బాబూ.. సైకిల్‌ తొక్కలేం!

In Chittoor District Nobody Is Interested To Contest On Behalf Of TDP - Sakshi

మేయర్‌ పదవికి టీడీపీ రాంరాం 

మహిళా నేతల ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ 

ఒత్తిడి చేస్తున్నారంటూ ఒకింత అసహనం 

తిరుపతి, చిత్తూరు నాయకులకు చేదు అనుభవం 

స్థానిక సంస్థల్లోనూ అదే పరిస్థితి 

జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకూ ముఖం చాటేస్తున్న వైనం 

పల్లెలు.. పట్టణాల్లో స్థానిక ఎన్నికల వేడి రాజుకుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫుల్‌ జోష్‌తో దూసుకెళ్తోంది. టీడీపీ శిబిరంలో నామమాత్రంగా కూడా ఉత్సాహం కనిపించడం లేదు. ఆ పార్టీ నాయకుల వద్ద పోటీ విషయం ప్రస్తావిస్తుండగానే.. తమకేమీ సంబంధం లేనట్లు ‘అన్నో.. మీకో దణ్ణం’ అంటూ ఎవరిదారిన వారు వెళ్లిపోతున్నారని జిల్లా పార్టీ నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. తన సొంత జిల్లాలోనే ఇలా ఉంటే రాష్ట్రంలో ఏ ముఖం పెట్టుకుని తిరగాలని పార్టీ అధినేత చంద్రబాబు,  కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌ లోలోన మదనపడుతున్నట్టు తెలిసింది. అందుకే స్వయంగా రంగంలోకి దిగి మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం.

సాక్షి, తిరుపతి: స్థానిక, పురపాలక ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసేందుకు జిల్లాలో ఆ పార్టీ నాయకులు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ విషయం తెలుసుకున్న అధినేత చంద్రబాబు ముఖ్య నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులతో ఒకరు తరువాత ఒకరు నేరుగా ఫోన్లలో మాట్లాడినట్లు సమాచారం. అయినా ముఖ్య నాయకులు తప్ప ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులెవరూ స్పందించలేదని తెలిసింది. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు సొంత జిల్లాలో అన్ని స్థానాల్లో పోటీచేసి తీరాల్సిందేనని రాష్ట్ర పార్టీ నాయకులు ఒత్తిడి తెస్తున్నారు. పోటీ చెయ్యకుండా చేతులెత్తేస్తే రాష్ట్రంలోనే కాదు.. ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు పరువుపోతుందని ప్రాధేయపడుతున్నట్లు తెలిసింది. ‘ఇన్నాళ్లు పార్టీకి చేసిన సేవలు చాలు.. మా మానాన మమ్మల్ని వదిలెయ్యండి’ అంటూ చేతులెత్తేస్తున్నట్లు పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 

వార్డుకే దిక్కులేదు.. జెడ్పీ చైర్మనా? 
తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లతో పాటు మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, పుత్తూరు, నగరి మున్సిపాలిటీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో వైఎస్సార్‌సీపీ ముందు వరుసలో ఉంది. అభ్యర్థుల ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చింది. నామినేషన్లు కూడా వేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష టీడీపీలో వార్డు మెంబర్‌గా పోటీ చెయ్యించేందుకు ఆ పార్టీ నాయకులు జుట్టు పీక్కుంటున్నారు. ఈ సమయంలో టీడీపీ జెడ్పీ చైర్మన్‌ అభ్యర్థి ఎవరు? అని పార్టీ అధిష్టానం జిల్లా స్థాయి నాయకులను అడిగినట్లు తెలిసింది. ‘వార్డుకే దిక్కులేదు.. జెడ్పీ చైర్మనా?’ అంటూ వారు నిట్టూర్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్‌ మేయర్‌ అభ్యర్థులుగా ఎవరిని ప్రకటించాలనే విషయంపైనా టీడీపీ నేతలు తేల్చుకోలేకపోతున్నారు. చదవండి: ఆ జిల్లాలో టీడీపీ దాదాపు ఖాళీ..! 

తిరుపతి నుంచి జ్యోత్స్న? 
తిరుపతి మేయర్‌ అభ్యర్థిగా టీడీపీ తరఫున తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌వర్మ సతీమణి జోత్స్న పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు  విశ్వసనీయ సమాచారం. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ చైర్మన్‌ నరసింహయాదవ్‌ తమ కుటుంబం నుంచి ఒకరిని మేయర్‌ అభ్యర్థిగా ప్రకటించమని అడినట్లు తెలిసింది. శ్రీధర్‌వర్మ, ఆయన తండ్రి ఎన్టీఆర్‌ రాజు పార్టీకి మొదటి నుంచి సేవ చేస్తున్నారని తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే మొన్నటి వరకు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మనుమరాలికి ఇప్పించాలని, మరోవైపు మహిళా విభాగం అధ్యక్షురాలు పుష్పావతి ఆశించారు. అంతకు ముందు డాక్టర్‌ సుధారాణిని పార్టీ నాయకులు అడిగినట్లు తెలిసింది. ఆమె సుముఖంగా లేరని సమాచారం. చిత్తూరు విషయానికి వస్తే మేయర్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని తెలిసింది.  

టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వలసలు 
ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారని తెలుసుకున్న టీడీపీ అధి ష్టానం తీవ్ర ఆందోళన చెందుతున్న తరుణంలో ఆ పార్టీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, పీలేరు, మదనపల్లె, నగరి, కుప్పం ప్రాంతాలకు చెందిన టీడీపీ ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పుకుంటున్నారు. మరో రెండు మూడు రోజుల్లో టీడీపీలోని ముఖ్యమైన నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ సమచారం.   చదవండి: దళిత నేతకు గెలవని సీటు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top