ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఎంతో కీలకమైనది. అర్హులైన వారికి ఈ హక్కును కల్పించేందుకు అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్:
ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ఎంతో కీలకమైనది. అర్హులైన వారికి ఈ హక్కును కల్పించేందుకు అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. అయితే వీరి కళ్లు గప్పి బోగస్ ఓటర్లు కుప్పలు తెప్పలుగా నమోదు చేసుకుంటున్నారు. ఒక్కొక్కరు రెండు, మూడు ఓట్లు కలిగి ఉన్నారు. జిల్లాలో ఇటీవల ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 1,28,847 మంది ఉన్నట్లు వెల్లడైంది. బోగస్ ఓటర్లను తొలగింపు సజావుగా సాగకపోవడానికి రాజకీయ పార్టీ పాత్ర కూడా ఎక్కువగా ఉంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ కేంద్రాల వారీగా బీఎల్‌ఏలను నియమించాల్సి ఉంది. వీరు బోగస్ ఓటర్లను గుర్తించి వాటిని తొలగించడంలో అధికారులకు సహకరించాల్సిన అవసరం ఉంది. కానీ రాజకీయ పార్టీలు వీటివైపు దృష్టి సారించడం లేదు. బీఎల్‌ఏలను నియమించిన దాఖలాలు కూడా లేవు.
బోగస్‌లు ఇలా నమోదు..
జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 18 ఏళ్లు పైబడిన జనాభా 27,11,140 ఉంది. ఓటర్ల సంఖ్య దీనికి మించలేదు. ముసాయిదా జాబితా ప్రకారం ప్రస్తుతం జిల్లాలో 28,39,987 మంది ఓటర్లు ఉన్నారు. అంటే బోగస్ ఓటర్లు 1,28,847 మంది ఉన్నట్లు స్పష్టమవుతోంది. చనిపోయిన ఓటర్లను తొలగించకుండా జాబితాలో ఉంచడం, మహిళలకు ఇటు పుట్టింటిలోను, అటు అత్తింటిలోని ఓటర్లుగా ఉండటంతో బోగస్ నమోదవుతోంది. శాశ్వతంగా గ్రామాలు వదిలి వెళ్లి మరోచోట స్థిరపడిన వారి పేర్లు రెండు చోట్ల జాబితాలో ఉంటున్నాయి.
తొలగింపులో జాప్యం..
ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరిగే సమయంలోప్రతీ ఆదివారాన్ని ఎన్నికల కమిషన్ స్పెషల్ క్యాంపైన్ డేగా ప్రకటించింది. ఆ రోజున అన్ని పోలింగ్ కేంద్రాలను తెరచి ఉంచాలి. పోలింగ్ కేంద్రంలో ముసాయిదా ఓటర్ల జాబితా ఫారం-6 దరఖాస్తులు ఉండాలి. రాజకీయ పార్టీల బీఎల్‌ఏలు కూడా పోలింగ్ కేంద్రానికి వచ్చి బోగస్ ఓటర్లను గుర్తించాల్సి ఉంది. రాజకీయ పార్టీలే పట్టించుకోకపోవడంతో బీఎల్‌ఓలు కూడా ఆదివారాల్లో పోలింగ్ కేంద్రాలకు అంతంత మాత్రంగానే వెళుతున్నట్లు సమాచారం.
యువత దూరం...
18-19 ఏళ్ల జనాభా 1,55,010 ఉంది. అయితే ఓటర్లు మాత్రం 82,205 మంది మాత్రమే ఉన్నారు. ఓటర్లుగా 72,805 మంది యువత ఓటర్లుగా నమోదు కాలేదు. వీరిలో విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణలో భాగంగా వీరందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని లక్ష్యంగా తీసుకున్నారు.
60 ఏళ్లపై బడిన వారిలోను అనాసక్తి..
60 ఏళ్లు పైబడిన వారిలోను ఓటర్లుగా నమోదయ్యేందుకు ఆసక్తి చూపడం లేదు. జనాభాతో పోలిస్తే ఓటర్లు తక్కువగా ఉన్నారు. 60 నుంచి 69 ఏళ్ల మధ్య వారి జనాభా 2,25,332 ఉంటే ఓటర్లు మాత్రం 3,27,664 మంది ఉన్నారు. 70 నుంచి 79 ఏళ్ల వయస్సు మధ్య వారి జనాభ 85,323 మంది ఉండగా ఓటర్లు మాత్రం 73,612 మంది ఉన్నారు. 80 ఏళ్లుపైబడిన జనాభ 52,833 మంది ఉండగా ఓటర్లు మాత్రం 17,057 మంది ఉన్నారు.
ఓటరుగా నమోదయ్యేందుకు 58376 దరఖాస్తులు..
ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 2వ తేదీ వరకు ఓటర్లుగా నమోదయ్యేందుకు ఫారం-6 దరఖాస్తులు 58376 వచ్చాయి. ఫారం-7 దరఖాస్తులు 2126, ఫారం-8 దరఖాస్తులు 6025, ఫారం-8ఏ దరఖాస్తులు 451 వరకు వచ్చాయి. కాగా ఓటరు నమోదు కోసం దరఖాస్తులు తీసుకునే గడువును ఎన్నికల కమీషన్ ఈనెల 17 వరకు పొడిగించినట్లు సమాచారం.
వయస్సు జనాభా ఓటర్లు
20-29 7,97,301 9,08,507
30- 39 6,33,913 7,28,105
40 -49 4,66,014 5,17,524
50 - 59 2,95,414 3,27,664
మొత్తంగా జనాభా కంటే ఓటర్లే అధికంగా ఉన్నట్లు వెల్లడవుతోంది.