
ఖాతాల నుంచి క్షణాల్లో మాయమవుతున్న డబ్బులు
జిల్లాలో ఏడాది కాలంలో 94 సైబర్ కేసులు నమోదు
ఇప్పటివరకు రూ. 94 లక్షలు ఫ్రీజ్
అచ్యుతాపురం కేంద్రంగా నకిలీ కాల్ సెంటర్
డిజిటల్ అరెస్ట్ చేస్తామని భయపెట్టి కోట్లలో దోపిడీ
అప్రమత్తతే ఆయుధమంటున్న పోలీసులు
సాక్షి, అనకాపల్లి: ఇలా ఒకరిద్దరు కాదు చాలామంది సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోతున్నారు. అవగాహన లేకపోవడంతో కొందరు, అవగాహన ఉండి నిర్లక్ష్యంతో మరికొందరు నష్టపోతున్నారు. పార్ట్‌టైం, ఫుల్‌టైం ఉద్యోగాలు, వర్క్ ఫ్రమ్ హోం అంటూ ఆన్‌లైన్‌లో ఫేక్ లింక్‌లు పెట్టి వాటిని క్లిక్ చేసేలా ఆశ చూపించి మోసం చేస్తారు. ఎక్కువగా ఆన్‌లైన్‌లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ యువతను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. ఫేక్ యాప్‌లు, ఫేక్ లింక్‌ల ద్వారా డేటాని తస్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలపై జిల్లా వ్యాప్తంగా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.
సురక్షితమైన డిజిటల్ లావాదేవీలు...
» బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్, యూపీఐ పిన్, ఓటీపీ, ఏటీఎం, డెబిట్‌కార్డు, క్రెడిట్‌కార్డు వివరాలు ఎవరితోనూ పంచుకోకపోవడమే మంచిది.
» డిజిటల్ లావాదేవీలకు బార్‌కోడ్‌లు, క్యూఆర్ కోడ్‌లు స్కానింగ్ లేదా ఎంపిన్ లేకుండా ఉన్నవే ఎంచుకోవాలి.
» ఏదైనా ఫోన్‌కాల్, ఈ–మెయిల్ చేసి మీ కేవైసీ అప్డేట్ చేయాలని వివరాలు అడిగినా చెప్పరా దు. ఒకవేళ అలాంటి అనుమానాలుంటే బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవాలి. హోం బ్యాంక్ శాఖను సంప్రదించాలి.
» ఈమెయిళ్లు, ఎస్‌ఎంఎస్‌లలో యూఆర్‌ఎల్, డొమైన్ పేర్లను స్పెల్లింగ్ లోపాలుంటే జాగ్రత్తగా తనిఖీ చేయండి. ఆన్‌లైన్ బ్యాంకింగ్ కోసం అధికార వెబ్‌సైట్‌లనే ఉపయోగించాలి.
» ఏదైనా వెబ్‌సైట్, అప్లికేషన్‌లో మీ ఈమెయిల్‌ను యూజర్ ఐడీగా నమోదు చేస్తున్నప్పుడు మీ ఈ–మెయిల్ పాస్‌వర్డ్‌ను ‘పాస్‌వర్డ్’ అని పెట్టుకోవద్దు.
ఆన్‌లైన్ ఉద్యోగం పేరుతో మోసం...
అనకాపల్లిలో గవరపాలేనికి చెందిన మణికంఠ అమెజాన్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాడు. ఈ ఏడాది జనవరి 31న వాట్సాప్‌లో కంపెనీ పేరుతో ఒక లింక్ వచ్చింది. ఇది పార్ట్‌టైమ్ ఉద్యోగమని.. ఇంటిలో కూర్చునే డబ్బు సంపాదించుకోవచ్చని చెప్పడంతో రిజి్రస్టేషన్ కోసం రూ.1,000లు ఫోన్‌పే చేశాడు.
కొద్ది రోజుల్లోనే మణికంఠ ఖాతాలో రూ.1,400 జమ అయ్యాయి. దీంతో పార్ట్‌టైమ్ ఉద్యోగం బావుందని నమ్మిన ఆ యువకుడు నిర్వాహకులు చెప్పిన విధంగా దపదఫాలుగా రూ.1.80 లక్షలు పంపించాడు. తర్వాత అటునుంచి ఒక్క రూపాయీ రాలేదు. దీంతో మోసపోయానని గమనించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే స్పందించి మణికంఠ ఖాతా నుంచి వెళ్లిన డబ్బులో రూ.1.20 లక్షలు ఫ్రీజ్ చేశారు.
అచ్యుతాపురం కేంద్రంగా సైబర్‌డెన్...
అచ్యుతాపురంలో ఒక అపార్ట్‌మెంట్‌లో సైబర్ డెన్‌ను ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేస్తున్న 33 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ కాల్ సెంటర్‌ను నడుపుతూ ప్రజల వ్యక్తిగత బ్యాంక్ వివరాలు మోసపూరితంగా సేకరించి, ఖాతాల్లోని డబ్బులను మాయం చేసే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్నవారిని కూడా టార్గెట్ చేసే ఆ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులను సీఐడీకి అప్పగించారు.
ఆన్‌లైన్ లింక్‌లు క్లిక్ చేయవద్దు..
బ్యాంకుల నుంచి వ్యక్తిగత వివరాలు ఎప్పుడూ అడగరు. అలా అడిగితే అది సైబర్ నేరగాళ్ల పనే. ఆన్‌లైన్ లింక్‌లు వస్తే వాటిని క్లిక్ చేయొద్దు. ఒకవేళ క్లిక్ చేస్తే వెంటనే మీ మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. దానికి ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్ చేయొద్దు. ఒకవేళ చేశారంటే మీ బ్యాంక్ ఖాతా వివరాలు సైబర్ నేరగాళ్లకు చేరినట్టే. ఫేస్‌బుక్కుల్లో కూడా అందమైన అమ్మాయిల పేరిట హానీ ట్రాప్, లింక్‌లు పెట్టి మోసం చేస్తారు. అలా జరిగితే వెంటనే సైబర్ పోలీసులకు తెలియజేయాలి. – సత్యనారాయణ, లీడ్ బ్యాంక్ మేనేజర్
నకిలీ ఆన్‌లైన్ షాపింగ్ వలలో పడొద్దు
సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోయిన బాధితులు ఫిర్యాదు చేస్తే బ్యాంక్ ఖాతాల్లో నగదు ఫ్రీజ్ చేస్తాం. అలా ఫ్రీజ్ చేసిన సొమ్మును అనేక కేసుల్లో బాధితులకు ఇప్పటికే అప్ప గించాం. పండగల సమయాల్లో నకిలీ ఆన్‌లైన్ షాపింగ్ యాప్‌ల ద్వారా ఆఫర్‌లు ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. వాటి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. – తుహిన్ సిన్హా, ఎస్పీ
డిజిటల్ అరెస్ట్ చేస్తామంటూ భయపెట్టారు..
నర్సీపటా్ననికి చెందిన ఒక వృద్ధుడు సైబర్ మోసానికి గురయ్యారు. ముంబై పోలీసులమంటూ ఫోన్ చేసి.. మీ బ్యాంక్ ఖాతాలో అనాథరైజ్డ్‌గా రూ.2 కోట్ల వరకు నగదు బదిలీ అయిందని, తక్షణమే రిటర్న్ కొట్టకపోతే అరెస్ట్ చేస్తామంటూ బెదిరించారు. తక్షణమే బ్యాంక్ ఖాతా వివరాలన్నీ చెప్పండి చెక్ చేస్తాం.. లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుందంటూ బెదిరించారు.
వారి మాటలకు భయపడి బ్యాంక్ ఖాతా వివరాలు చెప్పడంతో రూ.కోటి 43 లక్షల వరకు తస్కరించారు. దీంతో ఆ వృద్ధుడు అప్రమత్తమై సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే సైబర్ నేరగాళ్ల బ్యాంక్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారు. నిందితులను అరెస్ట్ చేసి, బాధితుడు పోగొట్టుకున్న నగదును రికవరీ చేశారు.
94 కేసుల్లో రూ.93.74 లక్షలు ఫ్రీజ్
జిల్లాలో జూలై 1 నుంచి నేటి వరకు 94 సైబర్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ఇప్పటివరకు రూ.93,78,304 మొత్తాన్ని ఫ్రీజ్ చేశారు. అలాగే రూ.15,45,234 మొత్తాన్ని 17 కేసుల్లో బాధితులకు తిరిగి చెల్లించారు.
జిల్లాలో గత ఆరేళ్లుగాసైబర్ కేసుల వివరాలు
» 2021లో 128
» 2022లో 217
» 2023లో 310
» 2024 జూన్ వరకు 201
» 2024 జూన్ నుంచి నేటి వరకు 94 కేసులు