ప్రజల మధ్య చిచ్చుకు చంద్రబాబు కుట్ర

Chandrababu conspiracy between the people - Sakshi

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య ఆగ్రహం 

కుట్రలు చేసి ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారు 

ప్రజాధనం వాడుకుని టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్సులా?  

గవర్నర్, ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి    

సాక్షి, హైదరాబాద్‌: సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజల్లో సెంటిమెంట్‌ను రేకెత్తించి, తెలంగాణ–ఆంధ్రా ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేసి, ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సి.రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉభయ రాష్ట్రాల ప్రజల మధ్య ఉన్న సయోధ్యను చెడగొట్టాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. రామచంద్రయ్య గురువారం హైదరాబాద్‌లో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీలోని కులవివక్షను భరించలేక ఆ పార్టీని వీడినట్లు అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్రబాబు, ఆమంచి కృష్ణమోహన్‌ తదితరులు చెబుతుండగా, కేసీఆర్‌ బెదిరింపులకే వారు అలా చేశారని చంద్రబాబు మాట్లాడటంలో ఏమైనా అర్థం ఉందా? అని ప్రశ్నించారు. అసలు ఆస్తులకు, కేసీఆర్‌కు సంబంధం ఏమిటని నిలదీశారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌లో పదేళ్లు ఉండే హక్కు మనకుండగా, ఒక్క ఏడాదికే చంద్రబాబు ఎందుకు పారిపోయారు? కేసీఆర్‌ బెదిరించినందుకే పారిపోయారా? అని ఎద్దేవా చేశారు. ఏ భయంతో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి టీడీపీలో చేరుతున్నారు? కిశోర్‌చంద్రదేవ్‌ను ఎవరు బెదిరించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

చంద్రబాబు చిట్టా చాలా ఉంది 
‘‘వైఎస్‌ జగన్‌ను సినీ నటుడు నాగార్జున కలిస్తే దాన్ని కూడా రాజకీయం చేయడం ఏమిటి? చంద్రబాబు ఎన్ని కేసుల్లో నేరస్థుడు? ఎన్ని కేసుల్లో స్టేలు తెచ్చుకోలేదో చెప్పాలి. చంద్రబాబు చిట్టా విప్పితే చాలా ఉంది.  దళితులను దూషించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి. పారిశ్రామికవేత్తలకు వైఎస్సార్‌సీపీ టికెట్లు ఇస్తున్నారని టీడీపీ నేతలు దుష్ప్రచారం చేశారు. దాసరి జైరమేష్‌ టీడీపీకి ఎంత సాయం చేశారనే విషయం చంద్రబాబు మర్చిపోయారా?  సుజనాచౌదరి, రాయపాటి సాంబశివరావు, కేశినేని నాని, గల్లా జయదేవ్, మురళీమోహన్‌ వీళ్లంతా పారిశ్రామికవేత్తలు కాదా? అని ప్రశ్నించారు.  చంద్రబాబు తన అధికార నివాసం నుంచి టీడీపీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ పనులు నిర్వహించుకోవడానికి పార్టీ కార్యాలయం లేదా? ప్రభుత్వ సొమ్ముతో పార్టీ వాళ్లతో టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. ఈ విషయంలో గవర్నర్, ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి’’ అని సి.రామచంద్రయ్య డిమాండ్‌ చేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top