
కోడి కూర తిందామంటే దాని ధర కొండెక్కి కూర్చుంది. మేక మాంసం సాధారణ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది. చేపల ధర కూడా అమాంతం పెరిగిపోయింది. దీంతో మాంసం ప్రియులకుభారం తప్పడం లేదు.
సాక్షి, విశాఖపట్నం: చికెన్ ధర కొండెక్కింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ప్రస్తుతం కిలో రూ.210కి ఎగబాకింది. ఇటీవల చికెన్ ఇంతగా పెరగడం ఇదే ప్రథమం. ఈ ఏడాది ఇప్పటివరకు కిలో (స్కిన్‌లెస్) రూ.200కు మించలేదు. వేసవిలో ఎండతీవ్రతకు కోళ్లు నిపోతుండడం, బరువు తగ్గడం, ఉత్పత్తి వ్యయం పెరగడం వంటివి ఈ పరిస్థితికి కారణమని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కొన్నాళ్లుగా ఎండలు విజృంభిస్తున్నాయి. దీంతో కోడి బరువు సగటున అరకిలో వరకు తగ్గిపోతోంది. ఏప్రిల్ వరకు ఒక్కో కోడి బరువు 2.3 నుంచి 2.5 కిలోలుండేది. ఇప్పుడది 1.9 కిలోలకు పడిపోయింది. మరోవైపు కోడి పిల్ల రేటు కూడా రూ.42కు చేరుకుంది. అలాగే కోడి మేత రేటు కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇవన్నీ వెరసి ఒక కోడి మార్కెట్‌లోకి రావడానికి రూ.90 ఖర్చవుతోంది. ఇలా ఉత్పత్తి వ్యయం తడిసి మోపెడవడం వల్ల ప్రస్తుతం చికెన్ ధర పెరగడానికి కారణమవుతోందని బ్రాయిలర్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ విశాఖ (బ్యాగ్) అధ్యక్షుడు తాట్రాజు ఆదినారాయణ ‘సాక్షి’కి చెప్పారు. ‘రాష్ట్రవ్యాప్తంగా చికెన్ ధరలు రూ.5 అటుఇటుగా ఇవే ఉన్నాయి. జూన్ 15 వరకు ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉంది’ అని బ్రాయిలర్ కోళ్ల పెంపకందార్లు చెబుతున్నారు. జిల్లాలో, నగరంలో నెలకు 38–40 లక్షల కోళ్లు వినియోగమవుతున్నాయి. కొద్దిరోజులుగా చికెన్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈనెల 1న కిలో చికెన్ రూ.190, 10న 200 ఉండగా ఆదివారం అది రూ.210కి చేరుకుంది.
చేపలదీ అదే దారి..
ఒక పక్క కోడి మాంసం ధర కొండెక్కడంతో చేపల ధరలూ ఎగబాకుతున్నాయి. కొన్నాళ్ల క్రితం వరకు కిలో రూ.110–120 ఉండే బొచ్చు/శీలావతి/జడ్డువా వంటి రకాల చెరువు చేపలు రూ.10 నుంచి 20 వరకు పెరిగాయి. సముద్రం చేపల ధరలూ అదే దారిలో పయనిస్తున్నాయి. చికెన్ ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని చేపల అమ్మకందార్లూ పెంచుతున్నారు. మరోవైపు మటన్ (మేకమాంసం) కూడా కిలో రూ. 600 నుంచి 650 వరకు పెరిగింది. ఇలా అనూహ్యంగా పెరుగుతున్న చికెన్, మటన్, చేపల ధరలతో మాంసం ప్రియులు లొట్టలేసుకుని తినడానికి బదులు నిట్టూరుస్తున్నారు.