
గాయత్రి (ఫైల్), పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు బాజీ
ఎన్టీఆర్ జిల్లా: కన్న తండ్రే కాలయముడయ్యాడు. తనను గంజాయి కేసులో పట్టించిందని కక్ష పెంచుకున్నాడు. జైలు నుంచి విడుదలవగానే కూతురును కొట్టి చంపాడు. శవాన్ని మూటగట్టి కాల్వలో పడేసి పరారయ్యాడు. ఈ విషాదకర ఘటన మైలవరంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మైలవరానికి చెందిన చిందే బాజీకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య నాగమ్మకు ఐదుగురు కూతుళ్లు.
రెండో భార్య నాగేంద్రమ్మకు ఒక కూతురు, కుమారుడు. అయితే ఇద్దరి భార్యలను మైలవరంలో వేరు వేరు ఇళ్లలో ఉంచి కాపురం చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండో భార్య నాగేంద్రమ్మతో కలిసి గంజాయి విక్రయిస్తున్న బాజీ గత మే నెలలో పోలీసులకు పట్టుబడ్డాడు. వీరిద్దరికీ కోర్టు జైలు శిక్ష విధించింది. దీంతో రెండో భార్య నాగేంద్రమ్మ ఎనిమిదో తరగతి చదువుతున్న తన కూతురు గాయత్రి(13), కుమారుడిని జి.కొండూరు మండల పరిధిలోని విద్యానగరంలో ఉంటున్న తన అక్క స్వప్న వద్ద వదిలి వెళ్లింది. బాజీ మొదటి భార్య నాగమ్మ తన భర్త ఒక్కడినే బెయిల్‌పై విడిపించడంతో గత జూలైలో జైలు నుంచి బాజీ విడుదలయ్యాడు.
ఆ కోపంతోనే..
గాయత్రి గతంలో జి.కొండూరు మండలం కుంటముక్కలకు చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ క్రమంలో ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఈ విషయమై బాజీ అతని రెండో భార్య నాగేంద్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆచూకీ గుర్తించి వారిద్దరినీ తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన గాయత్రి తన తండ్రి బాజీ నుంచి తనకు ప్రాణహాని ఉందని భావించి ప్రేమించిన యువకుడితో కలిసి గంజాయి విక్రయ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందించింది. కూతురు వల్లే తాను, తన భార్య జైలు కెళ్లామని బాజీ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో జైలు నుంచి రాగానే తన రెండో భార్య అక్క వద్ద ఉన్న గాయత్రిని రెండు నెలల క్రితం తన ఇంటికి తీసుకొచ్చి హింసించసాగాడు.
ఈ నేపథ్యంలో గత నెల 31వ తేదీ సాయంత్రం ఇనుప రాడ్డుతో తీవ్రంగా కొట్టడంతో గాయత్రి మృతి చెందింది. ఆ తర్వాత శవాన్ని మూటకట్టి అద్దెకు తీసుకున్న ట్రక్కు ఆటోలో వేసుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ తతంగమంతా కళ్లారా చూసిన మొదటి భార్య నాగమ్మ, ఆమె కూతుళ్లు శవాన్ని తీసుకెళ్లిన తర్వాత రక్తపు మరకలు లేకుండా శుభ్రం చేసి, బ్లీచింగ్ చల్లి, ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.
ఈ విషయం బయటకు పొక్కడంతో మైలవరం పోలీసులు గాయత్రి పెద్దమ్మ స్వప్నని పిలిపించి ఈ నెల 2వ తేదీన ఫిర్యాదు తీసుకుని విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బాజీ పోలీసులకు భద్రాచలం ఏరియాలో రెండు రోజుల క్రితం పట్టుబడ్డాడు. విచారణలో తన కూతురు గాయత్రిని తానే చంపినట్లు ఒప్పుకున్నట్లు తెలు స్తోంది. శవాన్ని ఖమ్మం జిల్లా మధిర శివారులో కాల్వలో పడేసినట్లు చెప్పడంతో పోలీసులు డ్రోన్‌ల సాయంతో ఆ దిశగా గాలింపు చేపట్టారు. అయితే గాయత్రి ఆచూకీ ఇంతవరకు లభించలేదు.