
చంద్రబాబు నాయుడు (ఫైల్ ఫోటో)
సాక్షి, ప్రకాశం : సీఎం చంద్రబాబు నాయుడు చీరాల పర్యటనకు స్కూల్ బస్సులన్నీ తరలించడంతో విద్యార్ధులకు పాఠశాల యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. చంద్రబాబు మంగళవారం దూబగుంట్ల గ్రామం వద్ద ట్రిపుల్ ఐటీ కళాశాల భూమిపూజ కార్యక్రమానికి వస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలను భారీ ఎత్తున తరలించేందుకు ప్రైవేటు పాఠశాలల బస్సులను తరలిస్తున్నారు. దీంతో విద్యార్థులకు అనధికారికంగా సెలవు ప్రకటించారు. సీఎం పర్యటన కారణంగా పాఠశాలలకు సెలవు ఇవ్వడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
జిల్లాలో ఎక్కువ భాగం నారాయణ, శ్రీచైతన్య యాజమాన్యలకు సంబంధించిన పాఠశాలలే ఉన్నందున అనధికారికంగా సెలవు ప్రకటించారు. మధ్యాహ్నం 12.30కు సీఎం రామన్నపేట హెలిప్యాడ్‌కు చేరుకుని పందిళ్లపల్లి గ్రామంలో చేనేతలతో ముచ్చటించి ఎంపీపీ స్కూలులో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సెయింటాన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బహిరంగసభ జరుగుతుంది.