కేసు క్లైమాక్స్‌కు

కేసు క్లైమాక్స్‌కు


ఆ టేపులన్నీ అసలైనవే.. స్టీఫెన్‌సన్‌తో మాట్లాడింది చంద్రబాబే!

ఏసీబీ కోర్టుకు ప్రాథమిక నివేదిక అందించిన ఎఫ్‌ఎస్‌ఎల్

ఆ ఆడియో టేపులేవీ ట్యాపింగ్ రికార్డులు కావు..  

ఒక ఫోన్ నుంచి వచ్చిన కాల్‌ను మరో ఫోన్‌లో రికార్డు చేశారు

వీడియోలూ సరైనవేనని నివేదికలో స్పష్టం చేసినట్లు సమాచారం

నేడు ఈ నివేదికను అధికారికంగా తీసుకోనున్న ఏసీబీ అధికారులు

ఆ వెంటనే నోటీసుల ప్రక్రియ షురూ..  నేడో, రేపో చంద్రబాబుకు నోటీసులు

మత్తయ్య క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

రేవంత్ బెయిల్ కేసులో రేపు అదనపు కౌంటర్ దాఖలు చేయనున్న ఏసీబీ


 

సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసు క్లైమాక్స్‌కు చేరింది. ఈ వ్యవహారానికి సూత్రధారి తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడేనని తేటతెల్లమైంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడింది చంద్రబాబేనని ఫోరెన్సిక్ ల్యాబ్ తన ప్రాథమిక నివేదికలో ధ్రువీకరించినట్లు తెలిసింది. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు అది ఎక్కడెక్కడి నుంచో తెచ్చి అతికించినది కాదని... చంద్రబాబు స్టీఫెన్‌సన్ మధ్య నడిచిన ఫోన్ సంభాషణ ‘ఒరిజినల్’ అని ఫోరెన్సిక్ స్పష్టం చేసినట్లు సమాచారం. బాబు మాట్లాడిన ఆడియో రికార్డు ట్యాపింగ్ వెర్షన్ కాదని.. అది ఒక ఫోన్ నుంచి మరో ఫోన్‌కు వచ్చిన కాల్‌ను రికార్డు చేసిన టేపు అని ధ్రువీకరించినట్లు తెలిసింది.

 

 ఈ మేరకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) బుధవారం సాయంత్రం అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానానికి తమ ప్రాథమిక నివేదికను అందజేసింది. ఈ నివేదికను ప్రత్యేక కోర్టు నుంచి ఏసీబీ గురువారం అధికారికంగా తీసుకోనుంది. ఆ నివేదిక అందిన మరుక్షణమే ఏసీబీ రంగంలోకి దిగి.. ‘ఓటుకు కోట్లు’ కేసు సూత్రధారిగా భావిస్తున్న చంద్రబాబుకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ‘‘గురువారం రాత్రి లేదా శుక్రవారం బాబుకు నోటీసులు జారీ చేస్తాం. నోటీసు అందుకున్న నాటి నుంచి వారం రోజుల్లో ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. ఇదే కేసులో మరో ఐదుగురికి నోటీసులు జారీ చేసి వారిని 72 గంటల్లో విచారణకు హాజరు కావాలని కోరబోతున్నాం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినందువల్ల ఆయన బిజీ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని వారం రోజులు గడువు ఇవ్వాలని భావిస్తున్నాం..’’ అని ఏసీబీ వర్గాలు బుధవారం రాత్రి వెల్లడించాయి. చంద్రబాబు కంటే ముందే టీడీపీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు మాజీ ఎంపీలను విచారించనున్నట్లు తెలిపాయి.

 

 వెలుగులోకి వచ్చి 25 రోజులు

 నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో రూ.5కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని, రూ.50లక్షలు అడ్వాన్సుగా ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి రహస్యంగా చిత్రీకరించిన వీడియోలు, స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు నేరుగా సాగించిన బేరసారాల ఆడియో రికార్డులు బహిర్గతమయ్యాయి కూడా. రేవంత్ ఏసీబీకి పట్టుబడి దాదాపు 25 రోజులు కావస్తోంది.‘బాస్’ సూచనల మేరకే వచ్చానని రేవంత్ పదేపదే స్టీఫెన్‌సన్‌తో చెప్పడం, రూ.50లక్షల సొమ్ము ఇవ్వజూపడం, చంద్రబాబు స్టీఫెన్‌సన్‌తో నేరుగా ఫోన్‌లో మాట్లాడడం వంటివాటన్నింటిపై ఏసీబీ లోతుగా దర్యాప్తు చేసి.. ఈ వ్యవహారంలో పక్కా ఆధారాలను సంపాదించింది. తాజాగా స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడింది చంద్రబాబే అని నిర్ధారణ కావడంతో ‘ఓటుకు కోట్లు’ కేసు దాదాపుగా ‘క్లైమాక్స్’కు చేరింది. ఈ కేసులో కీలకపాత్ర పోషించిన రేవంత్, ఆయనకు సహకరించిన ముగ్గురిలో ఇద్దరు ఇప్పటికే జైలులో ఉన్నారు.

 

 నాలుగో నిందితుడు మత్తయ్య విజయవాడలో పోలీసుల సంరక్షణలో ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ హైకోర్టులో మత్తయ్య దాఖలు చేసిన పిటిషన్ గురువారం విచారణకు రానుంది. హైకోర్టులో మత్తయ్య తరఫున వాదిస్తున్న సుప్రీంకోర్టు న్యాయవాదికి లక్షల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మరి ఈ ఖర్చులు ఎవరు భరిస్తున్నారనేది తెలుసుకునేందుకు తెలుసుకునేందుకు ఏసీబీ ప్రయత్నిస్తోంది. ఇక రేవంత్ బెయిల్ కేసుకు సంబంధించి శుక్రవారం హైకోర్టులో ఏసీబీ అధికారులు అదనపు కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఇందులో అనేక సంచలన విషయాలు ఉండవచ్చని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.

 

 ఫోరెన్సిక్ నివేదిక కూడా..

 నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం నుంచి గురువారం తీసుకోనున్న ఫోరెన్సిక్ నివేదికను కూడా ఏసీబీ తన అదనపు కౌంటర్‌తో జోడించనున్నది. స్టీఫెన్‌సన్‌తో రేవంత్‌రెడ్డి, చంద్రబాబు సాగించిన సంభాషణలకు సంబంధించిన ఈ నివేదికలో అంశాల ఆధారంగా తాము చేపట్టదలచిన దర్యాప్తు వివరాలను ఏసీబీ హైకోర్టుకు నివేదించనుంది.

 

 ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు..

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నించిన తీరును హైకోర్టులో దాఖలు చేయబోయే కౌంటర్‌లో ఏసీబీ ఆధారాలతో సహా పేర్కొననున్నట్లు సమాచారం. దాదాపు పాతిక మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే లక్ష్యంతో ఆపరేషన్ సాగిన వైనాన్ని శుక్రవారం నాటి కౌంటర్‌లో నివేదించనుంది. చంద్రబాబు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఓ కేంద్ర మంత్రి, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఒక లోక్‌సభ మాజీ సభ్యుడు, ఇద్దరు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఈ ఆపరేషన్‌లో కీలకపాత్ర పోషించిన దానిపై ఏసీబీ ఇప్పటికే తగిన ఆధారాలను సిద్ధం చేసుకుంది. రేవంత్‌తో పాటు మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు దాదాపు రూ.2 కోట్లు సమకూర్చిన ఇద్దరు రాజ్యసభ సభ్యులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని హైకోర్టుకు ఏసీబీ నివేదించనున్నది. ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించిన ఎమ్మెల్యే వెంకట వీరయ్య ఏపీ ప్రభుత్వ సహకారంతో ఆ రాష్ట్రంలో తలదాచుకున్న సంగతిని కూడా వివరించనుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top