంగా పనులు జరగాలి. మనం మాట ఇస్తే కచ్చితంగా చేయాలి.

సాక్షి, అమరావతి : గత ప్రభుత్వం రూ.40 వేల కోట్ల బిల్లులను పెండింగులో పెట్టి... రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడంపై దృష్టిపెట్టి.. ఫోకస్‌గా ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సీఎం జగన్‌ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా... నవరత్నాల అమలే తమ ప్రభుత్వానికున్న ఫోకస్‌ అని స్పష్టం చేశారు. ప్రతి పథకాన్ని సంతృప్తస్థాయిలో అమలు చేయడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు. నిధులను అక్కడ కొంత, ఇక్కడ కొంత ఖర్చు చేస్తే వచ్చే ప్రయోజనం ఉండదని.. ప్రణాళిక ప్రకారం పథకాల అమలు జరగాలని ఆదేశించారు. అనవసర వ్యయాన్ని తగ్గించడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.

 ‘మేనిఫెస్టో ద్వారా ప్రాధాన్యతలేంటో చెప్పాం. కాబట్టి అందరి వద్దా మేనిఫెస్టో ఉండాలి. 14 నెలల పాటు 3648 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజల నుంచి వచ్చిన అనేక విజ్ఞప్తులను పరిశీలించి, అధ్యయనం చేసి ఈ మేనిఫెస్టోను తయారుచేశాం. ఏసీ గదుల్లో ఉండి తయారు చేసింది కాదు. ప్రతి హామీ కూడా ప్రజల వినతుల నుంచి, క్షేత్రస్థాయిలో చూసిన పరిస్థితుల నుంచి, వెనకబడ్డ వర్గాల వేదన నుంచే వచ్చింది. సామాన్యులపై భారం మోపకుండా ఆదాయాలు ఎలా పెంచుకోగలమో ఆలోచనలు చేయాలి. ఢిల్లీలో ఉన్న మన అధికారుల సేవలను బాగా వినియోగించుకోవాలి. కేంద్రం నుంచి వీలైనన్ని నిధుల్ని తెచ్చుకోవాలి. ముఖ్యమంత్రిగా నేను ఏదైనా హామీ ఇస్తే అది ప్రభుతమిచ్చే హామీనే అని గుర్తుపెట్టుకోవాలి’ అని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

అదే విధంగా జిల్లాల పర్యటనల సందర్భంగా తాను ఇచ్చే హామీల అమలుపై దృష్టిపెట్టాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ‘జనవరి- ఫిబ్రవరి నుంచి రచ్చబండ కార్యక్రమం ఉంటుంది. ఈ సందర్బంగా ప్రజల నుంచి వచ్చే వినతులపైన హామీలు ఇస్తాం. ఆ హామీలకు సంబంధించి కచ్చితంగా పనులు జరగాలి. మనం మాట ఇస్తే కచ్చితంగా చేయాలి. ఎలాంటి తాత్సారం ఉండకూడదు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాటను నెరవేర్చలేదన్న మాట రాకూడదు. విశ్వసనీయత అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకూడదు. ఇందుకోసం అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలి. ఏదైనా పనికి శంకుస్థాపన చేస్తే నాలుగు వారాల్లోగా పనులు ప్రారంభం కావాలి. వచ్చే సమీక్షా సమావేశానికి జిల్లాల పర్యటన సందర్భంగా నేను ఇచ్చిన హామీలు కచ్చితంగా నెరవేర్చాలి. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చినప్పుడే ఈ ప్రభుత్వం మరోసారి ఎన్నికవుతుంది. మేనిఫెస్టోను అమలు చేయగలిగితే.. ప్రజలకు మేలు చేసినట్టే అని సీఎం జగన్ అధికారులతో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement