
పక్కా స్కెచ్‌తోనే చెన్నై తీసుకెళ్లి హతమార్చారు..
ప్రేమించాడని నెపంతోనే యువతి కుటుంబ సభ్యులు ఘాతుకం
తమ కుమారుడి మృతిపై నిష్పాక్షికంగా విచారణ చేపట్టాలి
మృతుడు నవీన్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల డిమాండ్
కాశీపురంలో అశ్రునయనాల నడుమ అంత్యక్రియలు
దేవరాపల్లి: తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఇది ముమ్మాటికే హత్యేనని దేవరాపల్లి మండలం కాశీపురానికి చెందిన డెక్క నవీన్ తల్లిదండ్రులు చెబుతున్నారు. డెక్క నవీన్(23) చెన్నైలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. స్నేహితులతో కలిసి తీర్థయాత్రకు వెళ్లిన తమ కుమారుడు నవీన్ మేడ మీద నుంచి కింద పడి చనిపోయాడంటూ ఓ యువతి ఫోన్ నుంచి మరో యువకుడు ఫోన్ చేసి చెప్పడం పట్ల వారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తమ కుమారుడు ప్రేమించిన రాంబిల్లి మండలం వెంకటాపురానికి చెందిన యువతితో పాటు ఆమె తల్లి, వారి బంధవులు పథకం ప్రకారం తమ కుమారుడిని తీర్థ యాత్ర పేరుతో తీసుకెళ్లి హతమార్చారని మృతుడి తల్లిదండ్రులు రాంబాబు, విజయ, చెల్లెలు రేష్మ ఆరోపించారు. నవీన్ మృతిపై నిష్పాక్షికంగా విచారణ చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలంటూ వారు డిమాండ్ చేశారు. ప్రేమిస్తే ఇంత దారుణంగా హతమారుస్తారా అంటూ గుండెలవిసేలా రోదించారు. తమకు న్యాయం జరిగేంత వరకు న్యాయ పోరాటం చేస్తామన్నారు. హోంమంత్రిని, ఎస్పీని, ఎమ్మెల్యేను కలిసి తమ కుమారుడి మృతిపై విచారణ చేసి న్యాయం చేయమని కోరతామని శనివారం విలేకర్లకు మృతుడి తల్లిదండ్రులు తెలిపారు.
బతుకుతెరువు కోసం అచ్యుతాపురం వలస
కాశీపురానికి చెందిన నవీన్ కుటుంబం సుమారు 12 సంవత్సరాల క్రితం బతుకుతెరువు కోసం అచ్యుతాపురం మండలం చినపూడి గ్రామానికి వలస వెళ్లారు. నవీన్ తండ్రి రాంబాబు అక్కడ ఓప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ పిల్లలను చదివిస్తున్నారు. ఇంటర్, ఐటీఐ చదివిన నవీన్ అథ్లెటిక్స్‌లో జాతీయ స్థాయి క్రీడాకారుడిగా ఎదిగి రాణిస్తున్నాడు. అతను చదువుకునే సమయంలో తనతో చదివిన అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆమె మరో రాష్ట్రంలో చదువుతుండగా, నవీన్ రెండు నెలల కిందట తమ కుటుంబం నివాసం ఉంటున్న ప్రాంతంలోని ఓ ప్రైవేటు కంపెనీలో చిరు ఉద్యోగంలో చేరాడు.
ఈ క్రమంలో స్నేహితులతో కలిసి తీర్థయాత్రలకు వెళుతున్నానంటూ నవీన్ తన తల్లికి చెప్పి ఈ నెల 8వ తేదీ ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. ఎప్పటికప్పుడు తల్లికి ఫోన్ చేసేవాడు. 10న ఉదయం 11 గంటల ప్రాంతంలో అరుణాచలం ఆలయానికి వెళ్లిన నవీన్ తన తల్లితో అక్కడి నుంచే వీడియో కాల్ చేసి మాట్లాడాడు. అదే రోజు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో నవీన్‌కి తల్లి విజయ ఫోన్ చేయగా, చెన్నై వెళ్తున్నామంటూ చెప్పాడు. ఈ నెల 11న (గురువారం) ఉదయం తన కుమారుడు ప్రేమిస్తున్న యువతి ఫోన్‌తో మరో యువకుడు మాట్లాడుతూ నవీన్ మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి విజయకు చెప్పారు.
కాశీపురంలో విషాదఛాయలు
నవీన్ మృతితో స్వగ్రామం కాశీపురంలో విషాదఛాయలు అలముకున్నాయి. చెన్నై నుంచి నవీన్ మృతదేహాన్ని శనివారం ఉదయం కాశీపురానికి తీసుకువచ్చారు. ఆనందపురం నుంచి నవీన్ స్నేహితులు, కుటుంబ సభ్యులు బైక్ ర్యాలీతో స్వగ్రామం తీసుకువచ్చారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు భోరున విలపించిన తీరు అందర్నీ కంటనీరు పెట్టించింది. తమలాంటి కడుపు కోత మరెవ్వరికి రాకూడదంటూ మృతుడి తల్లి రోదించింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అశ్రునయనాల మధ్య కాశీపురం శ్మశానవాటికలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు.
చెన్నైలో కేసు నమోదు
నవీన్ మృతిపై అతని మేనమామ నాళం వాసు చెన్నైలోని కె–10 కొయంబేడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహానికి పంచనామా, పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా హత్య, ఆత్మహత్య అని నిర్ధారణకు వస్తామని పోలీసులు చెప్పినట్లు సమాచారం.