తిరుమల నడకదారిలో మళ్లీ చిరుతపులి | Cheeta attacks boy in Tirumala steps route | Sakshi
Sakshi News home page

తిరుమల నడకదారిలో మళ్లీ చిరుతపులి

Sep 3 2013 1:33 PM | Updated on Jul 30 2018 1:23 PM

తిరుమల నడకదారిలో మళ్లీ చిరుతపులి - Sakshi

తిరుమల నడకదారిలో మళ్లీ చిరుతపులి

తిరుమల నడకదారుల్లో చిరుతపులుల దాడులు మళ్లీ మొదలయ్యాయి. సోమవారం మరో బాలుడు చిరుతపులి దాడికి గురయ్యాడు.

తిరుమల నడకదారుల్లో చిరుతపులుల దాడులు మళ్లీ మొదలయ్యాయి. దాడి ఘటనల్లో ఇప్పటికే ముగ్గురు  గాయపడగా, తాజాగా సోమవారం మరో బాలుడు చిరుతపులి దాడికి గురయ్యాడు. తాజా పరిణామాలతో  కాలినడకన వచ్చే భక్తులు వణికిపోతున్నారు. ఆహారం పుష్కలంగా లభిస్తుండడంతో  శేషాచలం కొండల్లో చిరుత పులుల సంతతి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. అలిపిరి నుంచి తిరుమలకు నడిచి వచ్చే మార్గాల్లో చిరుతపులి భక్తులపై మూడుసార్లు దాడి చేసింది.  

2010 జూలై 24న ఏడాది వయసున్న కోకిల, అ దే నెల  31వ తేదీన ఏడేళ్ల కల్యాణిపై దాడి చేసి గాయపరిచాయి. అలాగే, 2012 జూన్ 19వ తేదీన గాలిగోపురం దుకాణంలో నిద్రిస్తున్న అమర్‌నాథ్(35)పై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. కాలినడకన వచ్చే చిన్నారులపై చిరుత పులులు దాడి చేయడంతో టీటీడీ అప్రమత్తమైంది. 2010లో ఆగస్టు 1వ తేదీ జింకల పార్కు మలుపుల వద్ద రెండు బోన్లు ఏర్పాటు చే సింది. గతనెల 7వ తేదీన ఓ మగ చిరుతపులిని, 25న 34వ మలుపు వద్ద మరో  చిరుతపులిని సజీవంగా బోనులో బంధించారు.

శేషాచల పరిధిలో 30 చిరుత పులులు
తూర్పున కడప జిల్లా నుంచి పశ్చిమాన తలకోన వరకు విస్తరించిన శేషాచల అడవుల పరిధిలో దాదాపుగా  మొత్తం 30 చిరుత పులులు సంచరిస్తున్నాయి. శ్రీ వేంకటేశ్వర అభయారణ్యం పరిధిలో 5, మామండూరు రేంజ్ పరిధిలో మరో మూడు సంచరిస్తున్నాయి. తరచు రెండో ఘాట్‌ రోడ్డులోని వినాయక స్వామి ఆలయం వద్ద జూ పార్క్‌కు వెళ్లే దారిలో, హరిణి విశ్రాంతి సముదాయం వద్ద, తిరుమల దివ్యారామం వద్ద చిరుతలు కనిపిస్తున్నాయి. తిరుపతికి వచ్చే మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడో మైలు, గాలిగోపురం, మోకాళ్ల పర్వతం సమీప ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. పది రోజుల ముందు మోకాళ్ల పర్వతం సమీపంలోని కనుమ రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ చిరుత పిల్ల మృతి చెందింది.  భక్తులు అప్రమత్తంగా ఉండటం తప్ప మరో మార్గం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే, భక్తుల కోసం రాత్రి వేళల్లో గస్తీ మరింత పెంచుతామన్నారు.

ఐదుగంటల వరకే అనుమతి?
శ్రీవారి దర్శనానికి నడకమార్గంలో వచ్చే భక్తులు గుంపులు గుంపులుగా  రావాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో కాలిబాట భక్తులను ఇప్పటికే సాయంత్రం 6 గంటలకే నిలిపి వేస్తున్నారు. తాజా ఘటనతో సాయంత్రం 5 గంటలకే ఈ మార్గాన్ని మూసివేయాలని యోచిస్తున్నారు. భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement