
ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న గవర్నర్ హరిచందన్
సాక్షి, అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూను పాటించాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రజలను కోరారు. కోవిడ్ అంతకంతకూ వ్యాప్తి చెందుతుండడంతో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో గవర్నర్ ఏం తెలిపారంటే..
- ఎవరికి వారు తమ దాకా రాదులే అనే భావనలో ఉండొద్దు. బయట ఎంత ఎక్కువగా తిరిగితే అంత నష్టం వాటిల్లుతుంది. మనతోపాటు కుటుంబీకులు, ఇరుగు పొరుగువారు వైరస్ బారిన పడే ప్రమాదముంది.
- ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా అందరూ ఇళ్లలోనే ఉండాలి.
- ప్రతి ఒక్కరూ కనీసం పది మందికి ఈ సందేశాన్ని చేరవేసి చైతన్యవంతం చేయాలి.
- జనతా కర్ఫ్యూ ఆవశ్యకతను స్వచ్ఛంద సంస్థలు, రెడ్‌క్రాస్, ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్‌ఎస్‌ఎస్ వంటివి కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి.
- ప్రతి చోటా సామాజిక దూరం పాటించాలి. కొన్ని వారాల పాటు ఇంటి నుంచే పనిచేయాలి.
- మానవాళి మనుగడ కోసం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి పౌరుడు తనదిగా భావించాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయి.
ఉన్నతాధికారులతో సమీక్ష
కాగా, కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని గవర్నర్ అధికారులకు సూచించారు. ప్రభుత్వం, పౌర సమాజం సంయుక్త భాగస్వామ్యంతోనే ఈ మహమ్మారిని అదుపులోకి తీసుకురాగలమని చెప్పారు. రాజ్‌భవన్‌లో శనివారం కోవిడ్‌పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, కోవిడ్‌పై రాష్ట్ర ప్రత్యేక అధికారి విజయ రామరాజు, కేంద్రం ప్రత్యేకంగా నియమించిన అధికారి సురేష్‌కుమార్‌తో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.