కళ్లు మూసుకున్నాం.. కానిచ్చేయండి

In the Chittoor District, TDP Leaders are in Violation of the Election Code - Sakshi

సాక్షి, చిత్తూరు: జిల్లాలో తెలుగు తమ్ముళ్లు యథేచ్ఛగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో వారు పట్టపగలే రెచ్చిపోతున్నారు. బరితెగించి ఓట్ల కొనుగోలుకు స్కెచ్‌లు రూపొందిస్తున్నారు. దీనికి ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు వేదికలవుతున్నాయి. అడ్డుకున్న వారిపై దాడికి తెగబడుతున్నారు. ప్రతి మండలంలోనూ టీడీపీ నాయకులు ఆత్మీయ సమావేశాలు, విందులు ఏర్పాటుచేస్తున్నారు. కుప్పం, పలమనేరు, చంద్రగిరి, పీలేరు నియోజకవర్గాల్లో రోడ్లపైనే డబ్బులు పంచుతున్నారు. 

ఎన్నికల నియమావళిని తెలుగుతమ్ముళ్లు అవహేళన చేస్తున్నారు. ఇష్టారీతిన ప్రవర్తిస్తూ కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారు. ఓట్లకు నోట్లు వెదజల్లుతున్నారు. ఈ తతంగం అంతా పోలీసులకు, ఎన్నికల అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. ప్రతి రోజూ కోట్ల కొద్దీ నగదు ఓట్లకోసం వెచ్చిస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అధికారుల తీరు వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉందంటూ ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కోడ్‌ ఉల్లంఘనపై ఎవరైనా మండల స్థాయి పోలీసులు, ఇతర అధికారులకు ఫిర్యాదు చేస్తే తిరిగి వారిపైనే కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో ఫిర్యాదు చేసేందుకు వెనకాడుతున్నారు. 

ఆత్మీయ సమావేశాలు
కుల, ఉద్యోగ సంఘాలతో టీడీపీ నాయకులు ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా పబ్లిక్‌గా జరుగుతోంది. మద్యం, మాంసం విపరీతంగా పంచుతూ ఆకుట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడికక్కడే ఒక్కో కుల సంఘానికి ఇంత అంటూ డబ్బు సూట్‌కేసుల నిండా పంపిణీ చేస్తున్నారు. తాజాగా తిరుపతిలో అర్బన్‌ హాట్‌ సమీపంలోని ఓ హోటల్‌లో ఓ సామాజిక వర్గం ఆత్మీయ సమావేశం నిర్వహించింది. టీడీపీ అభ్యర్థికి ఓట్లేయాలని ఆ  సంఘం నాయకులపై సుగుణమ్మ అనుచరులు ఒత్తిడి తెచ్చారు.

వారు అడిగినంత ముట్టజెప్పారు. కచ్చితంగా ఓట్లేసేలా ప్రమాణం చేయించుకున్నారు. చిత్తూరులోని ప్రభాగ్రాండ్‌ ఇన్‌ హోటెల్‌లో ఓ సామాజిక వర్గం టీచర్లందరూ సమావేశమయ్యారు. కచ్చింతంగా టీడీపీకి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వేస్తామని హామీ తీసుకున్నారు. వారికి టీడీపీ మేనిఫెస్టో పంపిణీ చేసి ప్రచారం నిర్వహించాలని తెలుగుతమ్ముళ్లు కోరడంతో డబ్బు ముట్టజెప్పాలని టీచర్లు కోరారు. దీంతో వారు అడిగినంత డబ్బు ఇచ్చి పోస్టల్‌ బ్యాలెట్లు కొనుగోలు చేశారు. ప్రచారం నిర్వహిస్తామని చంద్రబాబు సామాజికవర్గం టీచర్లు నిర్వాహకులకు హామీ ఇచ్చారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top