సీబీఐ దాడి..జీఎస్టీ అధికారి అరెస్ట్‌ 

CBI Rides On Tanuku Central Excise And GST Office In West Godavari - Sakshi

తణుకుపై సీబీ‘ఐ’ తరచూ దాడులు 

గతంలో కేంద్రప్రభుత్వ ఉద్యోగిపై దాడి

ఇటీవల కోడిగుడ్లు వ్యాపారి కార్యాలయంలో సోదాలు

సాక్షి, తణుకు(పశ్చిమ గోదావరి): సీబీఐ.. ఈ పదం తణుకు పట్టణంలో కలకలం రేపుతోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ అధికారులను హడలెత్తిస్తోంది. గతంలో సీబీఐ అధికారులు తణుకు పట్టణంలోని పలువురు అధికారులతోపాటు వ్యాపారుల ఇళ్లల్లో సోదాలు చేసిన ఘటనలు మరువక ముందే తాజాగా సెంట్రల్‌ ఎక్సైజ్‌ అండ్‌ జీఎస్టీ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కారుమూరి కల్యాణ్‌చక్రవర్తి లంచం తీసుకుంటూ పట్టుబడటం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. జీఎస్టీ రద్దు చేయడానికి ఒక వ్యాపారి నుంచి రూ.2 వేలు డిమాండ్‌ చేసిన ఘటనలో సీబీఐ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా కల్యాణ్‌ చక్రవర్తిని పట్టుకుని అరెస్టు చేయడం కలకలం రేపింది. మరోవైపు గతంలో ఉత్తరప్రదేశ్‌ ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ (వెస్ట్‌ మీరట్‌)గా పని చేసిన ఐఎఫ్‌ఎస్‌ మాజీ అధికారి ముత్యాల రాంప్రసాదరావు వ్యవహారంలోనూ సీబీఐ  అధికారులు పెద్దఎత్తున సోదాలు నిర్వహించారు.

తణుకు పట్టణానికి చెందిన రాంప్రసాదరావు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై రెండేళ్ల క్రితం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు ఆయన భార్య ఆకుల కనకదుర్గపైనా కేసులు నమోదు చేశారు. తదనంతరం గతేడాది మార్చిలో రాంప్రసాదరావు అక్రమాస్తుల వ్యవహారంలో అస్తులు  విక్రయించిన వారితోపాటు సాక్షులుగా వ్యవహరించిన, బినామీలుగా ఉన్న వ్యక్తులకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. అప్పట్లో తణుకు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు సీబీఐ నోటీసులు అదుకున్నారు. ఈ వ్యవహారం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. 

కోడిగుడ్ల వ్యాపారిపైనా..?
తణుకు పట్టణానికి చెందిన కోడిగుడ్లు ఎగుమతి చేసే ఒక వ్యాపారిపైనా సీబీఐ అధికారులు గతంలోనే కేసు నమోదు చేశారు. పట్టణంలోని ఒక బ్యాంకులో రుణం తీసుకుని తిరిగి చెల్లించకపోవడంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు ఆయనకు చెందిన కొన్ని ఆస్తులనూ ఎటాచ్‌ చేసుకున్నారు. తణుకు పట్టణంలోని వేల్పూరు రోడ్డు, సజ్జాపురం ప్రాంతాల్లో ఈయనకు చెందిన పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల మరోసారి తణుకు వచ్చిన సీబీఐ అధికారులు ఇక్కడే తిష్ట వేసి సంబంధిత కోడిగుడ్ల వ్యాపారికి చెందిన ఆర్థిక లావాదేవీలపై కూపీ లాగినట్లు తెలుస్తోంది. గతంలో ఇతనికి సహకరించిన వారితోపాటు బినామీలుగా వ్యవహరించిన వ్యక్తుల కదలికలపై దృష్టి సారించిన అధికారులు మరోసారి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి ఐపీ ప్రకటించిన వ్యాపారికి స్థానికంగా కొందరు ఉద్యోగులు సహకారం అందించినట్లు విశ్వసనీయ సమాచారం.

గతం నుంచి వ్యాపారులకు వేధింపులు 
తరచూ సీబీఐ అధికారులు తణుకు పట్టణంపై దృష్టి సారిస్తుండటంతో స్థానికంగా కలకలం రేగుతోంది. గత రెండేళ్లుగా సీబీఐ అధికారులు తణుకులో అటు ప్రభుత్వ అదికారులు, ఇటు పలువురు రియల్‌ ఎస్టేట్, ఇతర వ్యాపారులపై దృష్టి సారించారు. తాజాగా తణుకు సెంట్రల్‌ ఎక్సైజ్‌ అండ్‌ జీఎస్టీ కార్యాలయంలో సూపరింటెండెంటుగా పని చేస్తున్న కల్యాణ్‌చక్రవర్తి సీబీఐ అధికారులకు చిక్కడం

చర్చనీయాంశంగా మారింది. 
గతం నుంచి ఆయన పలువురు వ్యాపారులను మామూళ్లు పేరుతో వేధిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో రూ. లక్షల్లోనే లంచాలు డిమాండ్‌ చేసిన సదరు అధికారి కేవలం రూ.2 వేలు లంచం డిమాండ్‌ చేసి సీబీఐ అధికారులకు దొరికిపోయారు. తాడేపల్లిగూడెం నుంచి వచ్చి వెళ్లే కల్యాణ్‌చక్రవర్తి బాధితులు పెద్ద సంఖ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు స్థానిక కార్యాలయంలో సుదీర్ఘంగా విచారించిన సీబీఐ అధికారులు ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తాడేపల్లిగూడెంలోని ఆయన నివాసంలోనూ తనిఖీలు చేయడం కొసమెరుపు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top