
పల్నాడు జిల్లా కండ్లకుంట యువకుడిని అక్రమంగా నిర్బంధించి చావబాదిన పోలీసులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అభిమాని కావడం, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చిత్రాన్ని వాట్సాప్ డీపీగా పెట్టుకోవడమే ఆ యువకుడు చేసిన పాపం. రెడ్‌బుక్ సేవలో తరిస్తున్న పల్నాడు జిల్లా పోలీసులకు అది ఆగ్రహం తెప్పించింది. అంతే.. ఆ యువకుడిని పోలీస్‌స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించారు. వెల్దుర్తి ఎస్‌ఐ షమందర్ వలీ, ట్రైనీ ఎస్‌ఐ రాంబాబు గౌడ్, కానిస్టేబుల్ వెంకటనాయక్ కలిసి విచక్షణారహితంగా చావబాదారు.
కాలు విరిగేలా కొట్టారు. తీవ్ర గాయాల పాలైన బాధితుడు దీన్ని డీజీపీ, జిల్లా ఎస్పీ దృష్టికి తేవడంతో మరింత రెచ్చిపోయిన వెల్దుర్తి పోలీసులు బెదిరింపులకు దిగారు. దీన్ని భరించలేక బాధితుడు పొనుగంటి నాగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. తనను కస్టడీలో తీవ్రంగా హింసించిన పోలీసులపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించడంతో పాటు బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా డీజీపీ, ఎస్పీలను ఆదేశించాలని అభ్యర్థిస్తూ అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు ఈ నెల 12వతేదీ నుంచి 14 వరకు వెల్దుర్తి పోలీస్ స్టేషన్‌లోని సీసీ టీవీ ఫుటేజీని భద్రపరచాలని ఎస్‌హెచ్‌వోను ఆదేశించింది. పిటిషనర్ వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకుని చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
45 నిమిషాల పాటు చిత్రహింసలు..!
అంతకుముందు పిటిషనర్ తరఫు న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు. ‘వెల్దుర్తి పోలీస్‌స్టేషన్ ట్రైనీ ఎస్‌ఐ రాంబాబు గౌడ్ ఈనెల 12వ తేదీ ఉదయం 9 గంటలకు పిటిషనర్ నాగిరెడ్డిని ఇంటి నుంచి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎందుకు తీసుకొచ్చారో కూడా చెప్పలేదు. సాయంత్రం 4 గంటల నుంచి దాదాపు 45 నిమిషాల పాటు నాగిరెడ్డిని ట్రైనీ ఎస్‌ఐ రాంబాబు, ఎస్‌ఐ వలీ, కానిస్టేబుల్ నాయక్ కలిసి కర్రలు, బెల్టుతో చావబాదారు. కాళ్లు, చేతులు మెలిబెట్టి అదే పనిగా కొట్టారు.
రాత్రి 11 గంటల వరకు నాగిరెడ్డిని స్టేషన్‌లో కూర్చోబెట్టిన పోలీసులు రూ.15 వేలు డిమాండ్ చేసి తీసుకున్నారు. నాగిరెడ్డి ప్రభుత్వాసుపత్రికి వెళ్లగా కాలు విరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం మళ్లీ స్టేషన్‌కు రప్పించి కూర్చోబెట్టారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తరువాత పిటిషనర్ నాగిరెడ్డి తల్లిదండ్రులను కూడా పోలీసులు బెదిరించారు.
ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. బాధితుడి వినతి పత్రాన్ని పరిగణనలోకి తీసుకునేలా డీజీపీని ఆదేశించాలి’ అని రామలక్ష్మణరెడ్డి హైకోర్టును అభ్యర్థించారు. పోలీసుల తరఫున హోంశాఖ న్యాయవాది ఏ.జయంతి వాదనలు వినిపిస్తూ నాగిరెడ్డి బైక్‌పై నుంచి పడి కాలు విరగ్గొట్టుకున్నారని, ఇందులో పోలీసులకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
ఫుటేజీ భద్రపరచడానికి ఏం ఇబ్బంది?
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, సీసీటీవీ ఫుటేజీ భద్రపరచడానికి ఇబ్బంది ఏముంటుందని ప్రశి్నంచారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సీసీ టీవీ ఉండి తీరాలని గుర్తు చేశారు. వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు సీసీటీవీ ఫుటేజీని తగిన అధికారికి అందించేందుకు వీలుగా భద్రపరచాలని ఎస్‌హెచ్‌వోను ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.