
తెలంగాణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత
తెలంగాణ బిల్లు అంశానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత అని టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్:తెలంగాణ బిల్లు అంశానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత అని టీడీపీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు అభిప్రాయపడ్డారు. బిల్లును అసెంబ్లీ చర్చించినట్లు భావించి పార్లమెంట్ లో ప్రవేశపెట్టమని కేంద్రాన్ని కోరుతామని ఆయన తెలిపారు. టి.బిల్లుపై మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో భేటీకీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు హాజరైయ్యారు. స్పీకర్ కు కిరణ్ ఇచ్చిన నోటీసుపై ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం మోత్కుపల్లి మాట్లాడుతూ,, అసెంబ్లీకి బిల్లు వస్తే సపోర్ట్ చేస్తానన్న సీఎం.. ఇప్పుడు స్పీకర్ కు నోటీసు పంపడం బాధాకరమన్నారు.
సీమాంధ్ర ప్రజల అవసరాలు తెలియజేయాలే గాని..బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేయకూడదన్నారు. ఈ పరిణమాలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. బిల్లును అసెంబ్లీలో చర్చించనట్లు భావించి పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని ఆయన తెలిపారు. పార్టీలకతీతంగా తెలంగాణ ప్రజా ప్రతినిధులంతా ముందుకెళుతున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.