
సాక్షి, తూర్పుగోదావరి/ఎన్టీఆర్ జిల్లా: రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి వాయిదా కోసం విజయవాడ తీసుకువెళ్లి తిరిగి తీసుకువస్తుండగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ సోమవారం రాత్రి 7.30గంటలకు దేవరపల్లి మండల దుద్దుకూరు వద్ద పోలీసుల నుంచి తప్పించుకుని పరారయ్యాడు. దొంగతనం కేసులో నిందితుడు అయిన ఇతను పారిపోయినప్పుడు ఒక చేతికి హ్యాండ్ కప్స్, వైట్ కలర్ టీ షర్ట్, బ్లాక్ కలర్ ట్రాక్ ప్యాంటు ధరించి ఉన్నాడని దేవరపల్లి ఇన్‌స్పెక్టర్ తెలిపారు.పై
ముద్దాయి ఆచూకీ ఎవరికైనా తెలిస్తే 94407 96584 (ఇన్‌స్పెక్టర్ దేవరపల్లి), 94407 96624 (సబ్ ఇన్‌స్పెక్టర్ దేవరపల్లి) ఫోన్ నంబర్లకు తెలియజేయాలని కోరారు. ముద్దాయి ఆచూకీ లేదా సమాచారం తెలిపిన వారికి తగిన పారితోషికం ఇస్తామని తెలిపారు. బత్తుల ప్రభాకర్ కోసం 10 పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆసుపత్రులు, విద్యాసంస్థలే టార్గెట్‌గా చోరీలకు పాల్పడిన నిందితుడి ప్రభాకర్‌పై తెలుగు రాష్ట్రాల్లో 42, తమిళనాడు, కర్ణాటక, కేరళలో 44 కేసులు నమోదయ్యాయి.
గత ఫిబ్రవరిలో గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో పోలీసులపై ప్రభాకర్ కాల్పులు జరిపాడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ పరారీపై ఎన్టీఆర్ జిల్లా సీపీ సీరియస్ అయ్యారు. విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్‌కి తీసుకొని వెళ్తున్న క్రమంలో దుద్దుకురు వద్ద పోలీసుల కళ్లు గప్పి బత్తుల ప్రభాకర్ పరారయ్యాడు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన ఇద్దరు ఏ. ఆర్ హెడ్ కానిస్టేబుళ్లపై వేటు పడింది. సుగుణకరరావు, షడ్రక్‌లను సస్పెండ్ చేస్తూ సీపీ రాజశేఖర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు.