
బాల కార్మికుడికి చిత్రహింసలు
వైన్ షాపు యజమాని, సిబ్బంది కలసి ఓ బాల కార్మికుడిని చిత్రహింసలకు గురిచేశారని కార్మిక శాఖాధికారులకు గురువారం ఫిర్యాదు అందింది.
గదిలో నిర్బంధించి బ్రాందీ షాపు యజమాని దాడి
కార్మిక శాఖాధికారులకు ఫిర్యాదు
విజయవాడ: వైన్ షాపు యజమాని, సిబ్బంది కలసి ఓ బాల కార్మికుడిని చిత్రహింసలకు గురిచేశారని కార్మిక శాఖాధికారులకు గురువారం ఫిర్యాదు అందింది. అధికారుల కథనం మేరకు.. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గోసాలలోని లక్ష్మీ వైన్స్‌లో అదే గ్రామానికి చెందిన వల్లెపు బుజ్జిబాబు(13) నాలుగు నెలల క్రితం బార్ బాయ్‌గా చేరాడు. నాలుగు రోజుల క్రితం షాపులో రూ.50 వేల సొమ్ము మాయమైంది. ఆ డబ్బును బుజ్జిబాబు అపహరించాడని షాపు యజమాని కోలా కోటేశ్వరరావు, సిబ్బంది కలసి బాలుడిని ఓ గదిలో నిర్బంధించి తీవ్రంగా గాయపరిచినట్లు బాధితుడు చెప్పాడన్నారు. ఆ తర్వాత బ్రాందీ షాపు క్యాషియర్ కల్యాణ్ బుధవారం రాత్రి పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో డబ్బు మాయంపై ఫిర్యాదు చేశారని, బాలుడి వద్ద డబ్బు దొరక్కపోవడంతో పోలీసులు అతడ్ని వదిలేసినట్టు అధికారులు వివరించారు. బుజ్జిబాబు ఇచ్చిన ఫిర్యాదుపై విజయవాడలో కార్మిక శాఖాధికారులు షాపు యజమానిపై కేసు నమోదు చేశారు. బాలుడితో మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇప్పించారు. గాయాలకు గురైన అతడికి విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వైద్యపరీక్షలు జరిపించారు. కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ సూర్యనారాయణ పర్యవేక్షణలో అసిస్టెంట్ కమిషనర్ ఆంజనేయరెడ్డి, ఉయ్యూరు కార్మికశాఖ సహాయ అధికారి కనకమహాలక్ష్మి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రెండు నెలల జీతం కూడా ఇవ్వలేదు
కాగా, తన భర్త సత్తెరాజు వికలాంగుడు కావటంతో కుటుంబ పోషణ కోసం పిల్లాడిని బ్రాందీ షాపులో చేర్చామని అతడి తల్లి వివరించింది. నెలకు రూ.2 వేలు జీతం ఇస్తామని నాలుగు నెలలు పనిచేయించుకున్నారని, యజమాని రెండు నెలల జీతం ఎగ్గొట్టాడని, పైగా చేయని నేరాన్ని బిడ్డపై మోపి హింసించారని ఆమె వాపోయింది. బ్రాందీ షాపు యజమాని నుంచి తన బిడ్డకు రక్షణ కల్పించాలని కోరింది.