న్యూఢిల్లీ: తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. తమిళనాడులో దళపతి విజయ్ (టీవీకే), పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అగ్రనేత సువేందు అధికారి.. ఇద్దరూ చెరో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఘన విజయం సాధించారు. అయితే ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం 14 రోజుల్లో వీరు ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉండటంతో, ఏ సీటును అంటిపెట్టుకోనున్నారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. వీరి భవిష్యత్ వ్యూహాలపై ఆసక్తికర సమాచారం బయటకు వచ్చింది.
సువేందు సంచలనం.. సీఎం రేసులో..
పశ్చిమ బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీని భవానీపూర్ నియోజకవర్గంలో ఏకంగా 15,105 ఓట్ల భారీ తేడాతో ఓడించి సువేందు అధికారి చరిత్ర సృష్టించారు. అదేవిధంగా నందిగ్రామ్‌లోనూ 9,665 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. అయితే, ఆయన భవానీపూర్‌ను వదులుకుని, తన సొంత జిల్లా తూర్పు మేదినీపూర్‌లోని నందిగ్రామ్ స్థానాన్నే అంటిపెట్టుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మమతను రెండుసార్లు ఓడించిన ఘనత దక్కించుకోవడంతో ఆయన తదుపరి సీఎం రేసులో ముందున్నారు. మే 9న జరగనున్న ప్రమాణస్వీకారానికి పరిశీలకునిగా అమిత్ షా వ్యవహరించనున్నారు.
చెన్నైకే విజయ్ ఓటు.. పెరంబూర్ ఫిక్స్
తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్.. పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ రెండు చోట్లా ఘన విజయం సాధించారు. డీఎంకే అభ్యర్థి ఆర్‌డి శేఖర్‌పై పెరంబూర్‌లో 53,715 ఓట్ల మెజారిటీతో నెగ్గగా, తిరుచిరాపల్లిలో 27,416 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే విజయ్ తన సొంత ప్రాంతమైన చెన్నైలోని పెరంబూర్ స్థానాన్ని అంటిపెట్టుకుని, తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బైపోల్స్ కోసం దళపతి మాస్టర్ స్ట్రోక్
మధ్య, దక్షిణ తమిళనాడులో పార్టీ ప్రభావాన్ని విస్తరించాలనే వ్యూహంతోనే విజయ్ తొలుత తిరుచిరాపల్లి నుంచి పోటీ చేశారు. ఇప్పుడు ఆ స్థానానికి రాజీనామా చేయాల్సి వస్తుండటంతో, త్వరలో జరిగే ఉపఎన్నికలో అక్కడ మాజీ ఐఏఎస్ అధికారి యు సహాయంను బరిలోకి దించే అవకాశాన్ని టీవీకే అధిష్టానం పరిశీలిస్తోంది. టీవీకే ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది కొత్తవారు కావడంతో పరిపాలనా అనుభవం కోసం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై తుది నిర్ణయం విజయ్‌దేనని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ‘కమల’ వ్యూహం: బెంగాల్ రిపీట్.. పంజాబ్ డిలీట్!


