ఎన్టీఆర్ జిల్లా: వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయనపాడు సమీపంలో శుక్రవారం జరిగింది. గ్రామ సమీంలోని వ్యవసాయ పొలాల్లో కాలిన గాయాలతో మహిళను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు బాధితురాలిని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ జ్యోతి మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
మృతురాలు కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సాతుపాటి సాయికుమార్ భార్య సాతుపాటి జ్యోతి (20) గా గుర్తించారు. భార్య భర్తల మధ్య ఇటీవల మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో భార్య కాలిన గాయాలతో మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిందా లేక హత్యా ప్రయత్నం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి తండ్రి మేడా సాంబయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలికి ఐదేళ్ల కుమార్తె, రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నారు.


