విజయవాడకు సీజేఐ జస్టిస్‌ గొగొయ్‌ రాక 

CJI Justice Gogoi arrives to Vijayawada - Sakshi

గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికిన హైకోర్టు సీజే ప్రవీణ్‌కుమార్‌ 

దుర్గమ్మను దర్శించుకున్న జస్టిస్‌ గొగొయ్‌.. ఆలయ మర్యాదలతో స్వాగతం 

అమ్మవారి సేవలో సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సుభాష్‌రెడ్డి 

సీజేఐను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం చంద్రబాబు 

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ)/గన్నవరం: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌కు శనివారం గన్నవరం విమానాశ్రయంలో పలువురు న్యాయాధిపతులు, ప్రభుత్వాధిపతులు స్వాగతం పలికారు. ఏపీ హైకోర్టు తాత్కాలిక భవనం ప్రారంభోత్సవానికి న్యూఢిల్లీ నుంచి విమానంలో జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ దంపతులు విచ్చేశారు. వీరితోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ ఆర్‌ సుభాష్‌రెడ్డిలు కూడా గన్నవరం చేరుకున్నారు. విమానాశ్రయంలో సీజేఐ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. స్వాగతం పలికినవారిలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులతో పాటు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ మానవేంద్రనాథ్‌రాయ్, రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పి.నారాయణ, రాజ్యసభ సభ్యులు కె.రవీంద్రకుమార్, జిల్లా న్యాయమూర్తి వై.లక్ష్మణరావు, జిల్లా కలెక్టర్‌ బీ.లక్ష్మీకాంతం, నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకాతిరుమలరావులు ఉన్నారు. 

దుర్గమ్మకు సీజేఐ ప్రత్యేక పూజలు 
ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను శనివారం సుప్రీంకోర్టు  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌తోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సుభాష్‌రెడ్డి, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శివశంకర్‌లు విచ్చేశారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన న్యాయమూర్తులకు ఆలయ ఈవో వి.కోటేశ్వరమ్మ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. 

అనంతరం ఆలయ ఈవో అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.
సీజేఐతో చంద్రబాబు భేటీ 
సాక్షి, అమరావతి: సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ను సీఎం చంద్రబాబు శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఏపీ హైకోర్టు తాత్కాలిక భవనం ప్రారంభానికి వచ్చిన జస్టిస్‌ గొగొయ్‌ నోవాటెల్‌ హోటల్లో విడిది చేశారు.   

సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం చంద్రబాబునాయుడు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top