
సాక్షి, అమరావతి : ప్రతి లబ్ధిదారుడి ఇంటికి నాణ్యమైన బియాన్ని ప్యాక్ చేసి అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ అంశంపై సోమవారం సీఎం జగన్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల నుంచి బియ్యం సేకరణ, ప్యాకేజ్డ్ యూనిట్ల ఏర్పాటు, గోదాముల్లో బియ్యాన్ని భద్రపరుస్తున్న తీరు వంటి అంశాలపై ఆయన సమీక్షించారు. శ్రీకాకుళంలో అమలవుతున్న పైలట్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. నాణ్యమైన, ప్యాకేజ్డ్ బియ్యంపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు.
అలాగే ఏప్రిల్ నుంచి మిగిలిన అన్ని జిల్లాల్లో పంపిణీ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. బియ్యం నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని అధికారులను హెచ్చరించారు. ప్రతి దశలోనూ నాణ్యతను పరిశీలించే అవకాశం ఉండాలని, ఎక్కడా కూడా అలసత్వానికి దారితీయకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. బియ్యాన్ని పంపిణీ చేస్తున్న ప్లాస్టిక్ బ్యాగులను తిరిగి వెనక్కి ఇచ్చేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, లేకుంటే పర్యావరణం దెబ్బతింటుందని సీఎం జగన్ అధికారులకు సూచించారు.