సమీక్షలు చేస్తా..  అడ్డుకోవద్దు

Chandrababu 9 pages letter to the Central Election Commission - Sakshi

కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు 9 పేజీల లేఖ  

ముఖ్యమంత్రిగా సమీక్షలు చేసే హక్కు నాకుంది  

దాన్ని అడ్డుకునే అధికారం ఈసీకి లేదు  

రాజధాని, పోలవరంపై సమీక్షించాల్సిందే  

అడ్డుకోవద్దని గోపాలకృష్ణ ద్వివేదికి సూచించండి

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా సమీక్షలు చేసే హక్కు తనకు ఉందని, దాన్ని కాదనే హక్కు ఎన్నికల సంఘానికి లేదని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తాను చేసే సమీక్షలను అడ్డుకోవద్దంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి సూచించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు చంద్రబాబు శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్‌ కమిషనర్‌కు తొమ్మిది పేజీల లేఖ రాశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది తీరును ఆ లేఖలో తప్పుపట్టారు. ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించరాదంటూ ద్వివేది చేసిన వ్యాఖ్యలు ఆయన పరిధికి మించి ఉన్నాయని చంద్రబాబు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించకపోతే పనుల వ్యయం పెరిగిపోతోందని, ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం కారణం అవుతుందని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే రాజధానిలో జరుగుతున్న పనులను సమీక్షించాలని, లేకపోతే పలు ప్రాజెక్టుల వ్యయం పెరిగిపోతుందని వెల్లడించారు.  

నన్ను నిలువరించడం వివక్ష కాదా?  
‘ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వం నిర్వహించాల్సిన విధులను అడ్డుకోవడం కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ఎవరికీ సాధ్యం కాదు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తోంది. సెక్యూరిటీ అంశాలపై కేంద్ర కేబినెట్‌ సమీక్షిస్తోంది. తెలంగాణ సీఎం పలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ, సమీక్షలు నిర్వహించరాదంటూ నన్ను మాత్రమే నిలువరించడం వివక్ష కాదా? రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయినందున సాధారణ పరిపాలనను కొనసాగించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా నాపై ఉంది. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ను సీఎంకు రిపోర్ట్‌ చేయవద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది అడ్డుకున్నారు, ఆయనకు ఆ హక్కు ఎక్కడిది?  ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ముఖ్యమంత్రి కిందే పనిచేస్తారు.

మంచినీటి సరఫరాతో పాటు విపత్తులకు సంబంధించిన అంశాలపైనా సమీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఎన్నికలు పూర్తయినందున సమీక్షలు ఆపేందుకు, అధికారులు బ్రీఫింగ్‌ ఇవ్వకుండా ఆంక్షలు విధించేందుకు ఎన్నికల సంఘానికి అధికారం లేదు. రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది కలగకుండా, రాష్ట్రాభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపకుండా ప్రజాస్వామ్య పాలన కొనసాగేలా సీఎం సమీక్షలకు అవరోధాలు, అంతరాయం కలిగించవద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి, సంబంధిత ఇతర అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి’ అని చంద్రబాబు తన లేఖలో విజ్ఞప్తి చేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top