పుష్కరాల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి సమాధానం చెప్పాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబే అని వైసీపీ రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ
ముత్యాలవారిపాలెం (పెరవలి) : పుష్కరాల్లో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి సమాధానం చెప్పాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబే అని వైసీపీ రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. పుష్కర స్నానం కోసం బుధవారం పెరవలి మండలం ముత్యాలవారిపాలానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేయడం మాని చంద్రబాబునాయుడు శవ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తొక్కిసలాటలో 35 మంది చనిపోయారని ప్రభుత్వం ప్రకటించినా మృతుల సంఖ్య అంతకంటే ఎక్కువగానే ఉంటుందన్నారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పొదిల గ్రామానికి చెందిన ఆరవల్లి వేణుగోపాలశర్మ మంగళవారం జరిగిన తొక్కిసలాటలో మృతిచెందగా ప్రభుత్వం ప్రకటించిన మృతుల జాబితాలో అతని పేరులేదని చెప్పారు. ప్రభుత్వ అధికారులే అంబులెన్స్‌కు సొమ్ములిచ్చి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించారన్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఎస్పీ, కలెక్టర్‌కు ఫిర్యాదుచేస్తే బుధవారం చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇలా అనేకమంది మృతదేహాలను వారి ఇళ్లకు దొంగచాటుగా పంపించారని విమర్శించారు. ముఖ్యమంత్రి వీఐపీ ఘాట్‌లో స్నానం ఆచరించకుండా సామాన్య ప్రజలు చేసే ఘాట్‌లో ప్రచారం కోసం 3 గంటలపాటు పూజలు, స్నానాలు చేయటమే ఈ దుర్ఘటనకు కారణమన్నారు.
ఈ ఘటనకు బాధ్యుడైన చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని, ఈ దుర్ఘటనకు అధికారులను బాధ్యులను చేసి తప్పించుకోవాలని చూస్తే భగవంతుడు క్షమించడని అన్నారు. తొక్కిసలాటలో మృతిచె ందిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని, లేని పక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబాలకు అండగా నిలబడి పోరాటం చేస్తుందన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి వెంకటనాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల ప్రాణాల కన్నా ప్రచారమే ముఖ్యమని చంద్రబాబు భావించడం వలనే ఈ దుర్ఘటన జరిగిందన్నారు. పుష్కర ఘాట్లలో సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. భక్తులకు తాగునీరు కూడా అందించలేని స్థితిలో పుష్కర ఏర్పాట్లు చేశార న్నారు.