మంత్రి తమ్ముడి కోసం మా పొట్టకొడతారా? | Change transport scheme Paritala Sunitha Brother | Sakshi
Sakshi News home page

మంత్రి తమ్ముడి కోసం మా పొట్టకొడతారా?

Jul 20 2014 1:17 AM | Updated on Sep 2 2017 10:33 AM

మంత్రి తమ్ముడి కోసం మా పొట్టకొడతారా?

మంత్రి తమ్ముడి కోసం మా పొట్టకొడతారా?

ఇప్పటి వరకూ నడుస్తున్న వ్యవస్థను కాదని మంత్రి తమ్ముడి కోసం రవాణా విధానాన్నే మారిస్తే చూస్తూ ఊరుకోబోమని సివిల్ సప్లై హమాలీలు హెచ్చరించారు.

విజయనగరం కంటోన్మెంట్: ఇప్పటి వరకూ నడుస్తున్న వ్యవస్థను కాదని మంత్రి తమ్ముడి కోసం రవాణా విధానాన్నే మారిస్తే చూస్తూ ఊరుకోబోమని సివిల్ సప్లై హమాలీలు హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్ ఎదురుగా ఏపీ సివిల్ సప్లై హమాలీ ముఠా వర్కర్స్ యూనియన్ ధర్నా చేపట్టింది. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి కామేశ్వరరావు మాట్లాడుతూ లారీల యజమాని అయిన పౌరసరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత తమ్ముడికి కాంట్రాక్టు అప్పగించేందుకు   స్టేజ్-2లో ఉన్న కాంట్రాక్టు వ్యవస్థను స్టేజ్-1కు మార్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని ఆరోపించారు.
 
 పస్తుతం  ఎఫ్‌సీఐ నుంచి సివిల్ సప్లైకు సరుకులు వస్తున్నాయనీ అక్కడి నుంచి హమాలీలు ఎంఎల్‌ఎస్ పాయింట్లకు, రేషన్ షాపులకు సరుకులను పోర్టింగ్ చేస్తున్నారన్నారు. ఈ విధానాన్ని  స్టేజ్-1కు మాత్రమే పరిమితం చేస్తే ఎఫ్‌సీఐ నుంచే నేరుగా సరుకులు వెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హమాలీలు రోడ్డున పడతారన్నారు. జిల్లాలోని 350 మంది హమాలీలు కూలిపని లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఎఫ్‌సీఐ నుంచి నేరుగా రేషన్ షాపులకు నిత్యావసరాల సరుకులు సరఫరా చేసే స్టేజ్-1 కాంట్రాక్టును పౌరసరఫరాల శాఖ మంత్రి సునీత తమ్ముడికి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ ఆలోచనను విరమించుకోవాలని లేకుంటే పోరాటం తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు.
 
 జిల్లాలో 14 ఎంఎల్‌ఎస్ పాయింట్లున్నాయనీ దీని ద్వారా ప్రతీనెలా గత 30 ఏళ్లుగా హమాలీలు ఎగుమతి, దిగుమతి పనులు చేస్తున్నారన్నారు. సివిల్‌సప్లై శాఖ ద్వారా ప్రతీ రెండేళ్లకోసారి ఏఐటీయూసీ కార్మికసంఘం ఒత్తిడితో కూలీ రేట్లు పెంపుదల చేస్తున్నారన్నారు. జనశ్రీ ద్వారా ప్రమాద బీమా, పీఎఫ్, ఈఎస్‌ఐ, దసరాబోనస్‌లు, దహన సంస్కార ఖర్చుల వంటి హక్కులు సాధించుకున్నామన్నారు. ఈ సారి కూడా కూలి రేట్ల పెంపుదల మొదలైన హక్కులను సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా అగ్రిమెంటు పొందినా ఇప్పటికీ అమలు చేయలేదన్నారు.
 
 జిల్లాలో విజయనగరం, తెర్లాంలలో మాత్రమే సొంత గోదాములున్నాయనీ మిగిలిన 12 చోట్ల గోదాములు సొంతంగా శాఖాపరంగా నిర్మిస్తే సరుకులకు రక్షణ ఉంటుందన్నారు. అనంతరం డీఆర్వో హేమసుందర్, ఇన్‌ఛార్జి డీఎం రెడ్డిలకు వినతిపత్రాలను అందించారు. కార్యక్రమంలో ముఠా వర్కర్ల యూనియన్ అధ్యక్ష, కార్యర్శులు జి నారాయణ స్వామి, పి కామేశ్వరరావు, ఉప ప్రధాన కార్యదర్శి బుగత సూరిబాబు, నరసింహులు, గోపి, గోవింద తదితరులతో పాటు వందలాది మంది హమాలీ వర్కర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement