పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన చరిత్రాత్మక విజయంతో ఉత్సాహంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఏమాత్రం సమయం వృథా చేయకుండా తన తదుపరి లక్ష్యాన్ని ఖరారు చేసేసింది. బెంగాల్‌లో గెలుపు సంబరాలు ముగియక ముందే, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పాలిత రాష్ట్రమైన పంజాబ్ పై గురిపెట్టింది. సోషల్ మీడియాలో ఆ పార్టీ చేసిన ఒక్క పోస్ట్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తూ, రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సమర శంఖారావాన్ని పూరించింది.
సంచలనంగా మారిన ‘నెక్స్ట్ పంజాబ్’
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి, అఖండ విజయం సాధించిన కొన్ని గంటల వ్యవధిలోనే బీజేపీ తన తదుపరి కార్యాచరణను ప్రపంచానికి ప్రకటించింది. మైక్రోబ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’ వేదికగా బీజేపీ పంజాబ్ శాఖ ‘నెక్స్ట్ పంజాబ్’ (తదుపరి పంజాబ్) అని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌కు కమల పుష్పం ఎమోజీని కూడా జతచేసింది. వచ్చే ఏడాది మొదటి భాగంలో పంజాబ్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ఈ పోస్ట్ చేసినట్లు స్పష్టమవుతోంది.
గత వ్యూహమే మళ్లీ అమలు..
ఈ తరహా సంచలన ప్రకటన బీజేపీకి కొత్తేమీ కాదు. గత ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అద్భుత విజయం సాధించిన తర్వాత, నవంబర్ 14, 2025న బీజేపీ బెంగాల్ శాఖ కూడా అచ్చం ఇలాగే ట్వీట్ చేసింది. ఆనాడు ‘నెక్స్ట్ వెస్ట్ బెంగాల్’ అంటూ కమలం గుర్తుతో పోస్ట్ చేసి, అనంతరం బెంగాల్ ను కైవసం చేసుకుంది. అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ, వ్యూహాత్మకంగా ఇప్పుడు పంజాబ్ వైపు అడుగులు వేస్తోంది.
యూపీ, పంజాబ్‌లపై బీజేపీ పూర్తి ఫోకస్
ఇటీవల జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తున్న బీజేపీ, అదే జోరును భవిష్యత్తులోనూ కొనసాగించాలని పట్టుదలగా ఉంది. పశ్చిమ బెంగాల్‌లో సాధించిన అద్భుత విజయంతో ఉత్సాహంలో ఉన్న కమలనాథులు, వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటికే తమ పూర్తి దృష్టిని కేంద్రీకరించారు. ఈ రాష్ట్రాల్లో గెలుపే ధ్యేయంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు.
అధికార ఆప్‌కు కోలుకోలేని భారీ దెబ్బ
పంజాబ్‌లో అధికారంలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ ఏడాది ఏప్రిల్ లో ఊహించని భారీ షాక్ తగిలింది. ఆప్‌కు చెందిన ఏడుగురు కీలక రాజ్యసభ సభ్యులు అనూహ్యంగా ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఈ ఏడుగురిలో రాఘవ్ చద్దా సహా ఆరుగురు ఎంపీలు పంజాబ్ నుంచే ఎన్నికైన వారు కావడం గమనార్హం. ఈ పరిణామం పంజాబ్ రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపుగా, ఆప్‌కు కోలుకోలేని రాజకీయ దెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.
పంజాబ్‌లో రసవత్తర పోరు ఖాయం
ఆప్ రాజ్యసభ సభ్యుల వలసతో పంజాబ్‌లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ అవకాశాన్ని వాడుకుంటూ, వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో బలోపేతం కావాలని, ఆప్ చేతిలో నుంచి అధికారాన్ని లాక్కోవాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రాజ్యసభ ఎంపీల చేరికతో పంజాబ్‌లో బీజేపీకి అమాంతం బలం పెరిగిందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో రాబోయే ఎన్నికల సమరం ఇరు పార్టీల మధ్య హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
అప్రకటితంగా మొదలైన ఎన్నికల ప్రచారం
సోషల్ మీడియాలో వచ్చిన తాజా పోస్ట్ చూస్తుంటే, పంజాబ్‌లో బీజేపీ తన ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే సాధించిన రాజకీయ ఆకర్షణలను క్షేత్రస్థాయిలో ఓట్లుగా మలచుకునే వ్యూహాలకు ఆ పార్టీ పదును పెడుతోంది. పశ్చిమ బెంగాల్ భారీ విజయం ఇచ్చిన అమితమైన ఆత్మవిశ్వాసంతో, పంజాబ్‌లో జరగబోయే ఈ అత్యంత కీలకమైన పోరు కోసం కాషాయ దళం సర్వసన్నద్ధంగా బరిలోకి దిగుతోంది. ఆప్ అధినేత కేజ్రీవాల్ ఢిల్లీ కోటను కూల్చివేసిన బీజేపీ.. ఇప్పుడు అతని పంజాబ్ కోటను పెకిలించివేయడానికి సిద్ధం అవుతోంది. మరి ఏం జరగబోతోందో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: ఇక టీఎంసీ నేతలు ‘గుండు’కు రెడీనా?


