చీపురుతో చిమ్మితే కంకర తేలుతోంది! | CC Road Damage in 20 Days After Renovation | Sakshi
Sakshi News home page

చీపురుతో చిమ్మితే కంకర తేలుతోంది!

Dec 17 2018 11:34 AM | Updated on Dec 17 2018 11:34 AM

CC Road Damage in 20 Days After Renovation - Sakshi

లింగాల ఎస్సీకాలనీ కొత్తగా నిర్మించిన సీసీరోడ్డు

కర్నూలు, కోవెలకుంట్ల: అధికారపార్టీ నాయకుల అవినీతికి అడ్డూ అదుపులేకుండా పోతోంది. పది కాలాల పాటు పదిలంగా ఉండాల్సిన సీసీరోడ్ల నిర్మాణాల్లో   అక్రమాలకు పాల్పడ్డారు. చీపురుతో చిమ్మితే కంకర తేలుతుండటంతో రోడ్లు ఎంత నాణ్యతతో నిర్మించారో తెలుస్తోంది. కోవెలకుంట్ల మండలం లింగాల గ్రామంలో రూ.61 లక్షలతో నిర్మించిన సీసీరోడ్లు ప్రారంభించిన ఇరవై రోజులకే కంకర తేలి అధ్వానంగా మారాయి. గ్రామంలోని ఓసీ కాలనీలో రూ.30.10 లక్షలు, ఎస్సీ, బీసీ కాలనీల్లో రూ.30.90 లక్షలతో  మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ, ఎస్‌డీఎఫ్‌ నిధులతో ఇటీవల సీసీరోడ్లు, డ్రైనేజీ ఏర్పాటు చేశారు. నిర్మాణ సమయంలో తగినపాళ్లలో సిమెంట్‌ కలుపకుండా అధిక భాగం ఇసుక, కంకరతో రోడ్ల నిర్మాణం చేపట్టడంతో రోడ్లు వేసిన కొన్ని రోజులకే దెబ్బతిని కంకర బయట పడింది.

గత నెల 24వ తేదీ బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఈ రోడ్లకు ప్రారంభో త్సవం చేశారు. సీసీరోడ్లపై ఉదయం, సాయంత్రం వేళల్లో ఆయా కాలనీల్లో ఇళ్ల ముందు చీపురుతో ఊడ్చితే  కంకర చిప్స్‌ వస్తున్నాయని స్థానిక మహిళలు వాపోతున్నారు. రోడ్లపై కంకర బయటపడటంతో రోడ్లపై చెప్పులు లేకుండా నడిచేందుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కంకర పాదాల్లో గుచ్చుకుంటుండటంతో రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు.  ఎస్సీ, ఓసీ కాలనీల్లో రోడ్ల నిర్మాణాలను మధ్యలో వదిలేయడంతో పారిశుద్ధ్యం లోపించి దుర్వాసన వస్తోందని కాలనీవాసులు  చెబుతున్నారు. సీసీరోడ్ల ప్రారంభోత్సవంలో శిలాఫలకాలు, డ్రమ్స్, డప్పులు, తదితర హంగు, ఆర్భాటాలకు కావాల్సిన మొత్తాన్ని రోడ్ల నిర్మాణానికి కేటాయించిన నిధుల్లో కోత పెట్టాల్సి వస్తోందని అధికారపార్టీకి చెందిన ఓ నాయకుడు తెలిపారు.  

బిల్లులు నిలుపుదల: గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో సీసీరోడ్ల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదన్న విషయం మా దృష్టికి వచ్చింది. దెబ్బతిన్న రోడ్డు స్థానంలో తిరిగి రోడ్డువేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేశాం.  మరమ్మతులు చేసేవరకు ఫైనల్‌ బిల్లు లు చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టాం.    – నజీర్‌ అహమ్మద్, పంచాయతీరాజ్‌ ఏఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement