
205 లీటర్ల మద్యం స్వాధీనం.. శ్రీకాకుళం జిల్లా అవలింగిలో తయారీ
పాతపట్నం: శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం అవలింగిలో వైన్‌షాపు సమీపంలోని ఓ ఇంట్లో 205 లీటర్ల నకిలీ మద్యం, 172 ఖాళీ మద్యం బాటిళ్లు, ప్రింటింగ్ మెషిన్‌ను ఎక్సైజ్ పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్‌రెడ్డి బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. అవలింగిలోని వైన్‌షాపును జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ పి.మురళీధర్, సీఐ కె.కృష్ణారావు బుధవారం తనిఖీ చేశారు.
ఆ సమయంలో పలాస మండలం కోసంగిపురం గ్రామానికి చెందిన తంగుడు మణికంఠ, కోటబొమ్మాళి గ్రామానికి చెందిన సదునుపల్లి సుందరరావు వాటర్ బాటిళ్లలో మద్యం అమ్ముతున్నట్టు గుర్తించారు. అనుమానం వచ్చి పరిశీలించగా 8 నకిలీ మద్యం బాటిళ్లు, అనుమానాస్పదంగా ఉన్న మరో 172 మద్యం బాటిళ్లను గుర్తించారు. ఇవెక్కడివని ప్రశ్నింంచగా సకలాభక్తుల నీలకంఠం, పిట్టా పైడిరాజు, షాపు నౌకనామాదారుడు కలిసి విక్రయించమన్నారని తెలిపారు.
అనంతరం షాపునకు 100 మీటర్ల దూరంలో ఓ ఇంట్లో తనిఖీ చేయగా నకిలీ మద్యం బాటిళ్లు, తేదీ, బ్యాచ్ నంబర్లు తయారు చేసే ప్రింటింగ్ మెషిన్, ఖాళీ మద్యం బాటిళ్లు, మూతలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తంగుడు మణికంఠ, సదునుపల్లి సుందరరావులను అరెస్ట్ చేశారు. నీలకంఠం, పైడిరాజు పరారీలో ఉన్నారు. వీరందరిపైనా కేసులు నమోదు చేశామని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.