
విశాఖపట్నం జిల్లా: తల్లిదండ్రులు ఐ ఫోన్ కొనలేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుజాతనగర్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. సుజాతనగర్‌లో నివాసం ఉంటున్న చంద్రశేఖర్ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్నాడు. అతని కుమారుడు సాయి మారుతి కెవిన్(26) కొంతకాలం హైదరాబాద్‌లో సినిమా పరిశ్రమలో పనిచేసి ఇటీవలే ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో తనకు ఐ ఫోన్ కావాలని తండ్రిని సాయి అడుగుతున్నాడు.
ఆదివారం కూడా ఈ విషయంపై తండ్రీ కొడుకుల మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అనంతరం తన గదిలోకి వెళ్లిన కెవిన్ సాయంత్రమైనా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపును బలవంతంగా తెరడంతో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. హతాశులైన తల్లిదండ్రులు అతడ్ని కిందకు దించినా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కెవిన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సీఐ కేవీ సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ స్వామినాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు.