
పోలీసులను కారుతో ఢీకొట్టి తప్పించుకునేందుకు ప్రయత్నం
కానిస్టేబుల్‌కు గాయాలు.. పోలీసుల కాల్పులు
కారు వదిలి పారిపోతున్న స్మగ్లర్‌ను పట్టుకున్న పోలీసులు
22 కిలోల గంజాయి, కారు స్వాదీనం
నెల్లూరులో సినీఫక్కీలో ఘటన
నెల్లూరు (క్రైమ్): సినీఫక్కీలో ఓ గంజాయి స్మగ్లర్ తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులను కారుతో ఢీకొట్టి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. పోలీసులు కాల్పులు జరపడంతో కారు వదిలి పరుగుతీశాడు. పోలీసులు వెంబడించి అతడ్ని పట్టుకున్నారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున నెల్లూరులో జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం ప్రాంతం నుంచి ఓ వ్యక్తి కారులో 22 కిలోల గంజాయిని నెల్లూరులోని విక్రేతలకు సరఫరా చేసేందుకు తీసుకొస్తున్నాడని సమాచారం అందడంతో బాలాజీనగర్ పోలీస్‌స్టేషన్ సీఐ కె.సాంబశివరావు తన సిబ్బంది, ఈగల్ టీమ్ కానిస్టేబుల్ ఫిరోజ్‌తో కలిసి జాతీయ రహదారిపై కాపు కాశారు.
గంజాయి తీసుకొస్తున్న కారును గుర్తించి పెన్నా బ్రిడ్జి అవతలి వైపు నుంచి వెంబడించారు. నిందితుడు నగరంలోని ఎస్వీజీఎస్ కళాశాల వద్ద యూటర్న్ తీసుకుని అక్కడ ఉన్న ఇద్దరికి గంజాయి ఇచ్చేందుకు కారును స్లో చేశాడు. ఒక్కసారిగా పోలీసులు కారును చుట్టుముట్టగా, గంజాయి తీసుకునేందుకు వచి్చన వ్యక్తులు పారిపోయారు. గంజాయి స్మగ్లర్ తప్పించుకునేందుకు కారును పోలీసులపైకి దూకించి దూసుకువెళ్లాడు. దీంతో ఈగల్ టీమ్ కానిస్టేబుల్ ఫిరోజ్‌కు గాయాలయ్యాయి.
బాలాజీనగర్ ఇన్‌స్పెక్టర్ సాంబశివరావు ఆ కారును వెంబడిస్తూ రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. కారు అద్దాలు పగిలిపోయాయి. స్మగ్లర్ ఎన్‌టీఆర్ నగర్‌లోకి వెళ్లి అక్కడ కారును వదిలి పారిపోతుండగా, పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. అతడ్ని బాలాజీనగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితుడిని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన బీరక ప్రకాష్ అలియాస్ సూర్యప్రకాష్ గా గుర్తించారు. అతని నుంచి కారు, 22 కిలోల గంజాయి స్వాదీనం చేసుకున్నారు. గాయపడిన కానిస్టేబుల్‌ను జీజీహెచ్‌లో చేర్పించారు.
నిందితుడిపై ఇప్పటికే పలు కేసులు
నిందితుడు బీరక ప్రకాష్ కారు డ్రైవర్‌గా పని చేస్తుంటాడని, చాలా ఏళ్లుగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని వివిధ ప్రాంతాల్లోని విక్రేతలకు సరఫరా చేస్తుంటాడని పోలీసుల విచారణలో తేలింది. అతనిపై నెల్లూరు సంతపేట, తూర్పు గోదావరి జిల్లా రంగంపేట, ఏలూరు జిల్లా జీలుగుమిల్లి, ఏలూరు ఎస్‌ఈబీ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని, పలుమార్లు జైలుకు వెళ్లివచ్చాడని గుర్తించారు.
ప్రస్తుతం నెల్లూరులో జాకీరాబీ అనే విక్రేతకు గంజాయి సరఫరా చేసేందుకు వచ్చినట్లు తేలింది. ఈగల్ విభాగం ఐజీ రవికృష్ణ నెల్లూరుకు వచ్చి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌తో కలిసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ ఫిరోజ్‌ను పరామర్శించారు. అనంతరం ఘటనాస్థలాన్ని, నిందితుడు ఉపయోగించిన కారును పరిశీలించారు.