షేమ్‌ టు సేమ్‌

Boat Accidents In East Godavari - Sakshi

అధికారులు, ప్రజాప్రతినిధులు దొందూ.. దొందే..

హామీలివ్వడం, ఆనక వదిలేయడం వారికి మామూలే

ప్రజా ప్రతినిధులు, అధికారులు మధ్య సమ్వయలోపం

గోదావరి దాటే లంకల వద్ద స్పీడు బోట్లు ఏర్పాటు చేస్తామన్న కలెక్టర్, డీప్యూటీ సీఎం

పదిహేను రోజుల్లో ఏర్పాటు చేస్తామని చెప్పిన సీఎం

సాక్షి,తూర్పు గోదావరి,  రాజమహేంద్రవరం:  ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మీడియా ముందుకొచ్చి ‘‘అది చేస్తాం.. ఇది చేస్తాం’’ అని చెప్పి ఆనక మిన్నుకుండిపోవడంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పోటీ పడుతున్నారు.దీనికి కోనసీమలో లంక గ్రామాలకు రవాణా కల్పించడంలో చేసిన ప్రకటనలే నిదర్శనం. జూలై 14న ఐ.పోలవరం మండలం పశువుల్లంక మొండి–సలాదివారిపాలెం మధ్య వృద్ధ గౌతమిలో పడవ బోల్తా పడిన ఘనటలో ఒక మహిళతో సహా ఏడుగురు విద్యార్థినులు గల్లంతయ్యారు. అందులో ముగ్గురు విద్యార్థినుల జాడ ఇప్పటికీ లేదు. వారం రోజలు గాలించి వదిలేశారు. అప్పట్లో ఉపముఖ్యమంత్రి చినరాజప్ప, కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ గోదావరి దాటి లంకల్లోకి వెళ్లే  ఎనిమిది ముఖ్యమైన ప్రాంతాల్లో రెండు మూడు నెలల్లో పంట్లు ఏర్పాటు చేస్తామని, అప్పటి వరకు అక్కడ ప్రభుత్వం తరఫున స్పీడు బోట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రోజులు దాటి నెలలు గడిచినా వాటిని ఏర్పాటు చేయలేదు.

ఆయన కూడా హామీ ఇచ్చారు..
గత నెల 22న గోదావరి వరదలపై సమీక్షకు వచ్చిన సీఎం చంద్రబాబు వద్ద మీడియా స్పీడు బోట్ల ఏర్పాటు అంశాన్ని లేవనెత్తగా 15 రోజుల్లో ఏర్పాటు చేస్తామని సీఎం కూడా హామీ ఇచ్చారు. రేపటితో ఆ గడువు ముగుస్తోంది. కానీ ఏర్పాటు చేయలేదు. ఫలితంగా ఆదివారం ఐ.పోలవరం మండలం రామాలయం పేట– జి.మూలపొలం మధ్య వృద్ధ గౌతమిలో పడవ ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ ఘటనలో ఓ మోటారు సైకిల్‌ నదిలో పడిపోగా అదృష్టవశాత్తూ పడవలో ఉన్న 30 మంది ప్రాణాలతో బయట పడ్డారు.

ఆ ఘటన తర్వాత ప్రమాదాలు..
పశువుల్లంక మొండి ప్రమాదం తర్వాత కూడా అనేక ప్రమాదాలు జరిగాయి. కొన్ని త్రుటిలో తప్పాయి. గత నెల 20న ముమ్మిడివరం మండలం గురజాపు లంక వద్ద పడవ తాటి చెట్టుకు ఢీకొని నదిలో బోల్తా పడింది. ఈ ఘనటలో బుచ్చి మహేశ్వరరావు అనే 26 ఏళ్ల యువకుడు గల్లంతై ప్రాణాలు కోల్పోయారు. పడవలో ఉన్న మరో 14 మంది నదిలో పడిపోయినా బ్యాగులు, కూరగాయల సంచులు పట్టుకోవడం ద్వారా బతికి బయటపడ్డారు. ఇదే విధంగా ఆదివారం రామాలయం పేట– జి.మూలపొలం మధ్య ప్రమాదం జరిగింది. 30 మంది ప్రజలు, మోటారు సైకిళ్లతో వెళుతున్న పడవలో సరంగు ఓ పక్కకు వెళ్లడంతో పడవ వాలి మోటారు సైకిల్‌ నదిలో పడింది. వెంటనే సరంగు మధ్యలోకి రావడంతో పడవ యథాస్థితికి వచ్చింది. అప్పటికే పడవలో ఉన్న వారు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఏ మాత్రం ఒక్కరు లేచి కంగారు పడినా పడవ బోల్తా పడేది. ఇందులో రోజువారీ కూలి పనులకు వేళ్లే మహిళలు ఉన్నారు. అదృష్టవశాత్తూ ప్రాణ హానీ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కలెక్టర్‌ గారూ ఇకనైనా మేల్కొండి
ప్రతి సోమవారం గ్రీవెన్స్‌ సెల్‌లో కలెక్టరేట్‌ వద్ద ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా వేలాది మంది సమస్యను కళ్లారా చూసినా పట్టించుకోకపోవడం లంక వాసులకు శాపంగా మారింది. స్పీడు బోట్లు ఏర్పాటు చేస్తామని తాను ఇచ్చిన హామీని కలెక్టర్‌ కార్తికేయ మిశ్ర మరచిపోడం విడ్డూరంగా ఉంది. పశువుల్లంక ప్రమాద సమయంలో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక, నావీదళం, ఇతర శాఖాధికారులు, సిబ్బంది వందల సంఖ్యలో గల్లంతైన వారి కోసం వారం రోజులపాటు వెతికారు. హెలికాప్టర్‌తోనూ గాలించారు. రూ.కోట్లు ఖర్చు చేశారు. మరో మారు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా స్పీడు బోట్లు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు నివారించవచ్చు.

ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి..
కోనసీమ ప్రాంతంలో పశువుల్లంక మొండి– సలాదివారిపాలెం, గుత్తున దీవి– గోగుల్లంక, జి.మూలపొలం– రామాలయంపేట, గంటిపెదపూడి– పేదపూడి లంక, పల్లంకుర్రు– పెద్దలంక, కరవాక– వాడలరేవు, గోదావరి ఎగువన ఏజెన్సీ ప్రాంతంలోని కూనవరం– రుద్రమకోట, దేవీపట్నం– సింగనాపల్లి మధ్య పంట్లు ఏర్పాటు చేసే వరకు స్పీడు బోట్లు తిప్పడం వల్ల ప్రాణ నష్టం నివారించవచ్చు. ఆ దిశగా ఇకనైనా కలెక్టర్‌ కార్తికేయ మిశ్ర అడుగులు వేయాలని కోనసీమ లంక గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top