కుప్పానికి వరాలేవీ | Chandrababu naidu Janmabhoomi Fail In Kuppam | Sakshi
Sakshi News home page

కుప్పానికి వరాలేవీ

Jan 3 2019 9:32 AM | Updated on Jan 3 2019 9:32 AM

Chandrababu naidu Janmabhoomi Fail In Kuppam - Sakshi

జ్యోతి ప్రజ్వలన చేసి జన్మభూమి సభను ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబు

చిత్తూరు, సాక్షి: కుప్పంలో గురువారం నిర్వహించిన జన్మభూమి సభ ఎన్నికల ప్రచార సభను తలపించింది. సీఎం చంద్రబాబు మాటిమాటికీ తనను ఆశీర్వదించాలని వేడుకున్నారు. ఉదయం 10.30 గంటలకు రావాల్సిన సీఎం చంద్రబాబు గంటన్నర ఆలస్యంగా కుప్పం చేరుకున్నారు. పర్యటన ఆద్యంతం ఆలస్యంగా నడిచింది. సమయాభావం వల్ల కొన్ని కార్యక్రమాలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. సభ కోసం జిల్లా నలుమూలల నుంచి తరలించిన మహిళలు ఇబ్బందులకు గురయ్యారు. సభ 1.30 ప్రారంభమైంది. 3 గంటల వరకు సాగింది. 11 గంటలకే మహిళలను సభాప్రాంగణంలోకి తరలించడంతో ఆకలితో అలమటించారు.

చివరి సభలోనూ నిరాశే..
సీఎంగా చంద్రబాబు నిర్వహించే చివరి సభ ఇదే అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతోసొంత నియోజకవర్గానికి పెద్ద ఎత్తున వరాలు ప్రకటిస్తారని ప్రజలు ఆశించారు. ఎలాంటి వరాలజల్లు కురిపించకపోవడంతో నిరాశకు గురయ్యారు. కుప్పం పట్టణ ప్రధాన రహదారి విస్తరణపై కనీస ప్రకటన కూడా చేకపోవడాన్ని తప్పు పడుతున్నారు. రూ.1 కోటితో నిర్మించిన నూతన పీహెచ్‌సీ భవనాలను ప్రారంభిస్తారని ఆశించినా భంగపాటు ఎదురైంది. మోడల్‌ కాలనీలో ఎన్టీయార్‌ గృహ ప్రవేశానికి హాజరవుతారని అనుకున్నా..చివరి నిమిషంలో సీఎం మనసు మార్చుకోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. డబ్బు కట్టి సంవత్సరాలు గడుస్తున్నా... అధికారులు ఇళ్లు అప్పగించలేదని లబ్ధిదారులు సాక్షితో వాపోయారు. ఆ పంచాయతీ పరిధిలో వైఎస్సార్‌సీపీ జెండాలు అధికంగా కనపడటంతోనే అధికారులు సీఎం కార్యక్రమాన్ని తొలగించారని తెలుస్తోంది. డిగ్రీ కళాశాల భవనాలు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా రాత్రి 7 గంటలకు సీఎం అక్కడికి చేరుకున్నారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. సీఎం వచ్చే వరకు విద్యార్థులకు అధికారులు కనీసం భోజన ఏర్పాట్లు కూడా చేయలేదు.

వడ్డెపల్లిలో వైస్సార్‌సీపీ జెండాల తొలగింపు..
వడ్డెపల్లిలో గురువారం విలేజ్‌ వాక్‌ తూతూ మంత్రంగా నిర్వహించారు. ఆ గ్రామంలో ఉన్న వైఎస్సార్‌సీపీ జెండాలన్నీ తొలగించారు. అధికారులు వేడుకోవడంతో ప్రజలు సహకరించారు. అప్పటికీ కొన్ని ఇళ్లపై వైఎస్సార్‌సీపీ జెండాలు కనపడటంతో సీఎం అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జన్మభూమి సభలో వడ్డెపల్లిని 8 స్టార్‌ గ్రామంగా అభివర్ణించడంపై స్థానికులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత నాలుగు నెలల నుంచి గ్రామంలో తాగేందుకు నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని.. రాత్రికి రాత్రి కుళాయిలు నిర్మించి గొప్పలు చెప్పుకుంటున్నారని అక్కడి ప్రజలు అన్నారు. ఫైబర్‌ గ్రిడ్‌ అనే పదమే గ్రామంలో తెలీదన్నారు. కానీ సీఎం మాత్రం వడ్డెపల్లి గ్రామాన్ని ఫైబర్‌ గ్రిడ్‌ పల్లెగా చెప్పుకున్నారు.

500 బస్సులతో తరలింపు..
జన్మభూమి సభ కోసం జిల్లా నలుమూలల నుంచి ప్రజలను తరలించారు. వారికి కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. పర్యటన ఆలస్యం అవడంతో తాగేందుకు మంచి నీళ్లను కూడా అధికారులు ఇవ్వలేదని వాపోయారు. స్కూళ్లకు సెలవులు ఇచ్చి విద్యార్థులను కూడా సభకు రప్చించారు.కుప్పం– పర్చూరు రోడ్డులోని రూ.1880 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన ఆర్‌వోబీని, రూ.105 లక్షలతో నిర్మించిన కడా కార్యాలయాన్ని ప్రారంభించారు. రూ.5.8 కోట్లతో మిట్టపల్లిలో మంజలమడుగు చెక్‌ డ్యాంకు శంకు స్థాపన చేశారు. రూ.20 కోట్లతో వెనుకబడిన తర గతుల  గురుకుల పాఠశాల, కళాశాలకు శంకుస్థాపన చేశారు. దీంతో పాటు రూ.512 కోట్ల ఆస్తులు, పనిముట్లు పంపిణీ చేశారు. అంతకుముందు కుప్పం ఇంజనీరింగ్‌ కళాశాల వద్ద సీఎంకు పలువురు టీడీపీ నాయకులు, అధికారులు స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement