మెడలు వంచి.. మేడలు కట్టాలని!
రాజధాని ప్రతిపాదిత ప్రాంత రైతులను భూ సమీకరణకు ఒప్పించేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది.
సాక్షి, గుంటూరు : రాజధాని ప్రతిపాదిత ప్రాంత రైతులను భూ సమీకరణకు ఒప్పించేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. ముఖ్యంగా ఈ నెల 8వ తేదీన సింగపూర్ మంత్రి ఈశ్వరన్ రాజధాని ప్రాంతాన్ని సందర్శించనున్న నేపథ్యంలో ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోంది. మంత్రి పర్యటనలో రైతుల నుంచి ఎక్కడ ఆగ్రహం ఎదుర్కోవలసి వస్తుందోనన్న భయం వెంటాడుతోంది. ముందస్తుగా ప్రభుత్వం ఉపశమన చర్యలకు ఉపక్రమించింది.
కృష్ణానది తీరంలో సారవంతమైన జరీబు భూములు కలిగిన తుళ్లూరు మండలంలోని తొమ్మిది గ్రామాల రైతులు, మంగళగిరి మండలంలోని నిడమర్రు, తాడేపల్లి మండలంలోని ఉండవల్లి,పెనుమాక గ్రామాల్లో భూసమీకరణపై రైతుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఆ గ్రామాల రైతులను భూ
సమీకరణకు ఒప్పించే దిశగా ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇప్పటికే మొదటి విడతలో 29 గ్రామాల రైతులతో ముఖ్యమంత్రి ఓ సారి చర్చించారు. అయితే భూసమీకరణకు అనుకూలంగా ఉన్న రైతులతోనే ముఖ్యమంత్రి సమావేశమైనట్టు అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. వెంకటపాలెం వంటి కొన్ని గ్రామాల రైతులు సీఎంతో సమావేశానికి వెళ్లలేదు.
తుళ్లూరు, ఐనవోలు, శాఖమూరు, నీరుకొండ, దొండపాడు వంటి గ్రామాల రైతులు మొదటి నుంచి రాజధానికి భూములు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. కరకట్ట గ్రామాల రైతులు మాత్రం భూములు ఇచ్చేందుకు ససేమిరా అంటూ పంచాయతీ తీర్మానాలను సైతం చేశారు.
నేడు రైతులతో సీఎం సమావేశం...
భూ సమీకరణపై రైతులకు ఉన్న అపోహలను తొలగించేందుకు ముఖ్యమంత్రి రెండోసారి రంగ ప్రవేశం చేస్తున్నారు. మంత్రుల సబ్ కమిటీకి ఈ బాధ్యతను అప్పగించినప్పటీకి రైతుల సందేహాలను నివృత్తి చేయడంలో విఫలమయ్యారని సీఎం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. గురువారం జరిగే సమావేశానికి ముందే మంత్రుల సబ్ కమిటీ బుధవారం గుంటూరు లేదా విజయవాడలో రైతులతో సమావేశం ఏర్పాటుచేసి ల్యాండ్ పూలింగ్‌పై ఉన్న అపోహలను తొలగించాలని సీఎం సూచించినట్లు సమాచారం.
జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అందుబాటులో లేకపోవడంతో గుంటూరులో రైతుల సమావేశం నిర్వహించలేకపోయినట్లు తెలుస్తోంది. విజయవాడలో నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా సమావేశం నిర్వహించాలని ప్రయత్నించినా రైతులు నిరాకరించినట్లు తెలుస్తోంది.
భూ సమీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్న రైతులకు సీఎం పేషీ నుంచి ముఖ్యమంత్రితో హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం జరిగే సమావేశానికి హాజరు కావాలంటూ మంగళవారం రాత్రే ఫోన్లు వెళ్లినట్లు సమాచారం.
ఈ నెల 10వ తేదీన జరిగే మంత్రి వర్గ సమావేశం నాటికి భూసమీకరణ విధివిధానాలు రూపొందించి ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది.ఈ నేపథ్యంలోనే గురువారం జరిగే సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకొంది. సీఎంతో సమావేశానికి వెళ్లాలా వద్దా, వెళితే సీఎం ముందు ఎలాంటి ప్రతిపాదనలు ఉంచాలి అనే దానిపై రాయపూడిలో బుధవారం సాయంత్రం రైతులు సమావేశమయ్యారు.


