పోస్టింగులను తొలగించాల్సిందిగా పోలీసులకు విజ్ఙప్తి

Chevireddy Bhaskar Reddy Responds About Comments Chiranjeevi In Social Media - Sakshi

సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, చిరంజీవి భేటిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పేరిటి ప్రచారంలోకి వచ్చిన ఫేస్‌బుక్‌ పోస్ట్‌ దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పోస్ట్‌పై స్పందించారు చెవిరెడ్డి. మెగాస్టార్ చిరంజీవితో తనకు ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. చిరంజీవిపై తన అభిమాన సంఘం పేరిట సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ అవుతున్న వార్తల్ని చెవిరెడ్డి తీవ్రంగా ఖండించారు. తిరుపతిలో శనివారం మీడియాతో మాట్లాడిన చెవిరెడ్డి... తన అభిమాన సంఘం పేరిట సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టింగులకూ తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనకు ట్విట్టర్‌ అక్కౌంట్లు కాని, ఫేస్‌బుక్‌ అక్కౌంట్లుగాని లేవని తెలిపారు.

తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (తుడా) ఛైర్మన్‌గా ఉన్న రోజుల్లో చిరంజీవి ఎమ్మెల్యేగా ఉండేవారని గుర్తుచేశారు చెవిరెడ్డి. అప్పటినుంచి ఆయనతో తనకు సత్సంబంధాలే ఉన్నాయన్నారు. జగన్, చిరంజీవి మధ్య సంత్సబంధాలు ఉండకూడదన్న క్షుద్ర ఆలోచనలతో తెలుగుదేశం పార్టీయే ఈ దుష్ప్రచారం చేస్తుందని చెవిరెడ్డి ఆరోపించారు. తనకు ఎలాంటి అభిమాన సంఘాలు లేవన్నారు చెవిరెడ్డి. అభిమాన సంఘాలు అంటూ ఉంటే.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉంటాయన్నారు. తాను కూడా జగనన్న అభిమానియే అన్నారు. తన అభిమాన సంఘం పేరుమీద చలామణి అవుతున్న పోస్టింగుల్ని తక్షణం తొలగించాల్సిందిగా పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top