హమ్మయ్య! దొరికారు..

Children Missing Case Mystery Reveals in East Godavari - Sakshi

అద్యశ్యమైన ఆ ఇద్దరు బాలల ఆచూకీ లభ్యం

ఛేదించిన పోలీసులు తల్లిదండ్రులకు అప్పగింత

తూర్పుగోదావరి, కొత్తపల్లి: బషీర్‌బీబీ(బంగారుపాప) ఉరుసు ఉత్సవాల్లో అదృశ్యమైన ఆ ఇద్దరు బాలల ఆచూకీ లభ్యమైంది. ఆ చిన్నారులను పోలీసులు వారి తల్లిదండ్రులకు అప్పగించారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం కాకినాడ డీఎస్పీ పీవీఆర్‌ఎస్‌ఎస్‌ఎస్‌ఎంవీ రవివర్మ విలేకరుల సమావేశాన్ని నిర్వహించి బాలురు అదృశ్యానికి సంబంధించిన వివరాలు తెలియపరిచారు. గుంటూరు జిల్లా పట్నారిపాలెం మండలం చందోలు గ్రామానికి చెందిన షేక్‌ అజీజ్,ఇదే జిల్లా పొన్నూరు రోడ్డుకు చెందిన కరీముల్లా వారివారి కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 16న ఉరుసుఉత్సవాల కోసం పొన్నాడ వచ్చారు. సోమవారం ఉదయం తమ స్వస్థలాలకు వెళ్లేందు సిద్ధమయ్యారు. అప్పటి వరకూ ఆలయ సమీపంలో ఆడుకున్న షేక్‌ అజీమ్‌ తనయుడు షేక్‌ మహబూబ్‌ సుభానీ(4), కరీముల్లా తనయుడు సయ్యద్‌ అబ్దుల్లా(5) కనిపించకపోవడంతో చుట్టూ పరిసర ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు గాలించారు. వారి ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారని ఎస్సై కృష్ణమాచారి కేసు నమోదు చేశారు.

అదృశ్యమైన సయ్యద్‌ అబ్దుల్లా, షేక్‌ మహబూబ్‌ సుభానీలిద్దరూ సోమవారం ఆలయం వద్ద ఆడుకుంటుండగా కారుపై అమ్మవారి దర్శనానికి వచ్చిన వారు వారికి బొమ్మలు కొనిస్తామని చెప్పి కారు ఎక్కించుకుని తీసుకువెళ్లారని డీఎస్పీ తెలిపారు. ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారన్న విషయం తెలుసుకున్న వారు భయంతో కాకినాడ రూరల్‌ మండలం పండూరు గ్రామంలో ఖాళీ స్థలంలో మంగళవారం రాత్రి చిన్నారులు ఇద్దరినీ విడిచిపెట్టి తిమ్మాపురం పొలీసులకు సమాచారాన్ని అందజేశారు. ఎవరో ఇద్దరు చిన్నారులు పండూరులో ఉన్నారని చెప్పడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కొత్తపల్లి పోలీసులకు అప్పగించారు. చిన్నారులను వారి తల్లిదండ్రులకు డీఎస్పీ సమక్షంలో అప్పగించారు. చిన్నారులను చూసిన తల్లిదండ్రుల ఆనందం వర్ణనాతీతం. తమ బిడ్డలను అప్పగించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో కొత్తపల్లి ఎస్సై కృష్ణమాచారి, పిఠాపురం ఇన్‌చార్జి సీఐ ఈశ్వరుడు, సీఐ సూర్యఅప్పారావు, పిఠాపురం ఎస్సై శోభన్‌కుమార్‌ తదితర పోలీసు సిబ్బంది ఉన్నారు.

అమ్మవారికి మొక్కుబడి తీర్చుకున్నారు
అదృశ్యమైన చిన్నారులు తల్లిదండ్రుల వద్దకు చేరుకోవడంతో తల్లిదండ్రులు బషీర్‌బీబీ అమ్మవారికి తలనీలాలు సమర్పించి మొక్కుబడి తీర్చుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top