తల్లకిందులుగా దేశం తపస్సు | Cause a reversible loss of penance country | Sakshi
Sakshi News home page

తల్లకిందులుగా దేశం తపస్సు

Mar 18 2015 4:21 AM | Updated on Sep 2 2017 10:59 PM

కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది.

 సాక్షి ప్రతినిధి, గుంటూరు : కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏఎస్ రామకృష్ణ గెలుపు కోసం ఆ పార్టీ నేతలు తల్లకిందులుగా తపస్సు చేస్తున్నారు. ఫలితాలు వ్యతిరేకంగా వస్తే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీపై ప్రభావం చూపే ప్రమాదం ఉండటం తోఅభ్యర్థి గెలుపు బాధ్యతను ముఖ్యనేతలు తమ భుజాన వేసుకున్నారు. కొందరు శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఆధ్వర్యంలో ప్రచారంలో పాల్గొంటున్నారు.
 
 మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జిల్లాలో ఉన్న సమయంలో పార్టీ నేతలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడక కాదన్న సమాచారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందడంతో ఆయన మూడుసార్లు హైదరాబాద్‌లో జిల్లానేతలతో సమీక్షించారు. ఎట్టిపరిస్థితుల్లో అభ్యర్థి గెలవాలని, అందుకు అనువుగా నేతలు శ్రమించాలని హెచ్చరించారు. దీంతో పార్టీనేతలంతా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి అభ్యర్థి గెలుపునకు దోహదపడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఉపాధ్యాయ సంఘాలకు అవసరమైన   నిధులు సమకూర్చడంతోపాటు వారి అసోసియేషన్ కార్యాలయాల భవన నిర్మాణాలు, ఇతర సమస్యల పరిష్కారానికి హామీలు గుప్పిస్తున్నారు. కొన్ని చోట్ల పరోక్షంగా బెదిరింపులకు దిగుతున్నారు. ప్రత్యర్థి అభ్యర్థి గెలిస్తే సమస్యల పరిష్కారానికి తమ వద్దకే రావాల్సి ఉంటుందని, దీనిపై ఉపాధ్యాయులు ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నరసరావుపేట ఎంపీ రాాయపాటి సాంబశివరావు, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి ప్రస్తుతం జరుగుతున్న చట్ట సభలకు హాజరుకాకుండా జిల్లాలో ప్రచారం కొనసాగిస్తున్నారు. మూడోసారి పోటీ చేస్తున్న ప్రస్తుత ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు ఉపాధ్యాయ సంఘాల సహకారంతో ముందుకు దూసుకుపోతున్నారు.

నిర్ధిష్ట ప్రణాళికతో హడావుడి లేకుండా ప్రచారం చేసుకుంటున్నారు. గతంలో తాను చేసిన సేవలను పరిగణనలోకి తీసుకోవాలని, ఉపాధ్యాయులకు నిత్యం అందుబాటులో ఉంటానని చెబుతున్నారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో తన కృషిని ఒకసారి మననం చేసుకుని ఓటు హక్కు వినియోగి ంచాలని ఉపాధ్యాయులను కోరుతున్నారు. లక్ష్మణరావు గెలుపు బాధ్యతలను యుటిఎఫ్  పూర్తిగా తీసుకోగా, సీపీఎం, ఎస్‌ఎఫ్‌ఐలు ప్రత్యక్షంగా, మరికొన్ని పార్టీలు పరోక్షంగా ఆయనకు సహకరిస్తున్నాయి.

ఆయన ఇప్పటికే రెండు జిల్లాల్లో ఓ విడత ప్రచారాన్ని పూర్తిచేశారు. ఎక్కువ మంది ఉపాధ్యాయులను వ్యక్తిగతంగా కలిసి గెలుపునకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విజయవాడ మాజీ మేయరు, మాజీ ఉపాధ్యాయిని తాడి శకుంతల ఆలస్యంగా ఎన్నికల బరిలోకి దిగినా అన్ని వర్గాల ఓటర్లను కలుస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు బలపరిచిన అభ్యర్థిగా ఆమె ఎన్నికల బరిలో ప్రచారం కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement