
సాక్షి, నెల్లూరు: ఉయ్యాలపల్లి చిన్నారుల అదృశ్యం ఘటన.. విషాదాంతం అయ్యింది. కనిపించకుండా పోయిన ఇద్దరు చిన్నారులు మృతదేహాలుగా కనిపించడంతో ఆ తల్లులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఈ పరిణామంతో.. మిస్సింగ్ కేసును మిస్టరీ డెత్ కేసుగా మార్చిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఉయ్యాలపల్లి(Uyyalapalli) గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు విష్ణువర్దన్, శ్రవణ్‌లు బుధవారం మధ్యాహ్నాం ఇంటి బయట ఆడుకుంటూ.. కనిపించకుండా పోయారు. ఈ క్రమంలో తల్లిదండ్రుల ఫిర్యాదులతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేపట్టారు. ఆడుకుంటూ అడవిలోకి వెళ్లి ఉంటారనే స్థానికులు చెప్పడంతో డ్రోన్, డాగ్ స్క్వాడ్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే..
గురువారం విష్ణువర్దన్ మృతదేహం చెరువులో తేలియాడుతూ కనిపించింది. దీంతో అధికారులు ఈతగాళ్ల సాయంతో బయటకు తీశారు. ఆపై అనుమానంతో కొంత నీటిని బయటకు తోడేయడంతో శ్రవణ్ మృతదేహాం కూడా బయటపడింది. మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.